పర్వాలేదనిపించిన ఎస్బీఐ
ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) శుక్రవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఫలితాల నికర లాభాల్లో పడిపోయింది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనాలను కంటే తక్కువగానే పడిపోయి రూ.2520.96 కోట్ల నికర లాభాలను నమోదుచేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జూన్తో ముగిసిన త్రైమాసికం నాటికి నికరలాభాలు యేటికేటికీ 31.7 శాతం పడిపోయినట్టు ఎస్బీఐ వెల్లడించింది. యేటికేటికీ నికర వడ్డీరేట్ల ఆదాయాలు 4.2 శాతం ఎగిసి, రూ.14,312.31 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. మార్కెట్ విశ్లేషకులు బ్యాంకు నికర లాభాలు రూ. 2,504.9 కోట్లగా, నికర వడ్డీ ఆదాయాలు రూ.14,489.5 కోట్లగా నమోదుచేస్తుందని అంచనావేశారు.
స్టేబుల్ అసెట్ క్వాలిటీని కొనసాగిస్తున్నట్టు బ్యాంకు ఈ ఫలితాల నేపథ్యంలో ప్రకటించడంతో, మార్నింగ్ ట్రేడింగ్లో 2 శాతం మేర డౌన్ అయిన ఎస్బీఐ షేర్లు, మధ్యాహ్నం సెషన్లో9 శాతం మేర లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ఎస్బీఐ ఇతర ఆదాయాలు 44 శాతం మేర జంప్ అయ్యాయని బ్యాంకు పేర్కొంది. ఇతర ఆదాయాలు, నిర్వహణ లాభాలు, తక్కువ పన్నుధరలు బ్యాంకు లాభాలకు సపోర్టుగా నిలిచినట్టు ఎస్బీఐ వెల్లడించింది. అయితే బ్యాంకుకు మళ్లీ స్థూల బ్యాడ్ లోన్స్ బెడదగానే ఉన్నాయి. ఈ లోన్స్ జూన్తో ముగిసిన త్రైమాసికంలో రూ.1,01,541 కోట్లకు ఎగిశాయి. మార్చి త్రైమాసికంలో ఇవి రూ.98,713 కోట్లగా ఉన్నాయి. బ్యాడ్ లోన్స్ పెంపు స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగానే ఉన్నాయి. నికర నిరర్థక ఆస్తులు 3.8 శాతం నుంచి 4.05 శాతానికి ఎగిశాయి.బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు జూన్ త్రైమాసికంలో రూ. 6,340 కోట్లకు పెరిగాయి. మార్చి త్రైమాసికంతో పోలిస్తే ఈ లోన్స్ తక్కువగానే నమోదయ్యాయి. మార్చి త్రైమాసికంలో బ్యాడ్ లోన్స్ ప్రొవిజన్లు రూ.12,139 కోట్లు.