tulasidas
-
Lord Ram: రాముడిపై మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు
పాట్నా: దేవుడి విషయంలో ఎవరి నమ్మకాలు వారికి.. కొందరు దేవుడు ఉన్నాడని నమ్మితే.. మరికొందరూ లేడని వాదిస్తారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది. రాముడి విషయంలో బీహార్ మాజీ సీఎం జితిన్ రాం మాంఝీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని సంచలన కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా.. రాముడు అనే పేరు కేవలం ఓ పాత్ర మాత్రమేనని అన్నారు. ఆ పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ తమ రాతల్లో చొప్పించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, అందులో మంచి విషయాలున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే తమకు తులసీదాస్, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ.. రాముడిపై విశ్వాసం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా.. దేశంలో రెండే కులాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ధనవంతులు, పేదవాళ్లు అనే రెండు కులాలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఈ క్రమంలోనే రామాయణంలో శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తిన్నారని పురాణ కాలం నుంచి వింటున్నాం. అయితే, మేము కొరికిన పండ్లను మీరు(పరోక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి) తినరు, ముట్టుకోరు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. #WATCH | Jamui: Ex-Bihar CM Jitan Ram Manjhi says, "Ram wasn't a God. Tulsidas-Valmiki created this character to say what they had to. They created 'kavya' & 'mahakavya' with this character. It states a lot of good things & we revere that. I revere Tulsidas-Valmiki but not Ram.." pic.twitter.com/ayrQvSfdH1 — ANI (@ANI) April 15, 2022 -
శతక నీతి – సుమతి..: వారి వెంట ఉంటే చాలు!
సత్పురుషులు అంటే కచ్చితంగా ఇలానే ఉంటారు అని చెప్పలేం. మంచి గుణాలతో మాత్రం ఉంటారు. రామ్ చరిత్ మానస్ లో తులసీదాస్ గారు సత్పురుషులను మూడు వర్గాలుగా విభజించారు. గులాబీ చెట్టు మంచి పూలు పూస్తుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. మంచి వాసనలు ఉంటాయి. కానీ ఆ చెట్టుకు కాయలుండవు. పండ్లుండవు. ఒకరకం సత్పురుషులు ఈ గులాబీ చెట్టులాంటివారు. మంచి మాటలు చెబుతూ సమాజాన్ని నడిపిస్తుంటారు. వారు ఎవరికీ అపకారం చేయరు. ఎవరినీ పాడు చేయరు. కానీ వాళ్ళు మంచి పనులు అదే పనిగా చేస్తున్నారా అంటే చెప్పడం కొద్దిగా కష్టమే. మామిడి చెట్టు ఉంటుంది. పూత పూస్తుంది, కాయా కాస్తుంది. పండ్లూ వస్తాయి. రెండో రకం సత్పురుషులు ఇలాటి వారు. మంచి మాటలు చెబుతారు. మంచి పనులూ చేస్తుంటారు. రెండూ ఉంటాయి తప్ప మంచి మాటలు చెప్పి పనులు చెయ్యకుండా కూర్చునే రకం కాదు. తమతో ఉన్న వాళ్ళను తమ వెంట తిప్పుకుంటూ అందరితో మంచి పనులు చేయిస్తుంటారు. పనస చెట్టు ఉంది. మామిడి కాయ లేదా పండయితే ఒకరికే సరిపోతుంది. పనసపండును పదిమందికి పంచవచ్చు. ఈ రకం వారు మంచి మాటలు అదే పనిగా చెప్పరు. కానీ మంచి పనులు మాత్రం ఆపకుండా చేసుకుంటూ పోతుంటారు. ఇదీ తులసీదాసుగారి వర్గీకరణ. ఇటువంటి సత్పురుషులతో కలిసి మెలిసి తిరుగుతుంటే మనం కూడా పూజార్హత పొందుతాం. వారితో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మంచిపనులు చేస్తూ పోతుంటాం. వారి త్యాగశీలత, నిస్వార్థంగా పనిచేసే తత్త్వం, అంకిత భావం, సమాజం పట్ల ప్రేమానురాగాలవంటి గుణాలను వారు చెబుతూ ఆచరించి చూపుతుంటే ... వాటి ప్రభావం మన మీద కూడా గాఢంగా పడుతుంది. క్రమేణా జీవితం దానికి అలవాటు పడి మనలో ఉన్న దుర్గుణాలు వాటతంట అవే మాయమయిపోతుంటాయి. సత్పురుషులతో సహవాస గొప్పదనాన్ని చెప్పడానికి రామకృష్ణ పరమ హంస ఒక ఉదాహరణ చూపుతుంటారు. ఒక ఏనుగు దారివెంట నడిచి వెడుతుంటూంది. కొబ్బరి చెట్టు కనపడితే కొబ్బరి కాయలను తొండంతో తుంపి నోట్లో వేసుకుంటుంది. అరటి చెట్టు కనబడితే ఆకులను పట్టి లాగేస్తుంది, చింపేస్తుంది. అంతవరకు దాని మీద కూర్చున్న మావటి పట్టించుకోడు. అక్కడ అరటి గెలలను తొండంతో పట్టుకుని లాగేయపోతుండగా... అంకుశం గుచ్చే ప్రయత్నం చేస్తాడు.. వెంటనే అది తొండాన్ని వెనక్కి తీసేసుకుంటుంది. సత్పురుషులు మావటిలాంటి వారు. మనం పనికిమాలిన పనులు చేస్తున్నా, అనవసర మాటలు మాట్లాడుతున్నా... మృదువుగానే మనల్ని మందలిస్తారు. మనల్ని చక్కదిద్దుతారు. నిజానికి వారు ప్రత్యేకించి మనల్ని పట్టించుకోనక్కరలేదు. వాళ్ళ సాహచర్యంలో అటువంటి పనులు చేయడానికి, అధిక ప్రసంగాలకు ఆస్కారముండదు. ధూళికణమయినా గాలితో కలిస్తే పైకెగిరినట్టు సత్పురుషుల సాంగత్యం మనల్ని ఉన్నతంగా నిలుపుతుంది. వారి సాంగత్యం లేకపోయినా నష్టమేదీ నేరుగా అనుభవంలోకి రాదు కానీ దుర్జనులతో కలిస్తే మాత్రం హాని జరిగితీరుతుందని చెప్పడానికే బద్దెనగారు –‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ హెచ్చరిస్తున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
అప్పుడే తెలుగుకు పండుగ
కొన్ని వారాల క్రితం తెలుగు భాష, సాహిత్యాభిమానులందరూ సంతోషించదగిన పరిణామం చోటు చేసుకున్నది. అదే, మైసూరు నుంచి తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం తెలుగు నేలకు తరలి రావడం. ఇప్పటి వరకూ ఈ కేంద్రం రాష్ట్రం బయట ఉండటం వల్ల, 2008లో సాధించుకున్న ప్రాచీన హోదా ఫలాలను దశాబ్దం గడిచినా తెలుగుజాతి పూర్తి స్థాయిలో అందుకోలేక పోయింది. ప్రాచీన హోదా వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం. ప్రాచీన హోదా కలిగిన భాషల పరిశోధన, అభివృద్ధి, అధ్యయనాలకు భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని భాషల విభాగం నుంచి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందుతుంది. ప్రాచీన హోదా పొందిన ఆయా భాషలలో విశేషమైన కృషి చేసిన కవులు, పండితులకు ప్రతి ఏటా అందజేసే అంతర్జాతీయ పురస్కారాలకు అర్హత లభిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఈ భాషలకు ప్రత్యేకంగా పీఠాలు స్థాపించబడతాయి. ఆ పీఠాల ద్వారా ఆయా భాషల పరిరక్షణకు, అభివృద్ధికి, వ్యాప్తికి మరింత తోడ్పాటు లభిస్తుంది. ఈ లక్ష్యాల సాధన ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యేది కాదు. అందుకు వ్యవస్థీకృతమైన ఒక సంస్థ అవసరం. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు దక్షిణ భారత భాషలకు, మైసూరు కేంద్రంగా 1969 నుంచీ పనిచేస్తున్న భారతీయ భాషల కేంద్రీయ సంస్థకు (Central Institute of Indian Languages - CIIL) ఈ బాధ్యతనూ అప్పగించింది. భాషలకు సంబంధించినవే అయినప్పటికీ, ఈ సంస్థ నిర్వహించే అనేక ఇతర కార్యక్రమాలలో ప్రాచీన భాషల పరిరక్షణ తగిన ప్రాధాన్యాన్ని పొందలేకపోయింది. తమిళనాడు, కర్ణాటక ముందే మేల్కొని ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. తెలుగుకు కూడా తమ గడ్డ మీదనే ఇటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయటానికి, దాదాపు ప్రాచీన హోదా సాధించటానికి అవసరమైనంత ప్రయాస అవసరమైంది. ఇన్నాళ్లకు సాధ్యమైంది. విజయదశమి నాడు ప్రారంభానికి ముహూర్తం కూడా నిర్ణయమైంది. ఈ విజయానికి కారకులందరూ అభినందనీయులు. ఇంగ్లిష్ ధాటికి తీయదనాన్నే కాదు, క్రమంగా తన ఉనికినే కోల్పోతున్న సమయంలో మాతృభాష మీద మక్కువతో కొందరు వ్యక్తులూ కొన్ని సంస్థలూ వారి పరిధిలో కృషి చేస్తూనే ఉన్నారు, ఉన్నాయి. కేవలం వ్యక్తుల, సంస్థల కృషి ఫలితం కొంతైనా కళ్ళకు కనబడుతున్నపుడు, వ్యవస్థీకృతమైన సంస్థ ఎంతటి విజయాలను సాధించగలదో చెప్పనవసరంలేదు. తెలుగుకు ప్రాచీన హోదా లభించటానికి చాలా కాలం క్రితమే తెలుగుకు ప్రత్యేకించి CIIL తరహాలో ఒక సంస్థ ఉండేది. అంతర్జాతీయ తెలుగు సంస్థ. (International Institute of Telugu - ITI) భారత దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ తెలుగు భాషా బోధన, అధ్యయనాలు పెంపొందేలా ప్రోత్సహించడం, తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి మొదలైన విషయాల్లో విస్తృతంగా పరిశోధనలు నిర్వహించడం, తెలుగు ప్రజల జీవనశైలి, సంస్కృతులకు సంబంధించిన పుస్తకాలను, సిద్ధాంత వ్యాసాలను, ఏకవిషయ రచనలనూ ప్రచురించడం, పుస్తక ప్రదర్శనలను నిర్వహించడం, విదేశాలనుంచి సొంత రాష్ట్రాలకు వచ్చే తెలుగువారి కోసం, వాడుక భాష తీరుతెన్నుల గురించి బోధనా తరగతులను నిర్వహించడం మొదలైనవి ఈ సంస్థ లక్ష్యాలు. 1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధుల సమావేశం చేసిన ఒక తీర్మానం ద్వారా ఈ సంస్థ ఆవిర్భవించింది. తరువాతి కాలంలో ఈ సంస్థ తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమై ఇప్పటికీ ఉనికిలోనే ఉన్నా, చేస్తున్న కార్యక్రమాలు మాత్రం వెలుగులో లేవు. ఈ సంస్థ అర్ధంతరంగా నిలిపివేసిన ప్రయోజనకరమైన కార్యక్రమాలను, నూతనంగా ఏర్పాటైన సంస్థ, ప్రాధాన్యతా క్రమంలో పునరుద్ధరించి కొనసాగించాలి. చాలా రంగాల్లో సాంప్రదాయ పద్ధతులకు కాలం చెల్లిపోయింది. ప్రచురణ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు. పుస్తకాలను డిజిటలైజేషన్ చేసే కృషి, అనేక దేశాలలో చాలా కాలం క్రితమే ప్రారంభమయింది. ఈ రోజున ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి ప్రతి పుస్తకమూ డిజిటల్ రూపంలో లభ్యమవుతున్నది. తెలుగుకు సంబంధించి ఈ ప్రక్రియ శైశవ దశలో కూడా లేదు. జీవిత కాలంలో కంప్యూటరును తాకని రచయితల విషయం అలా ఉంచితే చేతిరాత బదులు కంప్యూటరు ఉపయోగించే ఆధునిక యువ రచయితలు సయితం ప్రచురణల విషయానికి వచ్చేసరికి సాంప్రదాయ పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. పుస్తకాలు, అవి ఎంతటి మహత్తరమైనవైనా, విక్రేతల అద్దాల బీరువాల నుంచి రచయితల ఇంటి అటకల మీదకు చేరిపోయి క్రిమికీటకాదుల భోజ్యమవుతాయి. ఒక రచయితకు ఇంతకంటే దురవస్థ మరొకటి ఉంటుందా! ఇవాళ్టి రోజున స్మార్టు ఫోను లేని పౌరుడు లేడు. డేటా ఎంత వాడినా మిగిలి పోయే పరిస్థితి. అలాంటప్పుడు తెలుగు సాహితీ ప్రియులకు కావలసిన పుస్తకం తమ చేతిలో ఉన్న మొబైల్ ఫోనులోనే ఎదురుగా కనిపిస్తుంటే పండగే కాదూ! నూతనంగా ఏర్పడిన తెలుగు అధ్యయన కేంద్రం రచయితలను డిజిటల్ మాధ్యమంలో ప్రచురించుకునే దిశగా చైతన్య పరచాలి. గొప్ప పుస్తకాలను సంస్థే సేకరించి డిజిటల్ రూపంలో పునఃప్రచురించే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ సంస్థ తెలుగు భాషను అత్యున్నత స్థాయిలో నిలుపుతుందనీ, తెలుగు రచయితలు తలయెత్తుకునేలా విజయం సాధిస్తుందనీ ఆశిద్దాం. - కొండూరు తులసీదాస్ (వ్యవస్థాపకులు, దాసుభాషితం.కామ్) -
గురుకుల పాఠశాలల్లో 324 సీట్లు భర్తీ
డిచ్పల్లి(నిజామాబాద్ రూరల్): ఉమ్మడి జిల్లా(నిజామాబాద్, కామారెడ్డి)కు సంబంధించి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రెండు జిల్లాల గురుకుల విద్యాలయాల సంస్థ రీజనల్ కోఆర్డినేటర్ తులసీదాస్ నేతృత్వంలో మండలంలోని ధర్మారం(బి) గురుకుల పాఠశాలలో కౌన్సెలింగ్ జరిగింది. రెండు జిల్లాల్లోని బాలురు, బాలికల గురుకుల పాఠశాలల్లో 324 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ తెలిపారు. ప్రవేశం పొందిన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో ఈనెల 8వ తేదీ లోగా చేరాలన్నారు. ఆ తర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే మలి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నా రు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోఆర్డినేటర్లు సరోజినిదేవి, ఉమాదేవి, వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్స్ సింధు, సంగీత, సత్యనారాయణ, కృతమూర్తి, రాజ్యలక్ష్మి, అసిస్టెంట్లు ప్రమోద్, నీరజ, చక్రపాణి, రాజేశ్వర్ పాల్గొన్నారు. కౌన్సిలింగ్‌కు భారీ సంఖ్యలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలి వచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌన్సెలింగ్ కొనసాగింది. -
గుండెపోటుతో కుప్పకూలిన క్యాబ్ డ్రైవర్!
క్యాబ్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో నగరంలో విషాద ఘటన హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన ఉప్పల్ ఫిర్జాదిగూడలో తులసీదాస్ అనే క్యాబ్ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తులసీదాస్ రెండు నెలల క్రితం బజాజ్ ఫైనాన్స్‌లో టీవీ కొనుగోలు చేశాడు. అయితే రెండు వాయిదాలు చెల్లించడంలో ఆలస్యం కావడంతో సదరు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఆయనను నిలదీశారు. దీంతో తులసీదాస్‌కు ఫైనాన్స్ ప్రతినిధులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫైనాన్స్ ప్రతినిధులు తులసీదాస్ ఇంట్లో నుంచి టీవీని బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన తులసీదాస్ కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. తులసీదాస్‌కు నలుగురు ఆడపిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి క్యాబ్ డ్రైవర్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో క్యాబ్ డ్రైవర్లలో విషాదం నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, ఉబెర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదని, ఈ నేపథ్యంలో గత్యంతరంలేని పరిస్థితుల్లో తాము దీక్షకు దిగామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్‌కొందూల్కర్ అంటున్నారు.