
హస్తిన కంచుకోట!
పఠాన్‌కోట్ దాడి, ఐసిస్ ఉగ్రవాదుల దాడి కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్ డే వేడుకల కోసం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
సాక్షి, న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడి, ఐసిస్ ఉగ్రవాదుల దాడి కుట్రను భగ్నం చేసిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్ డే వేడుకల కోసం దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. వేడుకలకు వేదికైన దేశ రాజధాని ఢిల్లీ, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో డేగ కన్నేశారు. ఢిల్లీలో వివిధ ఉగ్రవాద సంస్థల ముఠాలున్నాయని, నగరంలో దాడులు జరగొచ్చని సమాచారం అందడంతో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు జరిగే రాజ్‌పథ్‌కు చుట్టుపక్కలున్న 71 ఎత్తయిన భవనాల్లో మంగళవారం కొన్నింటిని పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా మూసేస్తారు. వాటిపై ఆర్మీ షార్ప్ షూటర్స్‌ను మోహరించారు.
ముష్కరులు డ్రోన్‌ల ద్వారా దాడులకు పాల్పడొచ్చన్న అనుమానంతో రాడార్‌తో జల్లెడపడుతున్నారు. మూడు నెలల కిందట ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ దగ్గర్లో ఇటీవల ఒక అనుమానిత డ్రోన్ కనిపించడం, నగరంలో ఆర్మీకి చెందిన మూడు వాహనాలు చోరీ అయిన నేపథ్యంలో లోపాలకు తావులేని భద్రతా ఏర్పాటు చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి అయిన ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ పర్యటన, పరేడ్ సజావుగా సాగేందుకు 49 వేల మంది భద్రతా సిబ్బందిని మొహరించారు. హోలాండ్ పర్యటనకోసం 20 వేల మందిని కేటాయించారు. కీలక ప్రాంతాల్లో వేలాది సీసీటీవీలు అమర్చారు. రాజ్‌పథ్‌పై విజయ్ చౌక్ నుంచి ఇండియాగేట్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పరేడ్ జరిగే 9.50 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 300 కి.మీ పరధి మేర నగరాన్ని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు ఆ సమయంలో పౌర విమానాలనూ గగనతలంలో ఎగరనివ్వరు. కాగా, పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో ఆ రాష్ట్రంలో అదనపు బలగాలతో భద్రత పెంచారు.
ఈ రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యేకతలు
► ఫ్రాన్స్ సేనలు రిపబ్లిక్ కవాతు చేయనున్నాయి. పరేడ్‌లో విదేశీ సేనలు పాల్గొనడం ఇదే తొలిసారి.
► 26 ఏళ్ల తర్వాత సైన్యానికి చెందిన జాగిలాలు పరేడ్‌లో పాల్గొంటున్నాయి.
► సాధారణ సమయం కంటే పరేడ్ నిర్వహణ కాలాన్ని 25 నిమిషాలు తగ్గించారు.
► {పత్యేకంగా ఒక మహిళా సీఆర్‌పీఎఫ్ దళం సైనిక విన్యాసాలు చేయనుంది.
► వీవీఐపీ ఎన్‌క్లోజర్‌పై గాజు పైకప్పును బిగించారు.