సంపన్నులకు బ్యాంకుల సలాం
- ఎస్‌బీఐ ‘కోహినూర్’ దార్లో విజయా బ్యాంక్ ‘సమృద్ధి’
- ‘ప్లాటినమ్’ పేరిట ఎస్‌బీహెచ్ ఖాతాలు
- లక్ష రూపాయల జీతముంటే ‘ఫెడ్ క్లాసిక్’
- అధికాదాయ వర్గాలపై ప్రభుత్వ బ్యాంకుల దృష్టి
- ఖాతాదార్లకు ప్రత్యేక సౌకర్యాలు, రుణాల్లో ప్రాధాన్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మీకు ఎస్‌బీఐ కోహినూర్‌లో ఖాతా ఉందా? పోనీ విజయాబ్యాంక్ సమృద్ధి శాఖలోనైనా...? కనీసం ఎస్‌బీహెచ్ ప్లాటినమ్ అయినా తీసుకున్నారా? ఫెడరల్ బ్యాంక్ ఫెడ్ క్లాసిక్ అయినా దొరికిందా? ఇవేవీ లేవా... అయితే మీరు శ్రీమంతులు కాదేమో లెండి!!
కోటి రూపాయలుంటేనే ఖాతా ఇస్తామని కండిషన్ పెట్టింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ). అలా ముందుకొచ్చేవారి కోసం ‘కోహినూర్’ పేరిట వజ్రాల్లాంటి శాఖలు ఏర్పాటు చేసింది. ఈ ఖాతాదారులకు ప్రత్యేక సౌకర్యాలు కూడా అందిస్తోంది. దీన్ని చూసి విజయా బ్యాంక్ కూడా కొత్త ఆలోచన చేసింది. రూ.3 లక్షలు మినిమమ్ బ్యాలెన్స్‌గా ఖాతాలో ఉంచేసే వారికోసం ‘సమృద్ధి’ పేరిట కొత్త శాఖలను తెరవటం మొదలెట్టింది. ఈ శాఖల ఖాతాదారులకు ప్రత్యేక సౌకర్యాలెటూ ఉంటాయి. వీళ్లిద్దరినీ చూసి ఫెడరల్ బ్యాంక్ మరో అడుగు ముందుకేసింది. నెల జీతం కనీసం లక్ష రూపాయలుంటేనే ఖాతా ఇస్తామంటూ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏతావాతా అర్థమయ్యేదేంటంటే... ప్రత్యేక సేవలు కావాలనుకునే శ్రీమంతుల కోసం ప్రభుత్వ బ్యాంకులూ గాలం వెయ్యటం మొదలెట్టాయన్న మాట. ప్రీమియం సేవలు కావాలనుకునేవారంతా ఇక ప్రయివేటు బ్యాంకుల వంకే చూడాల్సిన అవసరం లేదన్న మాట. స్టేటస్ సింబల్స్‌గా మారుతున్న ఈ సేవల వివరాలు కావాలా?
ఎస్‌బీఐ స్ఫూర్తి
దేశంలోనే తొలిసారిగా ఎస్‌బీఐ ‘కోహినూర్’ పేరుతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శాఖ విజయవంతం కావడంతో మిగిలిన ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఇలాంటి సేవలపై ప్రత్యేకంగా దృష్టిసారించడం మొదలెట్టాయి. కనీసం కోటి రూపాయలు ఉంటే కాని ఖాతా తెరవడానికి వీలులేని కోహినూర్ శాఖ ఏర్పాటు చేసిన రెండు సంవత్సరాల్లోనే రూ.250 కోట్లకు పైగా డిపాజిట్లను సేకరించింది. ఇదే స్ఫూర్తితో ఎస్‌బీఐ విశాఖపట్టణం వంటి నగరాలపై కూడా దృష్టి పెట్టింది. కాకపోతే విశాఖలో ఏర్పాటు చేసిన శాఖలో కనీస నిల్వ మొత్తాన్ని కోటి రూపాయల నుంచి రూ.50 లక్షలకు తగ్గించింది. ఇదే కోవలో పది రోజుల క్రితం విజయా బ్యాంక్ హైదరాబాద్‌లో సమృద్ధి పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేసింది.
దీన్లో ఖాతా తెరిచేవారు తమ సేవింగ్స్ అకౌంట్‌లో కనీసం రూ.3 లక్షల నిల్వను ఎప్పుడూ కొనసాగించాలి. కరెంట్ అకౌంట్ ఖాతాదారులైతే రూ.5 లక్షలు ఉంచాలి. ప్రైవేటు బ్యాంకులకు పోటీగా అధికాదాయ వర్గాలను ఆకర్షించడానికి సమృద్ధి పేరుతో చేసిన ప్రయోగం విజయవంతమయిందని, దీంతో హైదరాబాద్‌లో కూడా ఒక శాఖను ఏర్పాటు చేశామని విజయా బ్యాంక్ ఈడీ బి.ఎస్.రామారావు చెప్పారు. ప్రస్తుతం తమ బ్యాంక్ డిపాజిట్ల సేకరణ వ్యయం 8 శాతంగా ఉందని దీన్ని తగ్గించుకోవడానికి కాసా అకౌంట్స్‌పై దృష్టిపెట్టినట్లు రామారావు తెలియజేశారు. ఈ శాఖల్లో ఖాతాదారులకు ఉచిత ఇంటర్నెట్, లాంజ్, కాఫీ షాప్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. రుణాల్లో ప్రాధాన్యమివ్వడం, ఇతర లావాదేవీలపై వసూలు చేసే ఫీజుల్లో రాయితీ లేదా పూర్తిగా మాఫీ వంటివి కూడా చేస్తున్నారు.
వ్యయ నియంత్రణకు కాసా మంత్రం
బ్యాంకులకు కరెంట్, సేవింగ్స్ ఖాతాలు(కాసా) పెరిగితే వాటిలోని మొత్తం వల్ల డిపాజిట్ల సేకరణకయ్యే వ్యయం తగ్గుతుంది. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలోని సొమ్ముపై బ్యాంకులు కేవలం 4% వడ్డీ ఇస్తాయి. అదే కరెంట్ అకౌంట్ అయితే వడ్డీయే ఉండదు. అందుకే ఇప్పుడు పీఎస్‌యూ బ్యాంకులు డిపాజిట్ల సేకరణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కాసా మంత్రం జపిస్తున్నాయి. మొత్తం డిపాజిట్లలో కాసా 22% ఉండటంతో దీన్ని పెంచుకోవడానికి ‘ప్లాటినమ్’ పేరిట ప్రత్యేక సేవింగ్ ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్‌బీహెచ్ ఎండీ ఎం.భగవంతరావు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఇతర సేవింగ్ ఖాతాదారులు కూడా ప్లాటినమ్‌లోకి మారే అవకాశాన్ని ఎస్‌బీహెచ్ కల్పిస్తోంది. కాకపోతే ఇలా మారాలంటే కనీస త్రైమాసిక నిల్వ రూ. లక్ష ఉండాలి. లేదంటే రూ.10 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ బ్యాంకులకు భిన్నంగా పాతతరం ఫెడరల్ బ్యాంక్ మరో ముందడుగు వేసి లక్ష రూపాయలు జీతం దాటిన వారి కోసం ఫెడ్ క్లాసిక్ ప్రీమియం పేరుతో ప్రత్యేక సేవింగ్ ఖాతాను ప్రారంభించింది. ఈ ఖాతాదారులకు బేస్ రేటుపైనే లక్ష రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇలా అధికాదాయ వర్గాల వారికి ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తుండటంతో ఖాతాదారులు వీటిపట్ల బాగానే మొగ్గు చూపుతున్నారు.