శాంతి పరిరక్షణలో భాగస్వామ్యం
బలగాలు పంపిస్తున్న దేశాలకు నిర్ణయ ప్రక్రియలో సముచిత పాత్ర ఉండాలి
- ఐరాస శాంతి పరిరక్షణ సదస్సులో ప్రధాని మోదీ
- పీస్ కీపింగ్ ఆపరేషన్స్‌ను ఆధునీకరించాలని సదస్సు నిర్ణయం
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు బలగాలను పంపిస్తున్న దేశాలకు సంబంధిత నిర్ణయ ప్రక్రియలో సముచిత భాగస్వామ్యం లభించకపోవడాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తప్పుబట్టారు. శాంతి పరిరక్షణకు సంబంధించిన కొన్ని ఆదేశాలు బలగాల్లో సంఘర్షణలకు దారితీస్తున్నాయన్నారు. దాని వల్ల సైనికుల ప్రాణాలే కాకుండా, మొత్తం శాంతి పరిరక్షణ లక్ష్యమే ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బలగాలను పంపిస్తున్న దేశాలకు నిర్ణయ ప్రక్రియలో, మేనేజ్‌మెంట్ స్థాయిలో, ఫోర్స్ కమాండర్స్ స్థాయిలో సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే ఈపరిస్థితి తలెత్తుతోందని విశ్లేషించారు.
ఐరాస నిర్వహించిన ‘ఉన్నతస్థాయి శాంతిపరిరక్షణ సదస్సు’నుద్దేశించి మంగళవారం మోదీ ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న భద్రతాపరిస్థితుల నేపథ్యంలో.. శాంతి పరిరక్షణ దళాల బాధ్యత శాంతి, భద్రతలను కాపాడేందుకే పరిమితం కాలేదని, మరిన్ని ఇతర సవాళ్లను ఎదుర్కొనేందుకు కూడా వాటి సేవలను ఉపయోగించుకుంటున్నామని పేర్కొన్నారు. ఐరాస శాంతి పరిరక్షణ కార్యక్రమాలకు భారత్ సహకారం కొనసాగుతుందన్న మోదీ.. 850మంది భారతీయ సైనికులతో కూడిన మరో బెటాలియన్‌ను, మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్న 3 పోలీస్ బృందాలను ఈ సేవలకు త్వరలో పంపిస్తామన్నారు.
ఐరాస శాంతి పరిరక్షణ మిషన్స్‌లో భాగంగా భారత్ తరఫున 1.8 లక్షల మంది భారతీయ సైనికులు 49 కార్యక్రమాల్లో పాల్గొన్నారని, వారిలో 161 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ‘ఐరాస శాంతి పరిరక్షణ కార్యక్రమాలు విజయవంతం కావడమనేది సైనికులు ఉపయోగించే ఆయుధాలపై కాదు.. భద్రతామండలి ఇచ్చే నైతిక స్థైర్యంపై ఆధారపడి ఉంటుంది’ అని తేల్చిచెప్పారు. నిర్దిష్ట కాలావధిలోగా భద్రతామండలిలో సంస్కరణలు చేపట్టి, దానిని మరింత విస్తరించాలని పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారత దళాలు రెండో ప్రపంచ యుద్ధం నుంచి పాల్గొంటున్నాయని మోదీ తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధంలో భారత ఉపఖండానికి చెందిన 24వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, దాదాపు అందులో సగంమంది సమాచారం నేటికీ తెలియరాలేదన్నారు.
విధుల్లో మృతిచెందిన సైనికుల స్మారక నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, జపాన్ ప్రధానమంత్రి షింజోఅబె.. తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దాదాపు 50 దేశాల నేతలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఐరాస శాంతి పరిరక్షణ ఆపరేషన్స్‌ను ఆధునీకరించాలని నిర్ణయించారు.
అలాగే, భద్రతామండలికి, దళాలను పంపిస్తున్న దేశాలకు మధ్య సంప్రదింపులు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. యూఎన్ శాంతిదళాల్లో లైంగిక వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న ఐరాస విధానాన్ని అందులో పునరుద్ఘాటించారు. ప్రాంతీయ స్థాయిలో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న ప్రాంతీయ, ఉప ప్రాంతీయ సంస్థలతో ఐరాస శాంతి దళాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
మోదీ విజ్ఞప్తి ముదావహం: భారత్ అభివృద్ధిలో అమెరికాలోని భారతీయులు కీలక పాత్ర పోషించాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తిని అమెరి కా అధ్యక్షుడు ఒబామా స్వాగతించారు. ‘ఇక్క డి భారతీయులు తమ సామర్ధ్యాన్ని భారత్ అభివృద్ధికి కూడా ఉపయోగించాలన్న మోదీ విజ్ఞప్తిని మేం స్వాగతిస్తున్నాం’ అని సోమవారం మోదీతో భేటీ అనంతరం ఒబామా పేర్కొన్నారు.
‘ప్రెసిడెంట్ మోదీ’ నోరు జారిన ఒబామా
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నోరు జారారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘ప్రెసిడెంట్ మోదీ’గా సంబోధించారు. సోమవారం ఇద్దరు నేతల మధ్య భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ‘‘స్వచ్ఛ ఇంధన వినియోగంలో ప్రెసిడెంట్ మోదీ దూకుడు ధోరణిని మేం ప్రోత్సహిస్తున్నాం’’ అని ఒబామా అన్నారు. ఆ తరువాత అమెరికా అధ్యక్ష భవనం ఒబామా ప్రసంగ పాఠంలో ఆ పదాన్ని సరిదిద్దింది.
స్వదేశానికి చేరుకున్న మోదీ: ఐర్లాండ్, అమెరికాల పర్యటనను ముగించుకుని ప్రధాని మోదీ మంగళవారం రాత్రి 12గంటల సమ యంలో ఢిల్లీకి చేరుకున్నారు. అంతకు ముందు ‘నా అమెరికా పర్యటన ఇరుదేశాల సంబంధాల్లో అసాధారణ లోతును, బహుముఖీయతను ప్రదర్శించింది.నాకు అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. ప్రతీ కార్యక్రమం భారత్‌కు ప్రయోజనం కల్పించే ఏదో ఒక ఫలితం రాబట్టింది.’ అని ట్వీట్ చేశారు.
చిరునవ్వులతోనే మోదీ-షరీఫ్ పలకరింపులు
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి 70 సర్వప్రతినిధి సభలో ప్రసంగించేందుకు అమెరికాకు వచ్చిన భారత్, పాకిస్తాన్ ప్రధానుల మధ్య ప్రత్యక్ష భేటీ ఏదీ జరగనప్పటికీ.. మంగళవారం మాత్రం ఇద్దరు నేతలు కాసేపు ఎదురెదురుగా కూచున్నారు.. చేతులు ఊపి పరస్పరం పలకరించుకున్నారు. చిరునవ్వులతోనే అభినందనలు తెలుపుకున్నారు. ఐక్యరాజ్యసమితి నిర్వహించిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ సదస్సులో వివిధ దేశాధినేతలతో పాటు, భారత్, పాక్ ప్రధానులు కూడా పాల్గొన్నారు.
సదస్సులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్‌లో ఒక పక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి కూచున్నారు. ఆ తరువాత కొద్ది సేపటికి పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ మోదీకి సరిగా ఎదుటి వైపు తనకోసం ఏర్పాటు చేసిన కుర్చీలో కూచున్నారు. కొద్ది నిమిషాల పాటు ఒకరినొకరు ఏమీ పలకరించుకోలేదు.. కొద్దిసేపట్లో సదస్సు ప్రారంభమవుతుందనగా షరీఫ్ మోదీ వైపు చూస్తూ చేయి ఊపి నవ్వారు. వెంటనే మోదీ కూడా చేయి ఊపి నవ్వి.. బాగున్నారా అన్నట్లుగా తలాడించారు. ఇంత కు మించి వారిద్దరి మధ్య ఎలాంటి పలకరింపులు జరగలేదు. ఒకరి ప్రసంగానికి మరొకరు చప్పట్లతో అభినందనలు తెలుపుకున్నారు.