
సార్టప్‌లలోకి నిధులు పెరగాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నైపుణ్యం, విద్య, పరిశోధన సంస్థలు, ఆలోచనలకు మార్గదర్శనం చేసే మెంటార్లు, స్టార్టప్ కంపెనీలకు భాగ్యనగరం చిరునామాగా మారిందని ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టై) హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు సఫిర్ ఆదేని అన్నారు. టై ఆధ్వర్యంలో శనివారమిక్కడ ‘స్మాషప్-స్టార్ట్‌ప్ హీరోస్’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌డీఐ, పీఈ వంటి నిధులనూ స్టార్టప్ కంపెనీలకు మళ్లించాలని అప్పుడే ఆయా సంస్థలు మరింతగా వృద్ధి చెందుతాయన్నారు. స్టార్టప్ కంపెనీలతో దేశం లో నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు జీడీపీ వృద్ధి రేటు కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులను ప్రోత్సహించి కొత్త కంపెనీలను ప్రారంభించడమే టై ప్రధాన ఉద్దేశమన్నారు. కేవలం కంపెనీలను, టై సభ్యులను పెంచడమే కాదు కొత్త ప్రాంతాల్లో విభాగాలను ప్రారంభించడంలోనూ టై ముందుంటుందన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా టై చాప్టర్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు.