ఇరాన్ లోని సౌదీ ఎంబసీపై దాడి దృశ్యం
రియాద్: ఇరాన్ తో సౌదీ అరేబియా దౌత్య సంబంధాలు తెంచుకుంది. 48 గంటల్లోగా తమ దేశం విడిచి వెళ్లిపోవాలని ఇరాన్ దౌత్యవేత్తలను ఆదేశించింది. ఇరాన్ లోని తమ దౌత్య కార్యాలయంపై దాడి జరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సౌదీలో షియా వర్గీయుల మతపెద్ద నిమ్ర్ అల్ నిమ్ర్‌ను ఉరి తీయడంతో ఇరాన్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. సౌదీ దౌత్య కార్యాలయంపై ఆదివారం పెట్రోల్ బాంబులు, రాళ్లతో ఆందోళనకారులు దాడికి దిగారు.
ఈ దాడి గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సౌదీ విదేశాంగ మంత్రి ఆదెల్ ఆల్-జుబేర్ తెలిపారు. ఈ దాడి నుంచి బయటపడ్డ తమ దౌత్యవేత్తలు సురక్షితంగా దుబాయ్ చేరుకున్నారని వెల్లడించారు. తమ దౌత్య కార్యాలయంపై దాడిని అడ్డుకునేందుకు ఇరాన్ ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. ఆయుధాలు సరఫరా చేస్తూ అల్‌ఖాయిదాకు ఇరాన్ అండగా నిలుస్తోందని అన్నారు.
నిమ్ర్ అల్ నిమ్ర్‌కు మరణశిక్ష అమలు చేయడాన్ని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఖండించారు. సౌదీ అరేబియా అమానవీయంగా ప్రవర్తించిందని వ్యాఖ్యానించారు. సౌదీ ఎంబసీపై దాడికి పాల్పడినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు.