సాక్షి, హైదరాబాద్ : నేను శక్తి.. అంటూ నారీలోకం గళమెత్తింది. స్త్రీ శక్తిని నలుచెరుగులా చాటి చెప్పింది. లింగ వివక్ష, గృహహింస, వేధింపులకు వ్యతిరేకంగా కదం తొక్కింది. మహిళా సాధికారత కోసం నినదించింది. మహిళాభ్యున్నతికి గత నెలరోజులుగా ‘సాక్షి’నిర్వహించిన ‘నేను శక్తి’అక్షర ఉద్యమ ముగింపు ఉత్సవం బుధవారం హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లోని సమావేశ మందిరంలో అంగరంగ వైభవంగా జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒకరోజు ముందు మహిళల కోసం, మహిళల చేత, మహిళలే ముందుండి నిర్వహించిన ఈ కార్యక్రమం వారిలో నూతనోత్సాహం, ఉత్తేజాన్ని నింపింది. మహిళా హక్కుల ఉద్యమకారులు, కార్యకర్తలు, రచయిత్రులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, విద్యార్థినులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రదర్శించిన అమ్మ, అద్దిల్లు, లివింగ్ ఐడల్, చిట్టితల్లి లఘు చిత్రాల్లోని కీలక సన్నివేశాలు సమాజంలో నిత్యం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు అద్దంపట్టాయి.
సెలబ్రిటీలూ బాధితులే..
విద్యా, ఆర్థిక స్థిరత్వంతోనే మహిళలు సాధికారత సాధించగలుగుతారని ప్రముఖ సినీ నటి, బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అమల అక్కినేని చేసిన కీలకోపన్యాసం అందరినీ ఆకట్టుకుంది. సెలబ్రిటీలైన తాము సైతం సమాజంలో భౌతిక, మానసిక వేధింపులకు గురికాక తప్పట్లేదని తన స్వీయ అనుభవాలను గుర్తు చేసుకున్నారు. మహిళల హక్కులు, లింగ సమానత్వంపై సాంస్కృతిక, మహిళా హక్కుల కార్యకర్తలు దేవి, కాకర్ల సజయల ప్రసంగాలు ఆలోచింపజేశాయి.
మహిళల కోసం ‘నేను శక్తి’పేరుతో అక్షర ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ‘సాక్షి’ప్రతినిధులు తనను సంప్రదించినప్పుడు.. ఇందులో కొత్తదేముంది? అంద రూ చేసే కార్యక్రమమేనని తొలుత భావించానని, అయితే ఈ కార్యక్రమం తన అంచనాలకు మించి విజయవంతమైందని దేవి ప్రశంసించారు.
ఈ ఉద్యమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని, అందరి సలహాలు, సూచనలతో మరో దశకు తీసుకెళ్లాలని సూచించారు. తెలుగు సినీ రంగంలో తనకు ఎదురైన వేధింపులు, వివక్షపై పాటల రచయిత్రి శ్రేష్ట ఈ కార్యక్రమంలో నిర్భయంగా మాట్లాడారు. వృత్తి జీవితంలో తన ఎదుగుదలలో ‘సాక్షి’కీలక పాత్ర పోషించిందని ప్రముఖ ఫ్యామిలీ కౌన్సెలర్, న్యాయవాది నిశ్చలరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
పురస్కారాల ప్రదానం
ఆడపిల్ల పుట్టిందని వివక్ష చూపకుండా కూతుళ్లను ప్రయోజకురాలుగా తీర్చిదిద్దిన పలువురు తల్లిదండ్రులతో పాటు మహిళల సమస్యలపై లఘు చిత్రాలు రూపొందించిన వారికి ‘సాక్షి’గ్రూప్ చైర్‌పర్సన్ వైఎస్ భారతీరెడ్డి, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ రాణిరెడ్డి, అమల అక్కినేని నగదు పురస్కారాలు, జ్ఞాపికలు అందజేశారు. ‘సాక్షి’టీవీ ప్రజెంటర్ స్వప్న యాంకరింగ్‌లో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కార్యక్రమం జరిగింది. మహిళల కోసం ‘సాక్షి’అక్షర యజ్ఞం ఇకపై కూడా కొనసాగుతుందని రాణిరెడ్డి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment