
ప్రాణాలు కాపాడిన సెల్ఫీ వీడియో!!
సెల్ఫీ తీసుకోవడం ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టింది. స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ లక్షణాలను వీడియో తీసుకుని దాన్నే డాక్టర్లకు చూపించిందామె.
సెల్ఫోన్లో మంచి కెమెరా ఉందంటే చాలు.. సెల్ఫీలు (తమను తామే ఫొటో) తీసుకోవడం, వాటిని ఫేస్బుక్లో అప్లోడ్ చేయడం లేదా వాట్పప్లో ఫ్రెండ్స్కు పంపడం చాలామందికి అలవాటు. ఒక్కోసారి ఈ సెల్ఫీలు చూస్తే విసుగు అనిపించొచ్చు. కానీ, ఇలా సెల్ఫీ తీసుకోవడం ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టింది. కెనడాలోని టొరంటోకు చెందిన స్టాసీ యెపెస్ (49) అనే మహిళ ఆఫీసులో పని ముగించుకుని ఇంటికి వెళ్తోంది. ఇంతలో ఆమెకు ఎడమవైపు చేతులు, కాళ్లు లాగేస్తున్నట్లు అనిపించింది. మాట కూడా సరిగా రావట్లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కూడా తన ఫోన్ తీసుకుని వెంటనే తనను తాను వీడియో తీసుకోవడం మొదలుపెట్టింది.
తన ఎడమవైపు ముఖం లాగేస్తోందని, మాట ముద్దగా వస్తోందని చెప్పింది. తన ఎడమ చేతిని గానీ, కాలిని గానీ కదిలించలేకపోతున్నట్లు చూపించింది. ఎలాగోలా టొరంటో డౌన్టౌన్లోని మౌంట్ సినాయ్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులకు తన ఫోన్ ఇచ్చి, అందులో వీడియో చూడమని చెప్పింది. ఆమెకు ట్రాన్సియెంట్ ఇషెమిక్ ఎటాక్స్ వచ్చినట్లు వైద్యులు గుర్తించి, వెంటనే టొరంటో వెస్ట్రన్ ఆస్పత్రిలోని స్ట్రోక్ యూనిట్కు ఆగమేఘాల మీద తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు చేయిస్తే ఆమె చెప్పిన విషయాలన్నీ సరైనవేనని తేలింది. ఇప్పటివరకు తమ వద్దకు ఇలాంటి రోగి రానే రాలేదని, రోగులు తమ రోగ లక్షణాలను చెప్పడానికి ఇంతకంటే మంచి మార్గం అస్సలు లేదని అక్కడి న్యూరాలజిస్టు షెరిల్ జైగోబిన్ చెప్పారు.