జల వివాదాలపై ఒకే శాశ్వత ట్రిబ్యునల్!
న్యూఢిల్లీ: రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలను సత్వరమే సమన్యాయంతో పరిష్కరించేందుకు దేశంలో ఒక్కటే శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ఇప్పుడున్న 5 అంతర్రాష్ట్ర జలవివాదాల ట్రిబ్యునళ్లను రద్దు చేసి వాటి స్థానంలో జాతీయ స్థాయిలో ఒక్కటే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కొన్నేళ్లుగా నలుగుతున్న సంగతి తెలిసిందే. జాతీయ జల విధానం ముసాయిదా 2012 కూడా శాశ్వత ట్రిబ్యునల్‌నే సూచిం చింది.
ఈ మేరకు అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం-1956ను సవరించేందుకు కేంద్ర జల వనరుల శాఖ ఒక కేబినెట్ నోట్‌ను రూపొందించింది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రిబ్యునళ్లను రద్దు చేసి జాతీ య స్థాయిలో ఒకే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి తొలుత 2011లో అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ చొరవ తీసుకున్నారు. పలువురు సభ్యులతో కూడిన శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం యోచి స్తోంది. ఈ ట్రిబ్యునల్‌లో ముగ్గురేసి సభ్యులతో కొన్ని ధర్మాసనాలను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం జలవివాదాల పరిష్కారానికి ఏర్పాటుచేసిన ట్రిబ్యునళ్లు తీర్పు ఇచ్చేసరికి ఏళ్ల తరబడి సమయం పట్టడం, ఒకవేళ తీర్పు ఇచ్చినా వాటిపై బాధిత రాష్ట్రాలు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం తదితర పరిణామాలను కేంద్రం పరిశీలనలోకి తీసుకుంది.