73 పైసలు బలపడిన రూపాయి
73 పైసలు బలపడిన రూపాయి
Published Fri, Oct 4 2013 1:40 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
ముంబై: అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడిన నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం గురువారం 73 పైసలు (1.17 శాతం) పుంజుకొని రూ.61.73 వద్ద ముగిసింది. ఇది దాదాపు ఏడు వారాల గరిష్టస్థాయి. అమెరికా షట్‌డౌన్ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీని కొనసాగిస్తుందన్న అంచనాలతో డాలర్ క్షీణించి, రూపాయి బలపడిందని నిపుణులంటున్నారు. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, స్టాక్ మార్కెట్లు పరుగులెత్తడం కూడా రూపాయి పుంజుకోవడానికి దోహదపడ్డాయి. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో బుధవారం ముగింపు 62.46 నుంచి గురువారం డాలర్‌తో రూపాయి మారకం రూ.62.15 వద్ద ప్రారంభమైంది. 62.22 వద్ద కనిష్ట స్థాయికి పడిపోయింది. మళ్లీ 61.65 గరిష్ట స్థాయికి ఎగసి చివరకు 73 పైసలు బలపడి 61.73 వద్ద ముగిసింది. ఆగస్టు 16 తర్వాత ఇదే గరిష్ట స్థాయి. రూపాయి రూ.61.00-రూ.62.80 రేంజ్‌లోనే ట్రేడవుతుందని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్(ఇండియా) సీఈవో ప్రమిట్ బ్రహ్మభట్ అంచనా వేస్తున్నారు.
Advertisement