గురుకులాల్లో 7,306 పోస్టులు | Telangana:Notification to fulfil 7,306 posts in residentials | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో 7,306 పోస్టులు

Published Tue, Feb 7 2017 2:15 AM | Last Updated on Tue, Sep 5 2017 3:03 AM

గురుకులాల్లో 7,306 పోస్టులు

గురుకులాల్లో 7,306 పోస్టులు

- నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ
- 5,459 పోస్టులు మహిళలకే.. బాలికల గురుకులాల్లో అన్ని పోస్టుల్లో వారితోనే భర్తీ
- ఈ నెల 10 నుంచి వచ్చేనెల 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
- ఆఫ్‌లైన్‌లో ప్రిలిమినరీ.. అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్‌లైన్‌లో మెయిన్‌
- టీజీటీ పోస్టుల్లో టెట్‌కు వెయిటేజీ యథాతథం
- త్వరలో 700 జేఎల్, డీఎల్, 400 వీఏఎస్‌ పోస్టులకు నోటిఫికేషన్లు


సాక్షి, హైదరాబాద్‌

రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల్లో 7,306 బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఐదు రకాల రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 9 కేటగిరీల్లోని పోస్టులను 9 నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 4,362 ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో (tspsc.gov.in) దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

మొత్తంగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2,136, విద్యాశాఖ పరిధిలోని తెలంగాణ గురుకులాల్లో 307, బీసీ గురుకుల విద్యాలయాల్లో 1,789, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 994, మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2,080 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌పీఎస్సీ అత్యధిక పోస్టులకు నోటిఫికేషన్‌ వెలువరించడం ఇదే మొదటిసారి. ఇందులో ఏకంగా 75 శాతం పోస్టులను మహిళలకే కేటాయించడం మరో విశేషం. త్వరలో 700 జేఎల్, డీఎల్‌ పోస్టులతోపాటు 400 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌(వీఏఎస్‌) పోస్టులకు కూడా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేయనుంది.


ఇదీ పరీక్ష విధానం..
టీజీటీ, పీజీటీ తదితర పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ రెండంచెల పరీక్ష విధానాన్ని అమలు చేయనుంది. ప్రిలిమినరీలో ఒక పేపర్, మెయిన్‌లో రెండు పేపర్లలో ఆబ్జెటివ్‌ విధానంలో పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలను ఆఫ్‌లైన్‌లో (రాత పరీక్ష) నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్షను మాత్రం అభ్యర్థుల సంఖ్యను బట్టి ఆన్‌లైన్‌లో (కంప్యూటర్‌ ఆధారిత) నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులను బట్టి 1:15 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు అనుమతిస్తారు. రాతపరీక్ష తేదీల వివరాలను టీఎస్‌పీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌లో వెల్లడించనుంది.

టీజీటీ, పీజీటీ, ఇతర పోస్టులకు..
పేపర్‌–1 ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో అర్హత సాధించిన వారిని మెయిన్‌కు అనుమతిస్తారు. ఇందులో జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్, బేసిక్‌ ప్రొఫిషియెన్సీ ఇన్‌ ఇంగ్లిష్‌ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. 150 ప్రశ్నలతో 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 నిమిషాల సమయం ఇస్తారు.
పేపర్‌–2 మెయిన్‌ పరీక్ష: 300 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్‌–1: 150 మార్కులకు నిర్వహిస్తారు. పెడగాజీ/స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అంశాల్లో ప్రశ్నలుంటాయి. 150 ప్రశ్నలు.. 150 మార్కులు.. 150 నిమిషాలు.
పేపర్‌–2: సంబంధిత సబ్జెక్టులో పరీక్ష నిర్వహిస్తారు. 150 ప్రశ్నలు.. 150 మార్కులు.. 150 నిమిషాలు.
ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ తదితర స్పెషల్‌ టీచర్లకు: ఒకే పేపర్‌ ఉంటుంది. ఇందులో జనరల్‌ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానంపై 200 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. 180 నిమిషాల సమయం ఇస్తారు.

టీజీటీ పోస్టుల్లో టెట్‌ వెయిటేజీ యథాతథం
ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) స్కోర్‌కు 20 శాతం వెయిటేజీని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ పోస్టులకు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్‌ సాధించిన వారిలో రిజర్వేషన్ల వారీగా 1:15 రేషియోలో మెయిన్‌ పరీక్షకు అనుమతిస్తారు. మెయిన్‌లో వచ్చిన మెరిట్‌కు 80 శాతం వెయిటేజీ, టెట్‌ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంపిక జాబితాను ఖరారు చేయనున్నారు.

మీడియంపై ఆంక్షల్లేవు..
పోస్టులు భర్తీ చేయనున్న స్కూళ్లు ఇంగ్లిషు మీడియంకు చెందినవి కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌ మీడియంలోనే చదివి ఉండాల్సిన అవసరం లేదు. మీడియం విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిసింది. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్న పూర్తిస్థాయి నోటిపికేషన్‌లో వీటిపై స్పష్టత ఇవ్వనుంది. ఇంగ్లిషు.. తెలుగు.. ఏ మీడియంలో చదివినా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే పరీక్షలో ప్రశ్నపత్రాన్ని మాత్రం ఇంగ్లిషులోనే ఇవ్వనున్నారు. పాత జిల్లాలు, పాత జోన్ల ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేసేలా ఏర్పాట్లు చేశారు.

75 శాతం పోస్టులు మహిళలకే
గురుకుల స్కూళ్లలో భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రభుత్వం మహిళలకే పెద్దపీట వేసింది. 75 శాతం పోస్టులను వారికే కేటాయించింది. బాలికల గురుకులాల్లో మొత్తం పోస్టులను మహిళలతోనే భర్తీ చేసేలా టీఎస్‌పీఎస్సీ చర్యలు చేపట్టింది. మొత్తం 7,306 పోస్టుల్లో 5,459 పోస్టులను మహిళ అభ్యర్థులతోనే భర్తీ చేసేలా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
మహిళా అభ్యర్థులతో భర్తీ చేసే పోస్టులివీ..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement