భవిష్యత్తుపై బెంగతో.. | Sucharitha, daughter of MP's gunman suicide attempt | Sakshi
Sakshi News home page

భవిష్యత్తుపై బెంగతో..

Published Fri, May 5 2017 6:50 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM

భవిష్యత్తుపై బెంగతో..

భవిష్యత్తుపై బెంగతో..

తుపాకితో కాల్చుకున్న ఎంపీ గన్‌మెన్‌ కూతురు..

కర్నూలు: రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ వద్ద గన్‌మ్యాన్‌గా పని చేస్తున్న ఐసయ్య కూతురు సుచరిత (26) తండ్రి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఐసయ్య మాజీ సైనికుడు. కర్నూలు నగర శివారుల్లోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటూ, టీజీవీ ఫ్యాక్టరీ సెక్యూరిటీ విభాగంలో పని చేశారు. ప్రస్తుతం టీజీ వెంకటేష్‌కు గన్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు సంతానం కాగా, సుచరిత పెద్ద కూతురు. ఎంఎస్‌సీ బీఈడీ వరకు చదువుకుంది. నారాయణ కళాశాలలో కొంతకాలం లెక్చరర్‌గా పని చేసింది. ఇటీవలనే పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసింది. అందుకు సంబంధించిన కీ విడుదలైంది. మార్కులు తక్కువగా రావడంతో ఫెయిల్‌ అవుతానని రెండు రోజులుగా ఇంట్లోనే బెంగగా ఉండటంతో తండ్రి ఓదార్చాడు.
 
భవిష్యత్‌లో స్థిరపడటం కోసం గ్రూప్‌–2 పరీక్షకు కూడా ప్రిపేర్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తండ్రి ఇంటి ముందు వేరే వ్యక్తులతో మాట్లాడుతుండగా, బెడ్‌ రూములోకి వెళ్లి సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుంది. కుడిచేతి కణితిపై నుంచి ఎడమవైపు తలపై బుల్లెట్‌ దూసుకెళ్లింది. తండ్రి ఐసయ్య వెంటనే పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లాడు. అప్పటికే రక్తం మడుగులో పడి ఉన్న కూతురును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స చేయించారు. వైద్యుల సలహా మేరకు గౌరిగోపాల్‌ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమె తలకు శస్త్ర చికిత్స చేసినట్లు డాక్టర్లు వెల్లడించారు. కొంతకాలంగా తన కూతురు తలనొప్పితో బాధపడుతుండేదని, ఆ బాధ భరించలేకనే కాల్చుకొని ఉండొచ్చని తండ్రి ఐసయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement