ఫాల్కన్ పక్షుల కోసం.. విమానమే బుక్ చేశాడు!
ఫాల్కన్ పక్షుల కోసం.. విమానమే బుక్ చేశాడు!
Published Thu, Feb 2 2017 9:47 AM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM
రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అంటారు. యువరాజు తలుచుకుంటే విమాన టికెట్లకు కొదవా అనుకోవాలి. సౌదీ అరేబియాకు చెందిన ఓ యువరాజు తాజాగా తన వద్ద ఉన్న 80 ఫాల్కన్ పక్షుల కోసం ఏకంగా ఓ విమానంలో 80కి పైగా టికెట్లు కొనేశాడు. దీనికి సంబంధించిన ఫొటో రెడిట్ అనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కళ్లకు గంతలు కట్టిన ఫాల్కన్ పక్షులు విమానంలో ప్రయాణికుల సీటులోనే కూర్చుని దర్జాగా ప్రయాణం చేశాయి. ప్రతి పక్షిని కూడా ప్రయాణంలో పడిపోకుండా జాగ్రత్తగా సీట్లకు కట్టారు.
రెడిట్‌లో ఉన్న లెన్సూ అనే యూజర్ ఈ ఫొటోను పోస్ట్ చేశారు. తన కెప్టెన్ స్నేహితుడు పంపినట్లు అందులో చెప్పారు. మొత్తం 80 పక్షులకు కూడా టికెట్లను సదరు యువరాజు కొన్నట్లు సౌదీ మీడియా పేర్కొంది. యూఏఈ జాతీయ పక్షి అయిన ఫాల్కన్‌లను ఒకచోటు నుంచి మరో చోటుకు ఇలా తరలించడం మధ్యప్రాచ్యంలో కొత్తేమీ కాదు. యూఏఈలో వాటికి సొంతగా ఫారెస్ట్ గ్రీన్ పాస్‌పోర్టులు కూడా ఇస్తారు. వాటి సాయంతో అవి బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్ సౌదీ అరేబియా, పాకిస్థాన్, మొరాకో, సిరియా లాంటి దేశాలకలు వెళ్లచ్చు. తమ విమానాల్లోని ఎకానమీ క్లాసులో గరిష్ఠంగా ఒకసారి ఆరు ఫాల్కన్ పక్షులను తీసుకెళ్లొచ్చని ఖతార్ ఎయిర్‌వేస్ సంస్థ చెబుతోంది.
Advertisement