
ఆఫ్రికా కుబేరుల్లో మనోళ్లు ముగ్గురు
న్యూయార్క్: భారత వెలుగులు విశ్వమంతా ప్రకాశిస్తున్నాయి. ఆఫ్రికాలోని అత్యంత 50 మంది సంపన్నుల జాబితాలో ముగ్గురు భారత సంతతి వ్యక్తులు స్థానం సంపాదించారు. ప్రముఖ బిజి నెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. షేర్ల ధరలు పెరగడం, కొత్త వ్యాపార లావాదేవీల కారణంగా ఆఫ్రికాలో కుబేరుల సంఖ్య పెరుగుతోందని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. 2,080 కోట్ల డాలర్ల సంపదతో అలికో డాంగోటే ప్రథమ స్థానంలో ఉన్న ఈ జాబితాలో విమల్ షా, సుధీర్ రుపెరెలియా, నౌషాద్ మెరళి - ఈ ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది.
బిడ్‌కో ఆయిల్ రిఫైనరీస్ సీఈవో అయిన విమల్ షా(53 సంవత్సరాలు) 160 కోట్ల డాలర్లతో 18వ స్థానంలో నిలిచారు. ఈ కంపెనీ వంట నూనెలు, డిటర్జెంట్లు, సబ్బులు, బేకింగ్ పౌడర్, కనోలా తదితర ఉత్పత్తులను తయారు చేస్తోంది. 110 కోట్ల డాలర్లతో రుపెరెలియా(57) 24వ స్థానంలో ఉన్నారు. ఉగాండాలో ప్రోపర్టీ, బ్యాంకింగ్ దిగ్గజం రుపెరెలియా గ్రూప్‌కు ఆయన చైర్మన్. ఉగాం డాలో మూడో అతి పెద్ద బ్యాంక్ -క్రేన్ బ్యాంక్‌ను ఈ గ్రూప్ నిర్వహిస్తోంది. 43 కోట్ల డాలర్ల సంపదతో 48వ స్థానంలో ఉన్న మెరలి(62) సమీర్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ఈ సంస్థ నిర్మాణ, వ్యవసాయ, ఐటీ, టెలికం, ఫైనాన్స్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. భారతీ ఎయిర్‌టెల్ కెన్యా విభాగానికి ఆయన చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.