పట్టుకుంటే రూ. 10 | rat catching pad in andhra pradesh | Sakshi
Sakshi News home page

పట్టుకుంటే రూ. 10

Published Sun, Sep 6 2015 11:24 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

పట్టుకుంటే రూ. 10

పట్టుకుంటే రూ. 10

గుంటూరు ఘటనతో ఆస్పత్రుల్లో మూషికాలపై ఏపీ సర్కారు ఆదేశం
 
హైదరాబాద్: చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది ఏపీ సర్కారు వ్యవహారం. గుంటూరు జిల్లా సమగ్ర ఆస్పత్రిలో పసికందును ఎలుకలు కొరికిన ఘటన అనంతరం కళ్లు తెరిచింది. ఎలాగైనా ప్రభుత్వాస్పత్రుల్లో మూషికాలను మట్టుబెట్టాలని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్కో ఎలుకను పట్టిన వారికి రూ.10 ప్రకటించింది. ఇంకేముంది.. ఇప్పుడు ఎలుకలు పట్టే వారికి గిరాకీ పెరిగింది. చిట్టెలుక, చుంచు.. ఇలా ఏదైనా ఒక ఎలుకకు ఒకే ధర.
 
 పందికొక్కులకు మాత్రం రేటు నిర్ధరించలేదు. మొత్తం 11 వైద్య కలాశాలలతో పాటు వాటికి అనుబంధంగా ఉన్న పెద్దాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోనూ ఎలుకలను నిర్మూలించాలని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు ఇకపై 15 రోజులకోసారి ఎన్ని ఎలుకలను పట్టిందీ నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఎలుకలను పట్టినందుకు అయ్యే వ్యయాన్ని ఆస్పత్రి అభివృద్ధి కమిటీ నుంచి ఖర్చు చేసుకునే వీలుంటుంది.
 
 లక్షలకు చేరిన ఎలుకల సంతానం..
 కొన్నేళ్లుగా ఎలుకలపై నివారణ చర్యలు తీసుకోకపోవడంతో వాటి సంతానం లక్షలకు చేరుకుని ఉంటుందని ఓ పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ అన్నారు. తాజాగా గుంటూరులో జరిగిన ఘటన అనంతరం వారంలో 400 పైగా ఎలుకలను పట్టుకున్నట్టు ప్రభుత్వానికి నివేదిక అందింది. ఇవి కూడా నాలుగైదు వార్డుల్లోనే. దీన్నిబట్టి ఎలుకల సంతానం అపరిమితంగా పెరిగిపోయిందని తెలుస్తోంది. రోగి ఐసీయూ బెడ్‌పై ఉంటూండగానే పడకపై తిరుగుతూ గెంతులేసే స్థాయికి ఎలుకలు చేరుకున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
 మొదట డ్రైనేజీలు చక్కదిద్దాలి..
 ఎలుకలను నిర్మూలించాలంటే ముందు డ్రైనేజీ పరిస్థితులను చక్కదిద్దాలని, ఊరికే బోన్లు పెడితే అవి వచ్చి ఇరుక్కునే పరిస్థితి లేదని ఆస్పత్రుల సిబ్బంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎలుకలను పట్టడం కూడా పారిశుధ్య కాంట్రాక్టరుదే బాధ్యతని ప్రభుత్వం చెబుతోంది. అయితే కాంట్రాక్టర్లు మాత్రం తాము పారిశుధ్యం చేస్తాం గానీ, ఎలుకలను ఎలా పట్టుకోగలమని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇకపై రోగులపైకి ఎలుకలు వచ్చాయంటే డ్యూటీలో ఉన్న వైద్యుడు, ఆర్‌ఎంఓ, స్టాఫ్ నర్సులే బాధ్యత వహించాలని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement