రిటైల్ బ్రోకింగ్
ముంబై: స్టాక్ బ్రోకర్లు లావాదేవీల పరిమాణం ఆధారంగా బ్రోకరేజీ వసూలు చేయడం విదితమే. లావాదేవీల విలువ ఎక్కువైన కొద్దీ చార్జీ పెరుగుతుంటుంది. అయితే కాలం మారింది. స్టాక్ బ్రోకర్ల వ్యాపారాన్ని కుదేలుచేస్తూ డిస్కౌంట్ బ్రోకర్లు తెరపైకి వచ్చారు. లావాదేవీ విలువ ఐదు రూపాయలైనా, ఐదు కోట్ల రూపాయలైనా నిర్ణీత చార్జీయే (సుమారు రూ.20) వసూలు చేస్తారు. గత రెండు మూడేళ్లలో కాంపోజిట్‌ఎడ్జ్, జీరోధా, ఆర్కేఎస్వీ, అచీవర్స్ ఈక్విటీస్ తదితర డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు చిన్న ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నాయి. అమ్మకం/ కొనుగోలు విలువతో సంబంధం లేకుండా నిర్ణీత ఫీజుకే షేర్లు, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, కమాడిటీస్‌లో ఈ కంపెనీలు చిన్న ఇన్వెస్టర్ల తరఫున ట్రేడింగ్ నిర్వహిస్తున్నాయి. హెచ్‌ఎస్‌బీసీ, ఐఐఎఫ్‌ఎల్, బ్రిక్స్ సెక్యూరిటీస్ వంటి భారీ ఫుల్‌టైమ్ బ్రోకింగ్ సంస్థలు రిటైల్ బ్రోకింగ్ నుంచి నిష్ర్కమించాలని నిర్ణయించుకున్న తరుణంలో డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీలు రంగప్రవేశం చేశాయి.
జియోజిత్ బీఎన్‌పీ పారిబా, ఈడెల్వీస్ సెక్యూరిటీస్, ఎమ్కే ఫైనాన్షియల్ సర్వీసెస్, మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వంటి ఫుల్ సర్వీస్ స్టాక్‌బ్రోకింగ్ కంపెనీలకు రిటైల్, స్మాల్ ఇన్వెస్టర్ విభాగం ద్వారా నమోదయ్యే వ్యాపార పరిమాణం గణనీయంగా తగ్గడం గమనార్హం. షేర్‌ఖాన్, ఐసీఐసీఐ డెరైక్ట్, ఇండియాబుల్స్ వంటి కంపెనీల రిటైల్ బ్రోకింగ్ యూనిట్ల పురోగతి కూడా క్షీణదశలో ఉంది.
అమెరికా ఆదర్శంగా: 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభాన్నుంచి అమెరికా, జపాన్, యూరప్ వంటి మార్కెట్లు కోలుకోగా భారతీయ స్టాక్ మార్కెట్ ఇంకా కుదుటపడలేదు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మొగ్గుచూపి స్టాక్ మార్కెట్‌కు దూరంగా ఉండిపోయారు. 1990వ దశకంలో అమెరికాలో ఈ-ట్రేడ్, టీడీ అమెరిట్రేడ్, చార్లెస్ ష్వాబ్ వంటి డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీల ఆవిర్భావంతో గోల్డ్‌మాన్ శాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి బడా సంస్థలు రిటైల్ బ్రోకింగ్ డివిజన్లను మూసేసుకోవాల్సి వచ్చింది!
ఇండియాలోనూ ఇలాంటి పరిస్థితే వచ్చిందని దేశీయ తొలి డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీ జీరోధా వ్యవస్థాపకుడు నితిన్ కామత్ చెప్పారు. దేశంలో డిస్కౌంట్ బ్రోకర్లు, ఫుల్ సర్వీస్ బ్రోకర్లు విభిన్న వ్యాపార పద్ధతులతో కొనసాగుతున్నారని తెలిపారు. ‘మా కంపెనీకి ఏడువేల మంది ఖాతాదారులున్నారు. కరెన్సీ, కమాడిటీస్, ఈక్విటీలు, ఈక్విటీ డెరివేటివ్స్‌లో రోజూ రూ.4-5 వేల కోట్ల వ్యాపారం చేస్తున్నాం. దేశీయ డిస్కౌంట్ బ్రోకింగ్ వ్యాపారంలో 70 శాతం వాటా మాదే...’ అని కామత్ వివరించారు. ‘ఇంట్లో కంప్యూటర్ నుంచి లావాదేవీలు నిర్వహించగలిగిన వివేకవంతమైన ఇన్వెస్టర్ల అవసరాలను మేం తీరుస్తున్నాం...’ అని కాంపోజిట్‌ఎడ్జ్ సహవ్యవస్థాపకుడు సతీశ్ కుమార్ దత్ చెప్పారు. డిస్కౌంట్ బ్రోకర్ అయిన ఈ కంపెనీ ఒక్కో లావాదేవీకి రూ.18 చొప్పున చార్జీ వసూలు చేస్తోంది.