టైమ్స్ ఇంటర్నెట్‌కు ఉబెర్‌లో వాటా
వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందం - డీల్ విలువ రూ. 150 కోట్లు
న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ టెక్నాలజీస్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డిజిటల్ విభాగం టైమ్స్ ఇంటర్నెట్ స్వల్ప వాటా తీసుకుంది. వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందంలో భాగంగా ఈ డీల్ కుదుర్చుకున్నట్లు ఉబెర్ పేర్కొంది. దీని విలువ సుమారు రూ. 150 కోట్లు. బెనెట్, కోల్‌మన్ అండ్ కంపెనీకి టైమ్స్ ఇంటర్నెట్ అనుబంధ సంస్థ. భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణ కోసం టైమ్స్ ఇంటర్నెట్‌తో ఒప్పందం తోడ్పడగలదని ఉబెర్ తెలిపింది.
భారత్‌లో హైదరాబాద్ సహా 11 నగరాల్లో ఉబెర్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల కారణంగా ఆ సంస్థను భారత్‌లో డిసెంబర్‌లో నిషేధించిన సంగతి తెలిసిందే. కంపెనీ జనవరిలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో టైమ్స్ ఇంటర్నెట్‌తో ఉబెర్ వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలో బైదు, లాటిన్ అమెరికాలో అమెరికామొవిల్, అమెరికాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలతో ఉబెర్‌కి ఈ తరహా ఒప్పందాలు ఉన్నాయి. మరోవైపు, టైమ్స్ ఇప్పటిదాకా హఫింగ్‌టన్ పోస్ట్, బిజినెస్ ఇన్‌సైడర్, గాకర్ మీడియా, జిఫ్ డేవిస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో టైఅప్ పెట్టుకుంది.