
కపాలాన్నే మార్చేశారు!
అమెరికాలో వైద్యరంగంలోనే ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే తొలిసారిగా కపాలం మార్పిడి ఆపరేషన్ చేశారు. కేన్సర్ చికిత్స కారణంగా తలమీద పెద్ద గాయం కావడంతో.. అతడికి కపాలాన్ని మార్చడం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది. దీంతో 15 గంటల పాటు ఆపరేషన్ చేసి అతడికి పూర్తిగా కొత్త కపాలాన్ని అమర్చారు. జేమ్స్ బోయ్సెన్ (55) ఆస్టిన్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నారు. ఆయనకు క్రానియోఫేషియల్ టిష్యూ మార్పిడితో పాటు ఒకేసారి కిడ్నీ, పాంక్రియాస్ కూడా మార్పిడి చేశారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ బృందానికి డాక్టర్ మైఖేల్ క్లెబక్ నేతృత్వం వహించారు. ఇది చాలా సంక్లిష్టమైన మైక్రోవాస్క్యులర్ ప్రొసీజర్ అని ఆయన తెలిపారు. తాము పుర్రె ఎముకలతో పాటు మాడు కణజాలాన్ని, దాంతోపాటు వచ్చే రక్తనాళాలను కూడా మార్చామన్నారు. ఇలా కపాలాన్ని మార్చడం గానీ, ఒకేసారి మూడు అవయవాలను మార్చడం గానీ ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడూ, ఎవరికీ మార్చలేదని కూడా క్లెబక్ వివరించారు.
రోగి బోయ్సెన్కు వరుసపెట్టి రకరకాల కేన్సర్లు వచ్చాయని, దాంతో అనేక ఆపరేషన్లు, రేడియేషన్ జరిగాయని తెలిపారు. ఫలితంగా ఆయన తల మీద పెద్ద గాయం అయ్యిందన్నారు. గతంలోనే ఆయనకు ఒకసారి కిడ్నీమార్పిడి జరగడంతో అప్పటి నుంచి ఇమ్యూన్ సప్రెషన్ మందులు వాడుతున్నారు. కేన్సర్ చికిత్సలో రేడియేషన్ కారణంగా కపాలం దెబ్బతిన్నప్పుడు ఈ మందుల కారణంగా అది నయం కాలేదు. దాంతో ఈ మార్పిడి అంతా చేయాల్సి వచ్చింది.