![రాష్ట్రపతి ఎన్నిక విధానం ఇలా..](/styles/webp/s3/article_images/2017/09/5/71500239796_625x300.jpg.webp?itok=46yEDhq4)
రాష్ట్రపతి ఎన్నిక విధానం ఇలా..
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక బ్యాలెట్ పేపర్‌పై జరుగుతుంది. పేపర్‌పై ఓ వైపున అభ్యర్థుల పేర్లు, మరోవైపున ప్రాధాన్యతా క్రమం ఉంటాయి. ఎటువంటి ఎన్నికల గుర్తులు ఉండవు. ఓటర్లు (ప్రజా ప్రతినిధులు) తమ అభ్యర్థుల పేర్లకు ఎదురుగా ఉన్న ప్రాధాన్యత సంఖ్యలను ఎంచుకోవాలి. ఎన్నికలో ఎంతమంది అభ్యర్థులు పోటీలో ఉన్నారో అన్ని ప్రాధాన్యతలను ఓటర్లు ఇవ్వవచ్చు.
విజేతను నిర్ణయించే పద్ధతి
అభ్యర్థి గెలుపొందాలంటే మొత్తం పోలైన, చెల్లుబాటయ్యే ఓట్ల విలువలో 50 శాతం ప్లస్ 1 రావాలి. మొదట తొలి ప్రాధాన్యతా ఓట్లను లెక్కించి, అందుకు అనుగుణంగా ఆయా అభ్యర్థులు సాధించిన ఓట్ల విలువ ఎంతో చెప్తారు. ఎవరైనా 50 శాతం ప్లస్ 1 సాధించి ఉంటే వారిని విజేతగా ప్రకటిస్తారు.
తొలి ప్రాధాన్యతా ఓట్లతో విజేత ఎవరో తేలకపోతే ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగిస్తూ లెక్కింపు ను కొనసాగిస్తారు. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని పోటీ నుంచి తొలగించి, అతనికి పోలైన రెండో ప్రాధాన్యతా ఓట్లను మిగిలిన అభ్యర్థులకు సమానంగా పంచుతారు. ఇలా ఓ అభ్యర్థికి 50 శాతం ప్లస్ 1 ఓట్ల విలువ వచ్చి విజేత ఎవరో తేలేవరకు ఈ పద్ధతిని కొనసాగిస్తారు. ఒకవేళ తప్పించిన అభ్యర్థికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో రెండో ప్రాధాన్యత ఓటు లేకపోతే, దానిని తర్వాతి లెక్కింపుల్లో పరిగణలోనికి తీసుకోరు.