సైబర్ దబాయింపులు పెరుగుతున్నాయి
ఫోన్ రింగ్ అవుతూంటే మీ అబ్బాయి/అమ్మాయి ఆందోళనకు గురవుతున్నారా?
సోషల్ మీడియా అకౌంట్లు అకస్మాత్తుగా డిలీట్ చేస్తున్నారా?
స్కూల్ ఎగ్గొట్టేందుకు చిత్రవిచిత్రమైన సాకులు చెబుతున్నారా?
...అయితే వాళ్లు సైబర్ దబాయింపుల (సైబర్ బుల్లీయింగ్)కు గురవుతున్నట్లే లెక్క అంటోంది సైబర్ సెక్యూరిటీ సంస్థ నార్టన్. ఇంటర్నెట్ రంగంలో సైబర్ దబాయింపు ధోరణులు పెరిగిపోతున్నాయని, పిల్లలు ఆటస్థలంలోనే కాకుండా సైబర్ ప్రపంచంలోనూ దౌర్జన్యానికి బాధితులవుతు న్నారని తల్లిదండ్రులూ నమ్ముతున్నట్లు నార్టన్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. సంస్థ కంట్రీ మేనేజర్ ఈ అధ్యయన వివరాలను ‘‘2016: నార్టన్ సైబర్ సెక్యూరిటీ ఇన్‌సైట్స్ రిపోర్ట్’’రూపంలో విడుదల చేశారు. దాని ప్రకారం... దేశంలోని దాదాపు 40 శాతం మంది తల్లిదండ్రులు పదకొండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకూ ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తెస్తున్నారని తేలింది. అదేసమయంలో సగం కంటే ఎక్కువమందిలో సైబర్ ప్రపంచం కారణంగా తమ పిల్లలు దబాయింపులకు గురవుతున్నారన్న ఆందోళన కూడా వ్యక్తమైంది. దీంతోపాటు వైరస్, దురుద్దేశపూరిత సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశాలపై 71 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తే.. వ్యక్తిగత సమాచారం అపరిచితులకు అందిస్తారన్న ఆందోళన 69 శాతం మంది వ్యక్తం చేశారు.
పిల్లల ఆన్‌లైన్ చర్యల వల్ల కుటుంబం మొత్తం ఇబ్బందులకు గురికావాల్సి రావచ్చునని 62 శాతం మంది భావిస్తే.. హ్యాకింగ్ వంటి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవచ్చునని 61 శాతం మంది అంచనా వేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు భారతీయ తల్లిదండ్రులు కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారని నార్టన్ ఇన్‌సైట్స్ రిపోర్ట్ తెలిపింది. తరచూ పిల్లలు ఉపయోగించిన బ్రౌజర్ హిస్టరీని వెతకడం వీటిల్లో ఒకటి. దాదాపు సగం మంది కేవలం తమ సమక్షంలో మాత్రమే ఇంటర్నెట్ వాడేలా, లేదంటే కొన్ని ఆంక్షలతో వాడటానికి అనుమతి ఇస్తున్నారని పేర్కొంది. సైబర్ దబాయింపులను నివారించేందుకు తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నార్టన్ సూచిస్తోంది.
సాక్షి నాలెడ్జ్ సెంటర్