శబరిమలలో రష్యన్ భక్తుల శరణుఘోష!!
వాళ్లంతా నల్లటి దుస్తులు వేసుకున్నారు.. తలపై ఇరుముడులు పెట్టుకున్నారు. శబరిమల వెళ్లారు. శరణమయ్యప్పా.. అంటూ శరణుఘోష చేస్తున్నారు. ఇందులో వింతేముంది, ప్రతియేటా భక్తులు శబరిమలకు వెళ్తూనే ఉంటారు కదా అంటారా? కానీ వాళ్లంతా రష్యన్లు కావడమే ఇక్కడ విశేషం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 14 మంది రష్యన్ భక్తులు అయ్యప్ప దేవాలయంలో పూజలు చేశారు. అంతకుముందు 41 రోజుల పాటు నిష్ఠగా దీక్ష పాటించి మండలపూజలు కూడా వాళ్లు పూర్తి చేసుకోవడం గమనార్హం.
సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వచ్చిన పదుకోవా అలియాస్ 'ఇందుచోడన్' ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఆయనో ఆయుర్వేద వైద్యుడు, రష్యాలో ఉపాధ్యాయుడు. ఆయన వరుసగా 15వ ఏడాది శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకుంటున్నారు. ఈ బృందంలో పలువురు వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఉన్నారు. వీళ్లు కూడా ఇంతకుముందు శబరిమలలో అయ్యప్ప దర్శనం చేసుకున్నవాళ్లే. వీళ్లలో ఓ చిన్నారి తన నాయనమ్మతో కలిసి వచ్చింది. వాళ్లిద్దరూ మాత్రం తొలిసారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ పర్యటన అనుభవం చాలా అద్భుతంగా ఉందని వాళ్లు అంటున్నారు. మొత్తం బృంద సభ్యులు మాస్కోలో బయల్దేరి ఇడుక్కిలోని పాంచాలిపీడ ఆశ్రమానికి చేరుకున్నారు. అక్కడినుంచి ఇరుముడి తీసుకుని శబరిమల బయల్దేరారు.