ఉగ్రరక్కసి అంతం.. ఉమ్మడి లక్ష్యం
విస్తృత సహకారంతో కలిసి పోరాడాలి
♦ ప్రపంచం కలసి రావాలి
♦ నా పర్యటన ఉద్దేశం ఇదే
♦ ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పిలుపు
♦ భారత ప్రధానితో చర్చలు
♦ రాఫెల్ ఫైటర్ జెట్స్ సహా 14 ఒప్పందాలపై సంతకాలు
న్యూఢిల్లీ/గుర్గావ్: ఉగ్రవాదం భారత్, ఫ్రాన్స్‌ల ఉమ్మడి సమస్య అని, ఉగ్ర రక్కసిని అంతమొందించే విషయంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం తన భారత పర్యటన ముఖ్య ఉద్దేశమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పేర్కొన్నారు. 2016 సంవత్సర గణతంత్ర ఉత్సవాల ముఖ్య అతిథిగా భారత్‌కు వచ్చిన హోలాండ్.. సోమవారం వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. మొదట గాంధీజీ సమాధి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ప్రణబ్, ప్రధాని మోదీల సమక్షంలో అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సహా 14 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హోలాండ్‌తో ప్రత్యేకంగా సమావేశమై, అణు, రక్షణ, పర్యావరణ, అంతరిక్ష, సౌర విద్యుత్.. తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. హోలాండ్ రాష్ట్రపతి భవన్లో మాట్లాడుతూ.. పారిస్ పర్యావరణ సదస్సు విజయవంతం కావడంలో మోదీ కీలక పాత్ర పోషించారంటూ ప్రశంసించారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు.. అన్నిరంగాల్లో భారత్‌తో ఆర్థికపరమైన అన్ని సంబంధాలనూ మరింత దృఢపర్చుకుంటామన్నారు. ఉగ్రవాద సవాళ్లకు ఫ్రాన్స్ భయపడబోదని, తాము నమ్మిన విలువల పరిరక్షణకు నిత్యం సిద్ధంగా ఉంటామన్నారు.
‘రాఫెల్’ రేటు కుదర్లేదు: ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సోమవారం సంతకాలు జరిగాయి. కానీ ఆ ఫైటర్ జెట్స్ ధరపై అంగీకారం కుదరకపోవడంతో ఒప్పందం నుంచి ఆ సంబంధిత అంశాన్ని మాత్రం పక్కనబెట్టారు. ఇరు దేశాల నిపుణులు ప్రస్తుతం ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఆ సమస్య పరిష్కారమవుతుందని హోలాండ్‌తో కలిసి పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన 36 ఫైటర్ జెట్లను ‘విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న స్థితిలో’ కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని గత సంవత్సరం మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు.
► {ఫాన్స్ సాయంతో చండీగఢ్, నాగ్‌పూర్, పుదుచ్చేరిలను స్మార్ట్ సిటీలను చేసే ఎంఓయూపై సంతకాలు జరిగాయి.
► అంబాలా, లూథియానా రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ కంపెనీ అల్‌స్టోమ్ భారత్ కోసం బిహార్‌లోని మాధేపూరలో 800 ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్‌ను తయారు చేసి ఇస్తుంది. వీటి సామర్ధ్యం ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఎలక్ట్రిక్ రైలింజన్ల కన్నా రెట్టింపు ఉంటుంది.
ఐసిస్‌పై దాడులు చేస్తూనే ఉంటాం..
మోదీ, హోలాండ్‌ల ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్య సహకారంతో పాటు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. ‘పారిస్ నుంచి పఠాన్‌కోట్ వరకు ఉగ్రవాద వికృత రూపాన్ని చూశాం. ఉగ్రవాదంపై పోరులో విస్తృత సహకారం అవసరమని నిర్ణయించాం. ఉగ్రవాదులకు స్వర్గధామాలుగా నిలుస్తూ, వారికి ఆర్థికంగా, వసతుల పరంగా, శిక్షణ, ఆయుధాల పరంగా సహకరిస్తున్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఇందులో విస్తృత స్థాయిలో పరస్పర సహకారానికి అంగీకరించాం’ అని మోదీ పేర్కొన్నారు.
మా చిన్నారుల ప్రాణాలు తీసిన ఐసిస్ ఉగ్రసంస్థను అంతమొందించేవరకు దాడులు చేస్తూనే ఉంటామని హోలాండ్ ఉద్ఘాటించారు. ‘ఇరుదేశాల మధ్య అణు శక్తి సాంకేతికతను పంచుకోవడాన్ని మించిన విశ్వాస కల్పన మరొకటి లేదు. జైతాపూర్ అణుకేంద్రంలోని ఆరు రియాక్టర్లకు సంబంధించిన సమస్యలు కూడా ఓ ఏడాదిలో పరిష్కారమవుతాయని భావిస్తున్నా’నన్నారు. పఠాన్‌కోట్, 2008 ముంబై దాడుల సూత్రధారులపై సత్వర చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు మరోసారి విజ్ఞప్తి చేసినట్లుగా చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థల్లో చేరికలను అడ్డుకోవడం, వాటి ఆర్థిక వనరులను, మౌలిక వసతులను నాశనం చేయడం, సైబర్ సెక్యూరిటీ.. తదితర విషయాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్‌వర్క్, అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
ఐఎస్‌ఏ సెక్రటేరియట్ ప్రారంభం
అంతర్జాతీయ సౌర విద్యుత్ దేశాల కూటమి(ఐఎస్‌ఏ) తాత్కాలిక సచివాలయాన్ని హోలాండ్, మోదీలు గుర్గావ్‌లో ప్రారంభించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రాంగణంలో ఐఎస్‌ఏ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
నేడు షారూఖ్, ఐశ్వర్యలతో లంచ్
ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో లంచ్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, దర్శకుడు ఆదిత్య చోప్రా, ఫ్రాన్స్ నటి కాల్కి కొచ్లిన్‌లతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం అందింది. హోలాండ్‌తో వారు సినిమాలపై చర్చిస్తారు. మంగళవారం జరిగే ఈ మధ్యాహ్న విందుకు భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచీర్ ఆతిథ్యం ఇస్తున్నారు.