పోలీస్‌నంటూ బెదిరించి డబ్బు వసూలు
* మాజీ హోంగార్డుతో పాటు మరో వ్యక్తి అరెస్టు
* కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ రంగారెడ్డి
చేవెళ్ల రూరల్: పోలీసు అధికారినంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఓ మాజీ హాంగార్డుతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. సోమవారం సాయంత్రం చేవెళ్ల ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో డీఎస్పీ ఏవీ రంగారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని కందవాడ గ్రామానికి చెందిన రాయని శ్రీనివాస్ 2011లో హోంగార్డుగా ఎంపికై ఆగ్నిమాపక శాఖలో పనిచేశాడు.
ఇటీవల నగరంలోని కూకట్‌పల్లిలో ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న ఓ వ్యక్తిని అతడు బెదిరించి డబ్బులు తీసుకున్నాడు. దీంతో శ్రీనివాస్‌పై కేసు నమోదై జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
దీంతో అధికారులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి శ్రీనివాస్ చిల్లర దొంగతనాలకు పాల్పడడం ప్రారంభించాడు. కాగా, ఎక్కడా కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా, మొయినాబాద్ మండలంలోని కేతిరెడ్డిపల్లికి చెందిన చాంద్‌ఖాన్, యాదయ్యలు మండలంలోని కందవాడ సమీపంలో ఉన్న ఓ ఫాంహౌస్‌లో పెయింటింగ్ పనిచేస్తున్నారు. వీరు ఆదివారం సాయంత్రం పని ముగించుకొని ఫాంహౌస్ సమీపంలో కూర్చొని బీర్ తాగుతున్నారు. అదే సమయంలో మాజీ హోంగార్డు రాయని శ్రీనివాస్ తన గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌తో కలిసి షార్ట్‌కట్ రూట్‌లో కందవాడకు వెళ్తున్నాడు.
మద్యం తాగుతున్న చాంద్‌ఖాన్, యాదయ్యను గమనించి వారి వద్ద బైకు ఆపాడు. తన ఉన్న హోంగార్డు ఐడీకార్డుతో పాటు సెల్‌ఫోన్‌లో పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఓ ఫొటోను వారికి చూపించాడు. తాను పోలీసు అధికారిని అంటూ బెదిరించాడు. ఇలా.. బయట మద్యం తాగడం నేరం అంటూ.. వారి వద్దఉన్న రూ. 6700లను తీసుకొని పరారయ్యాడు. శ్రీనివాస్ బైక్‌పై కూడా పోలీస్ స్టిక్కర్ ఉంది. బాధితులు అదేరోజు రాత్రి చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు.
పోలీసులు నిందితుడు శ్రీనివాస్ అయి ఉండొచ్చనే అనుమానంతో అతడిని తీసుకొచ్చి బాధితులకు చూపించగా వారు గుర్తించారు. ఈమేరకు పోలీసులు డబ్బులు వసూలు చేసిన శ్రీనివాస్‌తో పాటు ఉన్న వినోద్‌కుమార్‌పై కూడా కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో ఎస్‌ఐలు రాజశేఖర్, విజయభాస్కర్ ఉన్నారు.