కొన్ని వారాల క్రితం తెలుగు భాష, సాహిత్యాభిమానులందరూ సంతోషించదగిన పరిణామం చోటు చేసుకున్నది. అదే, మైసూరు నుంచి తెలుగు ప్రాచీన భాషా అధ్యయన కేంద్రం తెలుగు నేలకు తరలి రావడం. ఇప్పటి వరకూ ఈ కేంద్రం రాష్ట్రం బయట ఉండటం వల్ల, 2008లో సాధించుకున్న ప్రాచీన హోదా ఫలాలను దశాబ్దం గడిచినా తెలుగుజాతి పూర్తి స్థాయిలో అందుకోలేక పోయింది.
ప్రాచీన హోదా వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం. ప్రాచీన హోదా కలిగిన భాషల పరిశోధన, అభివృద్ధి, అధ్యయనాలకు భారత ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖలోని భాషల విభాగం నుంచి ఇతోధికంగా ఆర్థిక సహాయం అందుతుంది. ప్రాచీన హోదా పొందిన ఆయా భాషలలో విశేషమైన కృషి చేసిన కవులు, పండితులకు ప్రతి ఏటా అందజేసే అంతర్జాతీయ పురస్కారాలకు అర్హత లభిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో ఈ భాషలకు ప్రత్యేకంగా పీఠాలు స్థాపించబడతాయి. ఆ పీఠాల ద్వారా ఆయా భాషల పరిరక్షణకు, అభివృద్ధికి, వ్యాప్తికి మరింత తోడ్పాటు లభిస్తుంది.
ఈ లక్ష్యాల సాధన ఒక వ్యక్తి వల్ల సాధ్యమయ్యేది కాదు. అందుకు వ్యవస్థీకృతమైన ఒక సంస్థ అవసరం. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, నాలుగు దక్షిణ భారత భాషలకు, మైసూరు కేంద్రంగా 1969 నుంచీ పనిచేస్తున్న భారతీయ భాషల కేంద్రీయ సంస్థకు (Central Institute of Indian Languages - CIIL) ఈ బాధ్యతనూ అప్పగించింది. భాషలకు సంబంధించినవే అయినప్పటికీ, ఈ సంస్థ నిర్వహించే అనేక ఇతర కార్యక్రమాలలో ప్రాచీన భాషల పరిరక్షణ తగిన ప్రాధాన్యాన్ని పొందలేకపోయింది. తమిళనాడు, కర్ణాటక ముందే మేల్కొని ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. తెలుగుకు కూడా తమ గడ్డ మీదనే ఇటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయటానికి, దాదాపు ప్రాచీన హోదా సాధించటానికి అవసరమైనంత ప్రయాస అవసరమైంది. ఇన్నాళ్లకు సాధ్యమైంది. విజయదశమి నాడు ప్రారంభానికి ముహూర్తం కూడా నిర్ణయమైంది. ఈ విజయానికి కారకులందరూ అభినందనీయులు.
ఇంగ్లిష్ ధాటికి తీయదనాన్నే కాదు, క్రమంగా తన ఉనికినే కోల్పోతున్న సమయంలో మాతృభాష మీద మక్కువతో కొందరు వ్యక్తులూ కొన్ని సంస్థలూ వారి పరిధిలో కృషి చేస్తూనే ఉన్నారు, ఉన్నాయి. కేవలం వ్యక్తుల, సంస్థల కృషి ఫలితం కొంతైనా కళ్ళకు కనబడుతున్నపుడు, వ్యవస్థీకృతమైన సంస్థ ఎంతటి విజయాలను సాధించగలదో చెప్పనవసరంలేదు.
తెలుగుకు ప్రాచీన హోదా లభించటానికి చాలా కాలం క్రితమే తెలుగుకు ప్రత్యేకించి CIIL తరహాలో ఒక సంస్థ ఉండేది. అంతర్జాతీయ తెలుగు సంస్థ. (International Institute of Telugu - ITI) భారత దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ, విదేశాలలోనూ తెలుగు భాషా బోధన, అధ్యయనాలు పెంపొందేలా ప్రోత్సహించడం, తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి మొదలైన విషయాల్లో విస్తృతంగా పరిశోధనలు నిర్వహించడం, తెలుగు ప్రజల జీవనశైలి, సంస్కృతులకు సంబంధించిన పుస్తకాలను, సిద్ధాంత వ్యాసాలను, ఏకవిషయ రచనలనూ ప్రచురించడం, పుస్తక ప్రదర్శనలను నిర్వహించడం, విదేశాలనుంచి సొంత రాష్ట్రాలకు వచ్చే తెలుగువారి కోసం, వాడుక భాష తీరుతెన్నుల గురించి బోధనా తరగతులను నిర్వహించడం మొదలైనవి ఈ సంస్థ లక్ష్యాలు.
1975లో మొదటి ప్రపంచ తెలుగు మహాసభల ప్రతినిధుల సమావేశం చేసిన ఒక తీర్మానం ద్వారా ఈ సంస్థ ఆవిర్భవించింది. తరువాతి కాలంలో ఈ సంస్థ తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనమై ఇప్పటికీ ఉనికిలోనే ఉన్నా, చేస్తున్న కార్యక్రమాలు మాత్రం వెలుగులో లేవు. ఈ సంస్థ అర్ధంతరంగా నిలిపివేసిన ప్రయోజనకరమైన కార్యక్రమాలను, నూతనంగా ఏర్పాటైన సంస్థ, ప్రాధాన్యతా క్రమంలో పునరుద్ధరించి కొనసాగించాలి.
చాలా రంగాల్లో సాంప్రదాయ పద్ధతులకు కాలం చెల్లిపోయింది. ప్రచురణ రంగం కూడా దీనికి మినహాయింపు కాదు. పుస్తకాలను డిజిటలైజేషన్ చేసే కృషి, అనేక దేశాలలో చాలా కాలం క్రితమే ప్రారంభమయింది. ఈ రోజున ఆంగ్ల సాహిత్యానికి సంబంధించి ప్రతి పుస్తకమూ డిజిటల్ రూపంలో లభ్యమవుతున్నది. తెలుగుకు సంబంధించి ఈ ప్రక్రియ శైశవ దశలో కూడా లేదు. జీవిత కాలంలో కంప్యూటరును తాకని రచయితల విషయం అలా ఉంచితే చేతిరాత బదులు కంప్యూటరు ఉపయోగించే ఆధునిక యువ రచయితలు సయితం ప్రచురణల విషయానికి వచ్చేసరికి సాంప్రదాయ పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. పుస్తకాలు, అవి ఎంతటి మహత్తరమైనవైనా, విక్రేతల అద్దాల బీరువాల నుంచి రచయితల ఇంటి అటకల మీదకు చేరిపోయి క్రిమికీటకాదుల భోజ్యమవుతాయి. ఒక రచయితకు ఇంతకంటే దురవస్థ మరొకటి ఉంటుందా!
ఇవాళ్టి రోజున స్మార్టు ఫోను లేని పౌరుడు లేడు. డేటా ఎంత వాడినా మిగిలి పోయే పరిస్థితి. అలాంటప్పుడు తెలుగు సాహితీ ప్రియులకు కావలసిన పుస్తకం తమ చేతిలో ఉన్న మొబైల్ ఫోనులోనే ఎదురుగా కనిపిస్తుంటే పండగే కాదూ! నూతనంగా ఏర్పడిన తెలుగు అధ్యయన కేంద్రం రచయితలను డిజిటల్ మాధ్యమంలో ప్రచురించుకునే దిశగా చైతన్య పరచాలి. గొప్ప పుస్తకాలను సంస్థే సేకరించి డిజిటల్ రూపంలో పునఃప్రచురించే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ సంస్థ తెలుగు భాషను అత్యున్నత స్థాయిలో నిలుపుతుందనీ, తెలుగు రచయితలు తలయెత్తుకునేలా విజయం సాధిస్తుందనీ ఆశిద్దాం.
- కొండూరు తులసీదాస్
(వ్యవస్థాపకులు, దాసుభాషితం.కామ్)
Comments
Please login to add a commentAdd a comment