రైతు యూనిట్‌గా పంటల బీమా అమలుకు సన్నాహాలు
రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటుకు సన్నాహాలు
25వ తేదీ నాటికి మార్గదర్శకాలు ఖరారు చేయనున్న ఐఆర్‌డీఏ
హైదరాబాద్: రిమోట్ సెన్సింగ్ చిత్రాల సాయంతో ఒక రైతుకు చెందిన వ్యవసాయభూమిలో పంట నష్టం ఎంత జరిగిందో తేల్చి ‘రైతు యూనిట్‌గా పంటల బీమా’ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏ) నిర్ణయించినట్లు తెలిసింది. దేశంలోనే మొట్టమొదటగా రైతు యూనిట్‌గా పంటల బీమాకు రాష్ట్రంలో సన్నాహాలు జరుగుతున్నాయి. పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు వ్యవసాయశాఖతో కలసి డీఆర్‌డీఏ కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 25వ తేదీ నాటికి పెలైట్ ప్రాజెక్టు ఎలా ఉండాలి? ఎలా అమలు చేయాలన్న దానిపై ఐఆర్‌డీఏ మార్గదర్శకాలు ఖరారు చేయనుంది.
దిగుబడి తగ్గింపుపై నిర్ణయం ఎలా?
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత పంటల బీమా పథకంపై తీవ్ర అసంతృప్తితో ఉంది. వ్యక్తిగతంగా రైతుకు నష్టం జరిగితే బీమా ద్వారా నష్టపరిహారం అందడం లేదని భావించింది. ఈ మేరకు వ్యక్తిగతంగా పంట నష్టం జరిగినప్పటికీ రైతుకు బీమా సొమ్ము అందాల్సిందేనంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దీనిపై పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఐఆర్‌డీఏ సహా పలు బీమా కంపెనీలు కూడా దీనిపై సుముఖత వ్యక్తం చేశాయి. దీనిపై ఈ నెల 25వ తేదీన జరిగే కీలక సమావేశం జరిగే నాటికి మార్గదర్శకాలు ఖరారు చేయనున్నారు. పంటల నష్టానికి సంబంధించి ఒక గ్రామానికి లేదా మండలానికి జరిగిన నష్టాన్ని అంచనా వేయడం సాధ్యమే కానీ... ఒక రైతుకు వ్యక్తిగతంగా జరిగిన నష్టాన్ని ఎలా అంచనా వేయగలం అన్న దానిపైనే బీమా సంస్థలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పైగా దిగుబడి ఎంత తగ్గిందనే అంశాన్ని రైతు వారీగా నిర్ణయించడం ఏ మేరకు సాధ్యమనే ప్రశ్న తలెత్తింది. ఈ నేపథ్యంలోనే రిమోట్ సెన్సింగ్ చిత్రాల సాయంతో సంబంధిత రైతు వ్యవసాయ భూమిలో పంట ఏమేరకు నష్టం జరిగిందోనని అంచనా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, కరువు, అతివృష్టి సమయాల్లో పంట నష్టపోయిన రైతులందరికీ సామూహికంగా బీమా చెల్లించడం కుదరదన్న దానికి కూడా పరిష్కారం కనుక్కోవాలని భావిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టు...
రైతు యూనిట్‌గా పంటల బీమా అమలు చేయడం దేశంలోనే మొదటిసారి కాబట్టి ముందుగా పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో అమలు చేయాలని యోచిస్తున్నారు. అయితే అన్ని జిల్లాల్లోని కొన్ని మండలాలు లేదా గ్రామాల్లో అమలు చేయాలా? లేకపోతే ఒకే జిల్లాలోని నిర్ణీత గ్రామాల్లో అమలు చేయాలా? అన్న విషయంపై ఇంకా నిర్ణయానికి రాలేదు.
రిమోట్ సెన్సింగ్‌తో పంట నష్టం అంచనా
Published Tue, Aug 18 2015 12:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement