రోహింగ్యాల కోసం సౌదీ రాజు భారీ వితరణ
వాషింగ్టన్ : రోహింగ్యా ముస్లిం శరణార్థుల సహాయార్థం సౌదీ అరేబియా రాజు సల్మాన్ భారీ వితరణ ప్రకటించారు. 15 మిలియన్ డాలర్ల సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
సౌదీ నుంచి ఓ ప్రత్యేక బృందం బంగ్లాదేశ్‌కు వెళ్తుందని, అక్కడ శరణార్థుల పరిస్థితిని అంచనా వేసి, వారి కావాల్సిన అవసరాలు తీర్చుతామని, మానవతా దృక్పథంతో వారికి సహాయం చేస్తామని రాజు సల్మాన్ ప్రతినిథి అజీజ్ అల్ రబీయా చెప్పారు. వాషింగ్టన్‌లో అమెరికా ప్రతినిధుల సభలో అమెరికా, భాగస్వామ్య జీసీసీ దేశాల మధ్య అమెరికా-అరబ్ సంబంధాలపై నేషనల్ కౌన్సిల్ సభ్యులతో జరిగిన సమావేశం తరువాత అల్ రబీయా ఈ ప్రకటన చేశారు.
5లక్షల మంది శరణార్థులు: అరకాన్ రోహింగియా సాల్వేషన్ ఆర్మీ తీవ్రవాదులు భద్రతా సిబ్బంది చెక్‌పోస్టులపై జరిపిన దాడుల్లో 12 మంది మయన్మార్ భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడులకు రోహింగ్యా ముస్లింలే కారణంగా భావించి సైన్యం వారిపై చర్యలు చేపట్టింది. సైన్యం జరిపిన కాల్పుల్లో సుమారు వేయి మంది ప్రాణాలు కోల్పోగా..చాలా మంది మయన్మార్‌ను వదిలి పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌కు బతుకుజీవుడా అంటూ వలసపోయారు. సుమారు 5 లక్షల మంది రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు శరణార్థులుగా వచ్చినట్లు లెక్క తేలింది.