French President Hollande
-
తొలిసారి విదేశీ జవాన్ల కవాతు
ఆకట్టుకున్న ఫ్రెంచ్ పదాతిదళం న్యూఢిల్లీ: భారత చరిత్రలో తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో విదేశీ సైనికులు కవాతు చేశారు. రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో ఫ్రెంచ్ సైనికులు (ఆ దేశ మిలటరీలోని 35వ పదాతిదళం) పాల్గొన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ పాల్ నాయకత్వంలో 76 మంది సైనికుల బృందం రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్లతోపాటు అశేష ప్రేక్షకుల ముందు పరేడ్‌లో పాల్గొన్నారు. 48 సభ్యుల ఫ్రెంచ్ మిలటరీ బ్యాండ్ అందించిన రెండు మిలటరీ ట్యూన్లను నేతలతోపాటు ఆహుతులు చప్పట్లతో అభినందించారు. పరేడ్‌లో పాల్గొనటం గర్వంగా ఉందని.. ఇది తమ పదాతిదళానికి దక్కిన అరుదైన గౌరవమని ఈ బృంద సారథి పాల్ తెలిపారు. ఫ్రెంచ్ చరిత్రలో ఈ 35వ ఇన్ఫాంట్రీ చాలా పురాతనమైనదని, అల్జీరియా, ఆఫ్రికా, అఫ్గాన్ వంటి దేశాల్లో 12 యుద్ధాల్లో పాల్గొందని వెల్లడించారు. -
రాజ్‌పథ్‌లో మువన్నెల రెపరెపలు!
-
రాజ్‌పథ్‌లో మువన్నెల రెపరెపలు!
ఢిల్లీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ఆకట్టుకుంటున్న సైనిక కవాత్తులు న్యూఢిల్లీ: అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మంగళవారం 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ఆహూతులతో కలిసి జాతీయగీతాన్ని ఆలపించారు. అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలాండ్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హోలాండ్ను ఈ వేడుకకు సాదరంగా తోడుకొని వచ్చారు. కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పెద్దసంఖ్యలో ప్రజలు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాజ్‌పథ్ ఆవరణలో కళ్లుచెదిరే రీతిలో గణతంత్ర దినోత్సవం వేడుకలు కొనసాగాయి. మొదట త్రివిధ దళాలు కవాత్తు నిర్వహించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వందనం సమర్పించాయి. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్ల కుటుంబసభ్యులకు, విశేష సేవలందించిన వీర సైనికులకు రాష్ట్రపతి శౌర్య పతకాలు ప్రదానం చేశారు. మువన్నెల పతాపు రెపరెపల కింద శకటాల కవాత్తు, సైనికుల కళ్లు చెదిరే విన్యాసాలతో కోలాహలంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. సైనిక బలగాలు తమ పాటవాన్ని, శక్తిసామర్థ్యాలను విశేష రీతిలో ప్రదర్శించాయి. మొట్టమొదటిసారిగా ఈసారి విదేశీ సైన్యం కూడా రాజ్‌పథ్ వద్ద కవాతు నిర్వహించింది. ఫ్రాన్స్ సైన్యం తన విన్యాసాలతో ఆకట్టుకుంది. -
హస్తిన కంచుకోట!
సాక్షి, న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి, ఐసిస్ ఉగ్రవాదుల దాడి కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్ డే వేడుకల కోసం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. వేడుకలకు వేదికైన దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో డేగ కన్నేశారు. ఢిల్లీలో వివిధ ఉగ్రవాద సంస్థల ముఠాలున్నాయని, నగరంలో దాడులు జరగొచ్చని సమాచారం అందడంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు జరిగే రాజ్‌పథ్‌కు చుట్టుపక్కలున్న 71 ఎత్తయిన భవనాల్లో మంగళవారం కొన్నింటిని పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా మూసేస్తారు. వాటిపై ఆర్మీ షార్ప్ షూటర్స్‌ను మోహరించారు. ముష్కరులు డ్రోన్ల ద్వారా దాడులకు పాల్పడొచ్చన్న అనుమానంతో రాడార్‌తో జల్లెడపడుతున్నారు. మూడు నెలల కిందట ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర్లో ఇటీవల ఒక అనుమానిత డ్రోన్ కనిపించడం, నగరంలో ఆర్మీకి చెందిన మూడు వాహనాలు చోరీ అయిన నేపథ్యంలో లోపాలకు తావులేని భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి అయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పర్యటన, పరేడ్ సజావుగా సాగేందుకు 49 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. హోలాండ్ పర్యటనకోసం 20 వేల మందిని కేటాయించారు. కీలక ప్రాంతాల్లో వేలాది సీసీటీవీలు అమర్చారు. రాజ్‌పథ్‌పై విజయ్ చౌక్ నుంచి ఇండియాగేట్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పరేడ్ జరిగే 9.50 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 300 కి.మీ పరధి మేర నగరాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు ఆ సమయంలో పౌర విమానాలనూ గగనతలంలో ఎగరనివ్వరు. కాగా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అదనపు బలగాలతో భద్రత పెంచారు. ఈ రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేకతలు ► ఫ్రాన్స్ సేనలు రిపబ్లిక్ కవాతు చేయనున్నాయి. పరేడ్‌లో విదేశీ సేనలు పాల్గొనడం ఇదే తొలిసారి. ► 26 ఏళ్ల తర్వాత సైన్యానికి చెందిన జాగిలాలు పరేడ్‌లో పాల్గొంటున్నాయి. ► సాధారణ సమయం కంటే పరేడ్ నిర్వహణ కాలాన్ని 25 నిమిషాలు తగ్గించారు. ► {పత్యేకంగా ఒక మహిళా సీఆర్పీఎఫ్ దళం సైనిక విన్యాసాలు చేయనుంది. ► వీవీఐపీ ఎన్‌క్లోజర్‌పై గాజు పైకప్పును బిగించారు. -
ఉగ్రరక్కసి అంతం.. ఉమ్మడి లక్ష్యం
విస్తృత సహకారంతో కలిసి పోరాడాలి ♦ ప్రపంచం కలసి రావాలి ♦ నా పర్యటన ఉద్దేశం ఇదే ♦ ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పిలుపు ♦ భారత ప్రధానితో చర్చలు ♦ రాఫెల్ ఫైటర్ జెట్స్ సహా 14 ఒప్పందాలపై సంతకాలు న్యూఢిల్లీ/గుర్గావ్: ఉగ్రవాదం భారత్, ఫ్రాన్స్‌ల ఉమ్మడి సమస్య అని, ఉగ్ర రక్కసిని అంతమొందించే విషయంలో ఇరుదేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడం తన భారత పర్యటన ముఖ్య ఉద్దేశమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ పేర్కొన్నారు. 2016 సంవత్సర గణతంత్ర ఉత్సవాల ముఖ్య అతిథిగా భారత్‌కు వచ్చిన హోలాండ్.. సోమవారం వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. మొదట గాంధీజీ సమాధి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులర్పించారు. రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రణబ్, ప్రధాని మోదీల సమక్షంలో అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు సహా 14 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హోలాండ్‌తో ప్రత్యేకంగా సమావేశమై, అణు, రక్షణ, పర్యావరణ, అంతరిక్ష, సౌర విద్యుత్.. తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. హోలాండ్ రాష్ట్రపతి భవన్లో మాట్లాడుతూ.. పారిస్ పర్యావరణ సదస్సు విజయవంతం కావడంలో మోదీ కీలక పాత్ర పోషించారంటూ ప్రశంసించారు. వ్యవసాయం నుంచి అంతరిక్షం వరకు.. అన్నిరంగాల్లో భారత్‌తో ఆర్థికపరమైన అన్ని సంబంధాలనూ మరింత దృఢపర్చుకుంటామన్నారు. ఉగ్రవాద సవాళ్లకు ఫ్రాన్స్ భయపడబోదని, తాము నమ్మిన విలువల పరిరక్షణకు నిత్యం సిద్ధంగా ఉంటామన్నారు. ‘రాఫెల్’ రేటు కుదర్లేదు: ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సోమవారం సంతకాలు జరిగాయి. కానీ ఆ ఫైటర్ జెట్స్ ధరపై అంగీకారం కుదరకపోవడంతో ఒప్పందం నుంచి ఆ సంబంధిత అంశాన్ని మాత్రం పక్కనబెట్టారు. ఇరు దేశాల నిపుణులు ప్రస్తుతం ఏకాభిప్రాయం కోసం చర్చలు జరుపుతున్నారు. త్వరలో ఆ సమస్య పరిష్కారమవుతుందని హోలాండ్‌తో కలిసి పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన 36 ఫైటర్ జెట్లను ‘విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న స్థితిలో’ కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన ఒప్పందాన్ని గత సంవత్సరం మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ► {ఫాన్స్ సాయంతో చండీగఢ్, నాగ్‌పూర్, పుదుచ్చేరిలను స్మార్ట్ సిటీలను చేసే ఎంఓయూపై సంతకాలు జరిగాయి. ► అంబాలా, లూథియానా రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు ఫ్రాన్స్‌తో ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్ కంపెనీ అల్స్టోమ్ భారత్ కోసం బిహార్‌లోని మాధేపూరలో 800 ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్‌ను తయారు చేసి ఇస్తుంది. వీటి సామర్ధ్యం ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఎలక్ట్రిక్ రైలింజన్ల కన్నా రెట్టింపు ఉంటుంది. ఐసిస్‌పై దాడులు చేస్తూనే ఉంటాం.. మోదీ, హోలాండ్ల ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్య సహకారంతో పాటు ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. ‘పారిస్ నుంచి పఠాన్‌కోట్ వరకు ఉగ్రవాద వికృత రూపాన్ని చూశాం. ఉగ్రవాదంపై పోరులో విస్తృత సహకారం అవసరమని నిర్ణయించాం. ఉగ్రవాదులకు స్వర్గధామాలుగా నిలుస్తూ, వారికి ఆర్థికంగా, వసతుల పరంగా, శిక్షణ, ఆయుధాల పరంగా సహకరిస్తున్న వారికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాం. ఇందులో విస్తృత స్థాయిలో పరస్పర సహకారానికి అంగీకరించాం’ అని మోదీ పేర్కొన్నారు. మా చిన్నారుల ప్రాణాలు తీసిన ఐసిస్ ఉగ్రసంస్థను అంతమొందించేవరకు దాడులు చేస్తూనే ఉంటామని హోలాండ్ ఉద్ఘాటించారు. ‘ఇరుదేశాల మధ్య అణు శక్తి సాంకేతికతను పంచుకోవడాన్ని మించిన విశ్వాస కల్పన మరొకటి లేదు. జైతాపూర్ అణుకేంద్రంలోని ఆరు రియాక్టర్లకు సంబంధించిన సమస్యలు కూడా ఓ ఏడాదిలో పరిష్కారమవుతాయని భావిస్తున్నా’నన్నారు. పఠాన్‌కోట్, 2008 ముంబై దాడుల సూత్రధారులపై సత్వర చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు మరోసారి విజ్ఞప్తి చేసినట్లుగా చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థల్లో చేరికలను అడ్డుకోవడం, వాటి ఆర్థిక వనరులను, మౌలిక వసతులను నాశనం చేయడం, సైబర్ సెక్యూరిటీ.. తదితర విషయాల్లో సహకారాన్ని పెంపొందించుకునేందుకు నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నారు. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, హక్కానీ నెట్వర్క్, అల్‌కాయిదా వంటి ఉగ్ర సంస్థల నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఐఎస్ఏ సెక్రటేరియట్ ప్రారంభం అంతర్జాతీయ సౌర విద్యుత్ దేశాల కూటమి(ఐఎస్ఏ) తాత్కాలిక సచివాలయాన్ని హోలాండ్, మోదీలు గుర్గావ్లో ప్రారంభించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రాంగణంలో ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నేడు షారూఖ్, ఐశ్వర్యలతో లంచ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌తో లంచ్‌కు బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్, హీరోయిన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్, దర్శకుడు ఆదిత్య చోప్రా, ఫ్రాన్స్ నటి కాల్కి కొచ్లిన్లతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఆహ్వానం అందింది. హోలాండ్‌తో వారు సినిమాలపై చర్చిస్తారు. మంగళవారం జరిగే ఈ మధ్యాహ్న విందుకు భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి ఫ్రాంకోయిస్ రిచీర్ ఆతిథ్యం ఇస్తున్నారు. -
నేటి నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పర్యటన
చండీగఢ్: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ఆదివారం భారత్‌కు రానున్నారు. మూడురోజుల పాటు హోలాండ్ భారత్‌లో పర్యటిస్తారు. చండీగఢ్‌లో ఆదివారం జరగనున్న భారత్-ఫ్రాన్స్ బిజినెస్ సదస్సులో పాల్గొంటారు. ఆ తరువాత ప్రముఖ స్థలాలను సందర్శిస్తారు. సాయంత్రం ఢిల్లీకి బయలు దేరుతారు. రిపబ్లిక్ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనటంతో పాటు మోదీతో ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు. -
మథనం మొదలైంది
పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాల చర్చలు పేదదేశాలకు ఆర్థిక సాయంపై కూడా ♦ చిన్న ద్వీప దేశాల అధినేతలతో ఒబామా చర్చలు పారిస్: పర్యావరణ మార్పులపై ఐకమత్యంతో పోరాడాలని వివిధ దేశాధినేతలు చెప్పిన మరుసటి రోజే.. గ్రీన్‌హౌజ్ వాయువులకు అడ్డుకట్ట వేసేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు చర్చలు ప్రారంభించాయి. 54 పేజీల నివేదికకు డిసెంబర్ 11న ఆమోదముద్ర వేయాల్సి ఉన్నందున.. ఇందులోని ప్రతి అంశంపై దేశాలు చర్చిస్తున్నాయి. వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో పర్యావరణ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న సమావేశాల్లో ఎప్పుడూ రాని ఏకాభిప్రాయం ఈసారి సాధ్యమవుతుందనే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటివరకు అన్ని సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్న భేటీలు చాలా అరుదు. కాగా, ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో 2 డిగ్రీలను 3కు పెంచాలని విషయంపై మెజారిటీ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే భారత్, చైనా దేశాలు ఉద్గారాన్ని తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పేద దేశాల ఆర్థిక భారాన్ని మోసే విషయంలో ధనిక దేశాలు ఎలాంటి చొరవ తీసుకుంటాయన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. సదస్సులో ఏకాభిప్రాయం రాని పక్షంలో సౌరశక్తి ఉత్పాదన మౌలిక వసతుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థిక భారం పెరుగుతుందని.. దీనిపై అభివృద్ధి చెందిన దేశాలు ఆలోచించి 2020 వరకు ఏడాదికి రూ.65 వేల కోట్ల చొప్పున సమకూర్చాలని ప్రధాని మోదీ కోరారు. చిన్న ద్వీప దేశాల ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమావేశమయ్యారు. భూతాపం ఇలాగే పెరుగుతూ పోతే.. ఈ దేశాలకు ఆర్థిక వనరులతోపాటు, మిలటరీ సేవలు కూడా అందిస్తామని ఒబామా భరోసా కల్పించారు. పర్యావరణ మార్పు విషయాన్ని అన్నిదేశాలు భుజాన వేసుకుని పరిష్కారం దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో సౌరశక్తికోసం మౌలికవసతుల కల్పనకు 2 బిలియన్ యూరోలు(రూ.14వేల కోట్లు) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పరస్పర సహకారంతో ముందుకెళ్దాం బీజింగ్: ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలన్న బ్రిక్స్ దేశాల మీడియా సంస్థలు ఈ విషయాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. మంగళవారం బీజింగ్‌లో జరిగిన ఈ మీడియా సంస్థల సదస్సులో బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) నుంచి వచ్చిన 25 సంస్థలు పాల్గొన్నాయి. డిజిటల్ మీడియా యుగంలో సాంప్రదాయ మీడియా మనుగడ సాధించాలంటే.. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని స్వాగతించాలని.. ఈ దిశగా సాంకేతికతోపాటు సమాచార ప్రసారంలో పరస్పర సహకారం అందించుకోవాలని ఈ సంస్థలు నిర్ణయించాయి. చైనాలోని గ్జిన్హువా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా భారత్ తరపున ‘ద హిందూ’ సంస్థ ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్ (సహ ప్రాయోజితం) చేసింది.