సైబర్ బుల్లీయింగ్‌కు ‘రీ థింక్’తో చెక్ | rethink app that counters cyber bullying | Sakshi
Sakshi News home page

సైబర్ బుల్లీయింగ్‌కు ‘రీ థింక్’తో చెక్

Published Sat, Sep 12 2015 5:22 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

సైబర్ బుల్లీయింగ్‌కు ‘రీ థింక్’తో చెక్

సైబర్ బుల్లీయింగ్‌కు ‘రీ థింక్’తో చెక్

సైబర్ ప్రపంచంలో కూడా అమ్మాయిలను వేధించే, బెదిరించే యువకులు పెరిగిపోయారు. అలాగే వాళ్ల బెదిరింపులకు బెంబేలెత్తిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న అమ్మాయిల సంఖ్య కూడా పెరిగిపోతోంది. సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ సమస్య పరిష్కారానికి త్రిషా ప్రభు అనే 15 ఏళ్ల అమ్మాయి ఓ చక్కటి పరిష్కారాన్ని కనుగొన్నది. ఆన్‌లైన్‌లో బెదిరింపులను, అసభ్య, అభ్యంతరకర పదజాలాన్ని ఫిల్టర్ చేసే ‘రీ థింక్’ (మరోసారి ఆలోచించండి) అనే యాప్ను రూపొందించింది.

ఈ యాప్‌ను ఉపయోగిస్తే ‘టైప్ చేసిన మెసేజ్ లేదా మ్యాటర్’లో ఉన్న అభ్యంతరకర పదాలను గుర్తిస్తుంది. వెంటనే ‘రీ థింక్’ అనే మెసేజ్‌ను పంపిస్తుంది. ఈ యాప్ అభ్యంతరకర మెసేజ్ ఇచ్చేవారికి, అలాంటి మెసేజ్ల బాధితులకూ ఉపయోగపడుతోందని త్రిష చెబుతోంది. కీ బోర్డు కలిగిన అన్ని సాఫ్ట్‌వేర్ ప్లాట్ఫారాలపైనా, టెక్స్ట్ మెసేజ్ సహా అన్ని సామాజిక వెబ్‌సైట్లలో ఈ యాప్ పనిచేస్తోందని త్రిష తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్‌కు రెండేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. త్రిషకు 13 ఏళ్లున్నప్పుడు, సైబర్ బెదిరింపులకు భయపడి 11 ఏళ్ల అమ్మాయి ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కథనం చదివింది. త్రిషకు కూడా అనేక సైబర్ బెదిరింపులు వచ్చాయట. ఆమె మానసికంగా బలమైన అమ్మాయి కావడంతో అలాంటి బెదిరింపులను లెక్కచేయలేదు. బెదిరింపులకు భయపడి తనతోటి అమ్మాయిలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అధ్యయనం చేయాలని అప్పుడే త్రిష ఓ నిర్ణయానికి వచ్చింది. టీనేజ్ అమ్మాయిలు, అబ్బాయిల మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ల మెదళ్లు ఎలా పనిచేస్తాయి ? అన్న అంశంపై అనేక పుస్తకాలను అధ్యయనం చేసింది. టీనేజ్ దశ బ్రేకుల్లేకుండా దూసుకుపోయే కారు లాంటిదని అర్థం చేసుకుంది. వాటికే బ్రేకులేస్తే...అన్న ఆలోచన కలిగింది త్రిషకు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు బ్రేకులుంటే ఫలితం ఉంటుందని భావించింది. ఆ ఆలోచనలో నుంచే పుట్టుకొచ్చింది ‘రీ థింక్’ యాప్. 1500 యూజర్లపై ప్రయోగించి చూసింది. 93 శాతం ఫలితం వచ్చింది.

ఈ యాప్‌ను రూపొందించిన త్రిషను 2014లో జరిగిన గూగుల్ సైన్స్ ఫేర్‌లో గూగుల్ సత్కరించింది. ఆ సందర్భంగా వచ్చిన డబ్బులను ఉపయోగించి యాప్‌ను మరింత అభివృద్ధి చేసింది త్రిష. త్వరలోనే ‘ఐట్యూన్స్’ ద్వారా కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు కృషి చేస్తున్నానని ప్రస్తుతం అమెరికాలోని నాపర్‌విల్లీలో చదువుకుంటున్న ఆమె తెలిపింది. మన చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కరించేందుకు డాక్టర్లు, ఐన్‌స్టీన్ లాంటి శాస్త్రవేత్తలు కానవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే తనలాగా ఎవరైనా పరిష్కరించవచ్చని ఆమె చెబుతోంది.

Advertisement
Advertisement