స్కూల్ ఫీజుల దందాపై పోరుకు కార్యాచరణ
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్ల ఫీజు దోపిడీపై ఉద్యమించేందుకు బృహత్ కార్యాచరణ సిద్ధమైంది. విచ్చలవిడిగా ఫీజులు లాగుతున్న తీరుపై ఇప్పటివరకు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌పీఏ) ఒంటరిగా ఆందోళనలు చేస్తూ వచ్చింది. అడపాదడపా కొన్ని సంఘాలు విడిగా ఫీజులపై పోరాటాలు సాగించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో స్కూళ్లు ఫీజులు తగ్గించకపోగా.. పెంచాయి.
పైగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పలు స్కూళ్లలో చేపట్టిన తనిఖీల నివేదికను ప్రభుత్వం ఇంతవరకు బహిర్గతం చేయలేదు. తనిఖీలు ముగిసి 6 నెలలైనా.. నాన్చుడు ధోరణే అవలంబిస్తోంది. ఈ నేపథ్యంలో ఫీజుల పోరుకు పదును పెట్టాలని హెచ్‌ఎస్‌పీఏ నిర్ణయించింది. ఎంవీఎఫ్, టీపీఈఆర్‌ఎం, సీఆర్‌పీఎఫ్, ఏపీఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఎస్‌ఎఫ్‌ఐ తదితర ప్రజా, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరిపి ‘స్కూల్ ఫీజుల నియంత్రణ సాధనకు ఐక్య కార్యాచరణ కమిటీ(జేఏసీ-ఎస్‌ఎఫ్‌ఆర్)’ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఏర్పాటైన జేఏసీ - ఎస్‌ఎఫ్‌ఆర్ ప్రతినిధులు తమ కార్యాచరణను వివరించారు.
9న రాజకీయ పార్టీలతో సమావేశం
అధిక ఫీజులపై పోరాడేందుకు రాజకీయ పార్టీల మద్దతు తీసుకుంటున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 9న నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్కూల్ అధిక ఫీజుల విషయంలో దేశంలోని అన్ని నగరాలన్నింటిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
కమిటీ కార్యవర్గమిదే..
జేఏసీ-ఎస్‌ఎఫ్‌ఆర్ చైర్‌పర్సన్‌గా అరవింద జటా, జనరల్ సెక్రటరీగా ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ ఉపాధ్యక్షులు నాగటి నారాయణ, వైస్ చైర్‌పర్సన్లుగా కె. విమల, శారదా గౌడ్, హెచ్‌ఎస్‌పీఏ అధ్యక్షులు విక్రాంత్, జాయింట్ సెక్రటరీలుగా డి. ప్రకాశ్, ప్రతాప్, ఆశిష్, సుబ్రహ్మణ్యం, ట్రెజ రర్‌గా శ్రీనివాస్‌రెడ్డి, అడ్వైజరీ బోర్డ్ చీఫ్‌గా ఆర్. వెంకట్‌రెడ్డి నియమితులయ్యారు.