తొలిసారి విదేశీ జవాన్ల కవాతు
ఆకట్టుకున్న ఫ్రెంచ్ పదాతిదళం
న్యూఢిల్లీ: భారత చరిత్రలో తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో విదేశీ సైనికులు కవాతు చేశారు. రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్‌లో ఫ్రెంచ్ సైనికులు (ఆ దేశ మిలటరీలోని 35వ పదాతిదళం) పాల్గొన్నారు. లెఫ్టినెంట్ కల్నల్ పాల్ నాయకత్వంలో 76 మంది సైనికుల బృందం రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్‌లతోపాటు అశేష ప్రేక్షకుల ముందు పరేడ్‌లో పాల్గొన్నారు. 48 సభ్యుల ఫ్రెంచ్ మిలటరీ బ్యాండ్ అందించిన రెండు మిలటరీ ట్యూన్లను నేతలతోపాటు ఆహుతులు చప్పట్లతో అభినందించారు.
పరేడ్‌లో పాల్గొనటం గర్వంగా ఉందని.. ఇది తమ పదాతిదళానికి దక్కిన అరుదైన గౌరవమని ఈ బృంద సారథి పాల్ తెలిపారు. ఫ్రెంచ్ చరిత్రలో ఈ 35వ ఇన్‌ఫాంట్రీ చాలా పురాతనమైనదని, అల్జీరియా, ఆఫ్రికా, అఫ్గాన్ వంటి దేశాల్లో 12 యుద్ధాల్లో పాల్గొందని వెల్లడించారు.