మథనం మొదలైంది
పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాల చర్చలు
పేదదేశాలకు ఆర్థిక సాయంపై కూడా
♦ చిన్న ద్వీప దేశాల అధినేతలతో ఒబామా చర్చలు
పారిస్: పర్యావరణ మార్పులపై ఐకమత్యంతో పోరాడాలని వివిధ దేశాధినేతలు చెప్పిన మరుసటి రోజే.. గ్రీన్‌హౌజ్ వాయువులకు అడ్డుకట్ట వేసేందుకు ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు చర్చలు ప్రారంభించాయి. 54 పేజీల నివేదికకు డిసెంబర్ 11న ఆమోదముద్ర వేయాల్సి ఉన్నందున.. ఇందులోని ప్రతి అంశంపై దేశాలు చర్చిస్తున్నాయి. వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా రెండు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించాలనే ఏకైక లక్ష్యంతో పర్యావరణ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న సమావేశాల్లో ఎప్పుడూ రాని ఏకాభిప్రాయం ఈసారి సాధ్యమవుతుందనే సంకేతాలు కనబడుతున్నాయి.
ఇప్పటివరకు అన్ని సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొన్న భేటీలు చాలా అరుదు. కాగా, ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో 2 డిగ్రీలను 3కు పెంచాలని విషయంపై మెజారిటీ దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే భారత్, చైనా దేశాలు ఉద్గారాన్ని తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో పేద దేశాల ఆర్థిక భారాన్ని మోసే విషయంలో ధనిక దేశాలు ఎలాంటి చొరవ తీసుకుంటాయన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. సదస్సులో ఏకాభిప్రాయం రాని పక్షంలో సౌరశక్తి ఉత్పాదన మౌలిక వసతుల విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆర్థిక భారం పెరుగుతుందని.. దీనిపై అభివృద్ధి చెందిన దేశాలు ఆలోచించి 2020 వరకు ఏడాదికి రూ.65 వేల కోట్ల చొప్పున సమకూర్చాలని ప్రధాని మోదీ కోరారు.
చిన్న ద్వీప దేశాల ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సమావేశమయ్యారు. భూతాపం ఇలాగే పెరుగుతూ పోతే.. ఈ దేశాలకు ఆర్థిక వనరులతోపాటు, మిలటరీ సేవలు కూడా అందిస్తామని ఒబామా భరోసా కల్పించారు. పర్యావరణ మార్పు విషయాన్ని అన్నిదేశాలు భుజాన వేసుకుని పరిష్కారం దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో సౌరశక్తికోసం మౌలికవసతుల కల్పనకు 2 బిలియన్ యూరోలు(రూ.14వేల కోట్లు) ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
పరస్పర సహకారంతో ముందుకెళ్దాం
బీజింగ్: ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలన్న బ్రిక్స్ దేశాల మీడియా సంస్థలు ఈ విషయాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. మంగళవారం బీజింగ్‌లో జరిగిన ఈ మీడియా సంస్థల సదస్సులో బ్రిక్స్ దేశాల (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) నుంచి వచ్చిన 25 సంస్థలు పాల్గొన్నాయి. డిజిటల్ మీడియా యుగంలో సాంప్రదాయ మీడియా మనుగడ సాధించాలంటే.. పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని స్వాగతించాలని.. ఈ దిశగా సాంకేతికతోపాటు సమాచార ప్రసారంలో పరస్పర సహకారం అందించుకోవాలని ఈ సంస్థలు నిర్ణయించాయి. చైనాలోని గ్జిన్హువా సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా భారత్ తరపున ‘ద హిందూ’ సంస్థ ఈ కార్యక్రమానికి కో స్పాన్సర్ (సహ ప్రాయోజితం) చేసింది.