యువరాజు ఔదార్యం
సామాజిక సేవకు సౌదీ ప్రిన్స్ రూ. 2 లక్షల కోట్ల దానం
రియాద్: సౌదీ అరేబియా యువరాజు అల్వలీద్ బిన్ తలాల్ తన రూ. 2 లక్షల కోట్ల సంపదను సమాజసేవకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ప్రజాసేవ కోసం తాను తీసుకున్న ఈ నిర్ణయం సమాజ అభివృద్ధికి, మహిళల సాధికారతకు, యువత నైపుణ్యాభివృద్ధికి, విపత్తు సహాయానికి ఉపయోగపడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం ఒక ప్రణాళికను రూపొందించి చారిటీ ప్రాజెక్టుల ద్వారా ఈ నిధులను వినియోగిస్తామని, ట్రస్టుల బోర్డుకు తాను చైర్మన్‌గా ఉంటానని తెలిపారు. అమెరికాలోని బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ తరహాలో తన చారిటీ ట్రస్ట్ పని చేస్తుందని వెల్లడించారు. అల్వలీద్‌కు ప్రభుత్వ పదవి ఏదీ లేదు. ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కింగ్‌డమ్ హోల్డింగ్ కంపెనీ యాజమాన్య వాటా కాకుండా ఇతరత్రా ఉన్న సంపదను మాత్రమే ఈ చారిటీకి అప్పగిస్తున్నారు. అల్వలీద్ గత జనవరిలో చనిపోయిన సౌదీరాజు అబ్దుల్లాకు సమీప బంధువు.