గుండెపోటుతో కుప్పకూలిన క్యాబ్ డ్రైవర్!
- క్యాబ్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో నగరంలో విషాద ఘటన
హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన ఉప్పల్ ఫిర్జాదిగూడలో తులసీదాస్ అనే క్యాబ్ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తులసీదాస్ రెండు నెలల క్రితం బజాజ్ ఫైనాన్స్‌లో టీవీ కొనుగోలు చేశాడు. అయితే రెండు వాయిదాలు చెల్లించడంలో ఆలస్యం కావడంతో సదరు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఆయనను నిలదీశారు. దీంతో తులసీదాస్‌కు ఫైనాన్స్ ప్రతినిధులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫైనాన్స్ ప్రతినిధులు తులసీదాస్ ఇంట్లో నుంచి టీవీని బలవంతంగా తీసుకెళ్లారు.
దీంతో మనస్తాపానికి గురైన తులసీదాస్ కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. తులసీదాస్‌కు నలుగురు ఆడపిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి క్యాబ్ డ్రైవర్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో క్యాబ్ డ్రైవర్లలో విషాదం నెలకొంది.
తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, ఉబెర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదని, ఈ నేపథ్యంలో గత్యంతరంలేని పరిస్థితుల్లో తాము దీక్షకు దిగామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ అంటున్నారు.