ఈ మానవ తెగ నశించి పోతోంది!
బోర్నియో: ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ మధ్యన సముద్ర జలాల్లో నివసిస్తున్న అరుదైన ‘బ్యాడ్జావో’ సంచార మానవ తెగ నశించిపోతోంది. బీచ్‌లకు సమీపాన పడవల్లో లేదా సముద్ర జలాల్లో మంచెలాంటి గుడిసెలు వేసుకొని జీవనం సాగించే ఈ తెగను తమ జాతీయులుగా ఇండోనేషియాగానీ, ఫిలిప్పీన్స్‌గానీ, వలసలను అనుమతించిన మలేషియాగానీ నేటికి గుర్తించడంలేదు.
దాదాపు ఐదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతి కేవలం సముద్ర జీవులపై ఆధారపడి బతుకుతోంది. బరిశెలతోనే కాకుండా ఒట్టి చేతులతో కూడా చేపలు పట్టడంలో ఈ జాతి వారు అనుభవజ్ఞులు. నీటి లోపల, సముద్రం ఒడ్డున ఊపిరి భిగపట్టి చేపలు పడతారు. ఎప్పుడూ నీటి మీదనే జీవనం సాగిస్తుండడం వల్లనా వీరు సముద్రం అట్టడుగు ప్రాంతం వరకు ఈత కొట్టడంలో ఎంతో నేర్పరులు.
బ్యాడ్జావో తెగ ప్రజలు పర్యాటకులు ఇచ్చే కళ్లజోళ్లను ఆధునిక నీటి కెమెరాలను కూడా ఇటీవల ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఆవేశకావేశాలకు ఆస్కారమివ్వకుండా ప్రశాంతంగా జీవించే ఈ తెగవారు చాలా మృధు స్వభావులు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. తోటి మానవుల పట్ల ప్రేమగా మెలగుతారు. అయినా ఈ జాతి వారు ప్రధాన మానవ జీవన స్రవంతిలో కలువకుండా దాదాపు నాలుగు శతాబ్దాలపాటు ఉండిపోయారు. దాంతో వీరిలో ఎవరూ కూడా చదువు సంధ్యలవైపు దృష్టి సారించలేదు.
వివిధ తుఫానులు కారణంగా మృత్యువాత పడుతుండడంతో ఈ జాతి క్రమంగా నశిస్తూ వస్తోంది. ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ సముద్ర జలాల్లో బతకడం కష్టమనుకున్న వారు మలేషియా సముద్ర తీరాలకు తరలిపోయారు. అక్కడ కూడా వీరు ప్రధాన మానవ జీవన స్రవంతికి దూరంగానే బతుకుతున్నారు. సాయస యాత్రలు చేయడంలో పేరుపొందిన పోలండ్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ కస్జీలికోవిస్కీ ఈ జాతి జనులతో వారం రోజులపాటు గడిపి పలు ఫొటోలు తీశారు.