Uber Technologies Inc
-
ఉబెర్‌కు భారీ నష్టాలు
క్యాబ్ సేవల సంస్థ ఉబెర్‌కు ఈ క్వార్టర్లో భారీ షాక్ తగిలింది. 2017లో పరిమిత ఆర్థిక డేటాను వెల్లడించడం ప్రారంభించిన అనంతరం ఉబెర్ టెక్నాలజీస్ ఇంక్ అతిపెద్ద త్రైమాసిక రికార్డు నష్టాన్ని చవిచూసింది. ఉబర్ సేల్స్ భారీగా క్షీణించడంతో 5.2 బిలియన్ డాలర్లు (రూ.520 కోట్లు) నష్టపోయినట్టు ఉబర్ ఇంక్ ఒక ప్రకటనలో నివేదించింది. ఆదాయం 14శాతం పెరిగి 3.17 బిలియన్లుగా ఉంది. అయితే ఎనలిస్టులు ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టాలను ప్రకటించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఐపీవో సందర్భంగా స్టాక్ ఆధారిత కంపెన్సేషన్ కారణంగా ఇంత భారీ నష్టం వాటిల్లిందని వాల్‌స్ట్రీట్ అనలిస్టులు అంచనా. ఈ ఫలితాల నేపథ్యంలో ఉబెర్ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ త్రైమాసికంలో ఉబెర్ ఖర్చులు 147శాతం పెరిగి 8.65 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రధాన ప్రత్యర్థి లిఫ్ట్‌తో పోటీ నేపథ్యంలో పరిశోధన, అభివృద్ధిపై వెచ్చించిన ఖర్చు గణనీయంగా పెరిగింది. ప్రయాణికుల ట్రిప్ 20 శాతం పెరగగా, ఉబెర్ తన డ్రైవర్లకు చెల్లించిన తర్వాత ఉంచిన మొత్తం కేవలం 4 శాతం మాత్రమే పెరిగింది. కంపెనీలు చారిత్రాత్మకంగా రైడర్లను ఆకర్షించడానికి సబ్సిడీపై ఆధారపడ్డాయి. స్థూల బుకింగ్‌లు15.76 బిలియన్లు (సంవత్సరానికి 37శాతం పెరిగింది)గా ఉన్నాయి. ఫుడ్ డెలివరీ ఉబెర్ ఈట్స్ ఆదాయం 72 శాతం పెరిగి 595 మిలియన్ డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఉబెర్ ప్రత్యర్థి లిఫ్ట్ బుధవారం ప్రకటించిన ఫలితాల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఆదాయ గణాంకాలను నమోదు చేసింది. ప్రధానంగా రైడింగ్ సేవల వ్యాపారంలో వృద్ధి మందగించడంతో తీవ్ర నష్టాలను చవి చూసింది. దీంతో ఉబర్ వాటాలను 6 శాతం వరకు తగ్గించింది. ఆదాయ వృద్ధి మందగించడం ఉబెర్ పోటీని విస్తరించి నిరోధించే సామర్థ్యాన్ని కోల్పోవడం నష్టాలకు దారితీసినట్టు ఆర్థిక మార్కెట్ విశ్లేషకుడు హరిస్ అన్వర్ తెలిపారు. అయితే పెట్టుబడుల దూకుడు కొనసాగిస్తామనీ, అది కూడా ఆరోగ్యకరమైన వృద్ధిగా ఉండాలని కోరకుంటున్నామని ఉబెర్ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. అంతేకాదు ఈ త్రైమాసికంలో ఆ దిశగా మంచి పురోగతి సాధించామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెల్సన్ చాయ్ అన్నారు. 2020, 2021 సంవత్సరాల్లో పెట్టుబడులు గరిష్టంగా ఉండనున్నాయని, దీంతో నష్టాలు తగ్గుతాయని భావిస్తున్నామని ఉబెర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్, దారా ఖోస్రోషాహి చెప్పారు. -
గాల్లో ఎగిరే కార్లు!
ఇక ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకోవాల్సిన పని లేదు. దిల్షుక్నగర్ నుంచి హైటెక్ సిటీకి కేవలం పది నిముషాల్లోనే చేరుకోవచ్చు. ఎంచక్కా గాల్లోనే హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోవచ్చు. అవును ఇకపై ఉబర్ క్యాబ్‌లలో ఉబర్ పూల్, ఉబర్ గో మాత్రమే కాదు ఉబర్ ఎయిర్ ఆప్షన్ కూడా రాబోతోంది. అమెరికాలోని దల్లాస్, లాస్ ఏంజెల్స్‌లో ఎగిరే కార్లను నడుపుతామని గత ఏడాది ప్రకటించిన ఉబర్ సంస్థ ఇప్పుడు మరో నగరంలోనూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి అయిదు దేశాలతో షార్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది. అందులో భారత్‌కు కూడా చోటు దక్కింది. జపాన్‌లోని టోక్యోలో జరిగిన ఉబర్ ఎలివేట్ ఆసియా ఫసిఫిక్ సదస్సులో ఉబర్ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. భారత్‌తో పాటు జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బ్రెజిల్ దేశాలను ఎంపిక చేసింది. ఈ దేశాల్లోని వివిధ నగరాల్లో మార్కెట్, కొత్త తరహా రవాణా విధానాన్ని వాడడానికి ప్రజలు కనబరిచే ఉత్సాహం, ఇతర పరిస్థితుల్ని అంచనా వేశాక ఎగిరే కార్లను నడిపే మూడో నగరాన్ని ఎంపిక చేస్తుంది. 10 లక్షల జనాభాకు మించి ఉన్న మెట్రోపాలిటన్ నగరంలోనే ఈ సేవలను తీసుకురావాలని భావిస్తోంది. ఆయా నగరాల్లో స్థానిక అధికారులు, రాజకీయ నేతలు, ప్రజలతో మమేకమయ్యే సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి మరో ఆరు నెలల్లో మూడో నగరాన్ని ప్రకటిస్తామని ఉబర్ వెల్లడించింది. 2020 నాటికల్లా ప్రయోగాత్మకంగా ఈ కార్లను నడిపి చూసి, 2023 నాటికి పూర్తి స్థాయిలో ఎగిరే కార్ల సర్వీసుని అందుబాటులోకి తీసుకురానుంది. ‘భారత్‌లో ముంబై, ఢిల్లీ, బెంగుళూరు ఏ సమయంలో చూసినా ట్రాఫిక్‌తో కిటకిటలాడిపోతూ ఉంటాయి. ఒకట్రెండు కిలో మీటర్ల దూరానికి గంట పట్టేస్తుంది. ఇకపై ఆ బాదరాబందీ ఉండదు. ఎగిరే కార్లను తీసుకువస్తే ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది‘ అని ఉబర్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఉబర్ ఎలివేట్ ప్రత్యేకతలు గాల్లో ఎగిరే కార్ల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కోసం ఉబర్ సంస్థ ఇప్పటికే ఎన్నో సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో కలిసి ఉబర్ ఎలివేట్ అనే ప్రాజెక్టుని ప్రారంభించింది. బోయింగ్, బెల్ హెలికాప్టర్ వంటి డజనుకు పైగా సంస్థలు పెద్ద సంఖ్యలో ఎగిరే కార్లను తయారు చేయడానికి ముందుకు వచ్చాయి. వేలకోట్ల డాలర్ల పెట్టుబడిని పెడుతున్నాయి. ఈ ఎగిరే కార్లకు చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ కార్లు పూర్తిగా విద్యుత్ మీదే నడుస్తాయి పెద్ద పెద్ద భవంతులపై కూడా సులభంగా వాలిపోగలవు టేకాఫ్, ల్యాండింగ్ నిలువుగా చేస్తాయి (వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఠ్టిౌ∙ఎయిర్‌క్రాఫ్ట్) వెయ్యి నుంచి 2 వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి. 15 నుంచి 100 కి.మీ. దూరం ప్రయాణించేలా కార్ల తయారీ గంటకి గరిష్ట వేగం 300 కి.మీ 20 కి.మీ దూరాన్ని కేవలం 10 నిముషాల్లోనే చేరుకోగలవు ఒకేసారి వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం పైలెట్ కాకుండా నలుగురు ప్రయాణికులు కూర్చొనేలా కార్ల డిజైన్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ కార్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సగటున రోజుకి రెండు గంటల సమయం ఆదా అవుతుందనే అంచనాలున్నాయి. -
అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను
లండన్ : తమ సర్వీసులను పొందుతున్న ప్రపంచ వినియోగ దారులకు ఉబర్ సీఈవో దారా ఖోస్రోవ్షాహి క్షమాపణలు తెలియజేశారు. మున్ముందు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని, తమను తాము చక్కదిద్దుకుంటామని హామీ ఇచ్చారు. లండన్‌లో ఉబర్ తన లైసెన్స్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ లైసెన్స్ రద్దు చేస్తున్న సందర్భంగా పలు విషయాలను లండన్ లైసెన్స్ రెగ్యులారిటీ సంస్థ లేవనెత్తింది. ప్రయాణీకుల సమస్యలు పట్టించుకోలేదని, తాము సూచించిన నిబంధనలు పట్టించుకోలేదని, ప్రయాణీకుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ పలు విధాలుగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే ఉబర్ సర్వీసులు లండన్‌లో నిలిచిపోనున్నాయి. ఈ సందర్భంగా ప్రస్తుతం లైసెన్స్ పునరుద్ధరణ కోసం ఉబర్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సీఈవో దారా ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో 'ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లో ప్రజలకు ఉద్యమస్థాయిలో సేవలు అందించాం. అదే స్థాయిలో ఎన్నో పొరపాట్లు మావల్ల జరిగాయి. ఇది ముమ్మాటికి నిజం. ఈ సందర్భంగా ప్రతి ఉబర్ వినియోగదారుడికి జరిగిన పొరపాట్లకు క్షమాపణలు చెబుతున్నాను' అంటూ పేర్కొన్నారు. -
ఉబర్ సీఈవోగా ఆయన ఇక రారు..
ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ ప్రపంచానికి తెగ ప్రాచుర్యం. రైండింగ్ సర్వీసుల్లో ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందిన ఆ కంపెనీ సంక్షేమం కోసం, ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి, తాత్కాలికంగా కంపెనీ సీఈవో నుంచి తప్పుకోనున్నట్టు ట్రావిస్ కలానిక్ రెండు నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు సద్దుమణిగాక, ఆయన మళ్లీ తిరిగి కంపెనీ కీలక వ్యక్తిగా వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన తిరిగి ఉబర్ సీఈవోగా తన పదవిలోకి రారట. ఉబర్ సీఈవోగా ట్రావిస్ కలానిక్ మళ్లీ తన పదవిలోకి రారని కంపెనీకి చెందిన కీలక బోర్డు సభ్యుడు చెప్పారు. ఈ వారం ఉబర్ ఉద్యోగులకు రాసిన ఈమెయిల్‌ను రీకోడ్ లీక్ చేసింది. దీనిలో కలానిక్ తిరిగి సీఈవోగా వెనక్కి రారని ఉద్యోగులకు ఉబర్ సహవ్యవస్థాపకుడు గారెట్ క్యాంప్ చెప్పినట్టు వెల్లడైంది. ట్యాక్సీ సర్వీసుల అగ్రగామిని లీడ్ చేయడానికి ప్రముఖ వరల్డ్ క్లాస్ సీఈవోను నియమించనున్నట్టు తెలిపినట్టు తెలిసింది. క్యాంప్ ప్రకటనను బెంచ్‌మార్కు క్యాపిటల్ కూడా ట్వీట్ చేసింది. ఉబర్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన బెంచ్ మార్కు కంపెనీ నిర్ణయాలకు అంకితభావంతో ఉన్నామని, కొత్త సీఈవో కోసం అన్వేసిస్తున్నామని తన ట్వీట్లో పేర్కొంది. సీఈవోగా పదవిలో నుంచి దిగిపోయినప్పటికీ, కలానిక్ ఉబర్ బోర్డు సభ్యుడిగా ఉంటున్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే క్యాంప్ మెమో, బెంచ్‌మార్కు ప్రకటన వచ్చి ఉంటుందని రిపోర్టులు వెలువడ్డాయి. 1990లో స్టీల్ జాబ్స్ ఆపిల్ సీఈవోగా ఎలా వెనక్కి తిరిగి వచ్చారో అదేమాదిరి ఉబర్ సీఈవోగా మళ్లీ ట్రావిస్ కలానిక్ తన పదవి చేపడతారని రీకోడ్ గతవారం రిపోర్టు చేసింది. కానీ ఈ రిపోర్టుకు భిన్నంగా తాజా రిపోర్టును వెలువరించింది. లైంగిక వేధింపులు, లింగవివక్ష, పని ప్రదేశంలో సమస్యలు వంటి కారణాలతో సీఈవోగా ట్రావిస్ కలానిక్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
విషాదంలో ఉబర్ సీఈఓ
కాలిఫోర్నియా: ట్యాక్సీ సర్వీసుల సంస్థ ఉబెర్ సీఈవో ట్రావిస్ కలా నిక్ తల్లి బోనీ కలానిక్ (71) బోటు ప్రమాదంలో మరణించారు. తండ్రి డొనాల్డ్ కలానిక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరు కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని పైన్ఫ్లాట్ సరస్సులో విహరిస్తుండగా ప్రమాదం జరిగింది. వారి బోటు ఓ పెద్ద బండరాయిని ఢీకొని మునిగిపోయినట్టు పోలీసులు చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డొనాల్డ్ కలానిక్ స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై నగర షెరిఫ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ ట్రావిస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ట్రావిస్ కుప్పకూలిపోయారు. -
ఉబర్ కు కోలుకోలేని దెబ్బ: ప్రెసిడెంట్ గుడ్ బై
శాన్ఫ్రాన్సిస్కో : దేశ, విదేశాల్లో పాపులర్ అయిన క్యాబ్ సర్వీసుల సంస్థ ఉబర్ మరింత సంక్షోభంలోకి కూరుకుపోతుంది. కంపెనీ ప్రెసిడెంట్ గా ఉన్న జెఫ్ జోన్స్ ఉబర్ నుంచి వైదొలుగుతున్నట్టు ఈ శాన్ ఫ్రాన్సిస్కో సంస్థ వెల్లడించింది. కంపెనీలో జాయిన్ అయిన ఆరు నెలల కంటే తక్కువ వ్యవధిలోనే ఆయన కంపెనీని వీడనున్నట్టు కంపెనీ అధికారిక ప్రతినిధి ఆదివారం పేర్కొన్నారు. అయితే ఏ కారణం చేత ఆయన కంపెనీ వీడుతున్నారో అధికార ప్రతినిధి వెల్లడించలేదు. జోన్స్ నిష్క్రమణ తర్వాత ఆయన బాధ్యతలు ప్రశ్నార్థకంలో పడనున్నాయని కంపెనీ అధికారులంటున్నారు. టార్గెట్ కార్పొరేషన్ లో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ గా ఉన్న జోన్స్ ఆగస్టులోనే ఉబర్ లో ప్రెసిడెంట్ గా జాయిన్ అయ్యారు. ప్రెసిడెంట్ గా పనిచేస్తూనే కొన్ని సీఓఓ బాధ్యతలను ఆయన నిర్వహిస్తున్నారు. ఆరు నెలల పాటు కంపెనీకి జోన్స్ అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపిన అధికార ప్రతినిధి, ఆయనకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. లైంగిక వేధింపులతో గత నెలే కంపెనీ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ అమిత్ సింగల్ కూడా రాజీనామాను కోరారు. ఈ నెల మొదట్లో ప్రొడక్ట్, గ్రోత్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఈద్ బేకర్, సెక్యురిటీ రీసెర్చర్ చార్లీ మిల్లెర్ కంపెనీ నుంచి వైదొలిగారు. -
‘ఉబర్ సీఈవో కంటతడి.. ఆ మహిళకు సారీ’
న్యూయార్క్: ఉబర్ సీఈవో కంటతడి పెట్టారు. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జరిగిన అవమానంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, క్షమాపణలు చెబుతూ కాసేపు ఏడ్చేశారు. తన కంపెనీలో ఇలాంటి సంస్కృతికి అవకాశం ఏర్పడటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా మొత్తం కంపెనీ కీలక ఉద్యోగులు, కిందిస్థాయి ఉద్యోగులు మీడియా కొలువై ఉన్న బహిరంగ కార్యక్రమంలో. ఉబర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా చేస్తున్న సుసాన్ పోలర్ అనే మహిళ తనపై లైంగిక వేధింపులు జరిగాయని, మానవ వనరుల విభాగం నుంచి ఈ వేధింపులు మొదలయ్యాయని, ఇలా ఏడాదికాలం జరిగినా తనకు ఏమాత్రం అండగా ఉండకుండా వేధింపులకు పాల్పడినా ఆ మేనేజర్‌ను రక్షించుకునే ప్రయత్నం చేసిందని గతవారం తన బ్లాగ్‌లో పేర్కొంది. మంగళవారం కంపెనీ ఉద్యోగులతో శాన్ఫ్రాన్సిస్కోలో సమావేశం అయిని ఉబర్ సీఈవో ట్రావిస్ కలానిక్ తన కంపెనీలో తలెత్తిన కల్చరల్ పెయిలింగ్స్కు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో ఉబర్ సీఈవో కంటతడి పెట్టారు. ఫిర్యాదులను లెక్కచేయకుండా హెచ్ఆర్ వ్యవహరించడంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పనిచేసే చోట వివక్షకు తావివ్వడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘ట్రావిస్ చాలా నిజాయితీగా ఆయన కంపెనీ చేసిన పొరపాట్ల గురించి మాట్లాడారు. 48గంటల్లోగా తన కంపెనీని మరింత ఉన్నతంగా మార్చేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేవలం ఉబర్‌ను మంచిసంస్థగా తీర్చిదిద్దడమే కాదు.. మొత్తం ఉబర్ కంపెనీలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ఇబ్బందులు కలిగించని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం సమయం వృధా అనే ఆలోచనే రానివ్వకూడదు’ అని ట్రావిస్ చెప్పినట్లు ఆ కంపెనీ హెచ్ఆర్ హఫింగ్టన్ తెలిపారు. -
ట్రంప్‌కు షాకిచ్చిన ఉబర్ సీఈఓ
-
ట్రంప్‌కు షాకిచ్చిన ఉబర్ సీఈవో
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉబర్ టెక్నాలజీస్ సీఈవో ట్రావిస్ కలానిక్ షాకిచ్చారు. ట్రంప్ బిజినెస్ అడ్వయిజరీ గ్రూప్ నుంచి ఉబర్ సీఈవో వైదొలిగారు. ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలతోపాటు, ఆయనకు మద్దతిస్తున్న సీఈవోలపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ట్రావిస్ కలానిక్, డొనాల్డ్ ట్రంప్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు గురువారం ప్రకటించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు, కార్యకర్తలు ట్రంప్ వ్యాపార అడ్వయిజరీ గ్రూప్ నుంచి బయటికి వచ్చేయాలని ఉబర్ సీఈవోపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఉబర్ డ్రైవర్లలో చాలామంది వలసవాదులే ఉండటం గమనార్హం. ఏడు ముస్లిం దేశాల పౌరులను, వలసవాదులను తాత్కాలికంగా అమెరికాలోకి రాకుండా నిషేధిస్తూ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ ఆర్డర్లు పాస్ చేసిన సంగతి తెలిసిందే. ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడంపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్ ఆర్డర్లను వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్నాయి. '' అడ్వయిజరీ గ్రూప్‌లో చేరడం ప్రెసిడెంట్‌ను ఎండోర్స్మెంట్ తీసుకోవడం లేదా ఆయన అజెండాలను ఫాలోవ్వడమని కాదు. దురదృష్టవశాత్తు మమల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు'' అని కలానిక్ పేర్కొన్నారు. ఉబర్ సీఈవో ట్రంప్ గ్రూప్ నుంచి వైదొలిగినట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెల్సియా కోల్హర్ ధృవీకరించారు. ట్రంప్ అడ్వయిజరీ గ్రూప్‌లో ఉన్న ఉబర్‌పై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఉబర్ అకౌంట్లను డిలీట్ చేసి, దాని ప్రత్యర్థి లిఫ్ట్ ఇంక్‌లో చేరమని వాదనలు వినిపించాయి. అకౌంట్ డిలీట్ చేసిన వారు, ఉబర్‌కు ఈమెయిల్స్ సైతం పంపారు. బ్యాన్ నేపథ్యంలో ప్రభావితమయ్యే వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎకానమిక్ పాలసీలో కూడా తాను చేరనని ఉబర్ సీఈవో ప్రెసిడెంట్‌కు స్పష్టంచేశారు. ట్రంప్ ఆర్డర్లకు వ్యతిరేకంగా ఇప్పటికే సిలికాన్ వ్యాలీ సైతం విమర్శల గళం వినిపిస్తోంది. మైక్రోసాప్ట్, గూగుల్, యాపిల్ ఇంక్, అమెజాన్లు ట్రంప్ ఆర్డర్లను వ్యతిరేకిస్తున్నాయి. -
ఏడాదిలో 20,000 డ్రైవర్లకు రుణం
♦ ముందుకొచ్చిన టాటా గ్రూప్ ♦ ఉబర్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్ టెక్నాలజీస్ తాజాగా టాటా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉబర్ ప్లాట్‌ఫాంపై పనిచేసేందుకు ముందుకొచ్చిన డ్రైవర్ పార్టనర్లకు టాటా మోటార్స్‌కు చెందిన కార్ల కొనుగోలుకు సులభ వాయిదాల్లో రుణం ఇస్తారు. టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా మోటార్స్ ఫైనాన్స్‌లు ఈ రుణం అందిస్తాయి. ఇతర సంస్థలతో పోలిస్తే వడ్డీ రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. అందుబాటు ధరలో టాటా ఏఐజీ బీమా కల్పించనుంది. ఏడాదిలో 20,000 మందికిపైగా ఔత్సాహికులకు రుణం ఇవ్వాలని టాటా గ్రూప్ భావిస్తోంది. హైదరాబాద్‌లో తొలుత ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నట్టు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మధు కన్నన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 27 నగరాల్లో ఉబర్ సేవలందిస్తోంది. డిసెంబరు నాటికి మరో 23 నగరాల్లో అడుగుపెడతామని ఉబర్ ఆసియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ పేర్కొన్నారు. సొంత పేమెంట్ వాలెట్ తీసుకొచ్చే విషయంలో కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. ఆకట్టుకోవడానికే ప్రోత్సాహకాలు.. డ్రైవర్ పార్టనర్లను ఆకట్టుకోవడానికే నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు ఎరిక్ అలెగ్జాండర్ వెల్లడించారు. ‘కొత్తగా ఏదైనా నగరంలో ప్రవేశించినపుడు ప్రోత్సాహకాలు అందిస్తాం. ఎక్కువ ట్రిప్పులు చేసిన వారికి అదనపు ఆదాయం వస్తుంది. డబ్బులు వస్తేనే ఈ వ్యాపారం సాగుతుంది. డ్రైవర్లు నెట్‌వర్క్‌లోకి వస్తారు. డ్రైవర్ పార్టనర్లకు ఆదాయావకాశాల కల్పన మా విధి. సరఫరా-డిమాండ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడే సర్జ్ ప్రైసింగ్ ఉంటుంది. ఆ సమయంలో డిమాండ్ ఉంటుంది కాబట్టి అధిక ఆదాయం కోసం డ్రైవర్లు లాగిన్ అవుతారు. సర్జ్ ధర నిర్ణయం మానవ ప్రమేయం లేకుండా అంతా సాంకేతికంగా జరుగుతుంది’ అని వివరించారు. వ్యాపారం నిలదొక్కుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని తెలిపారు. -
ఉబర్ ప్రత్యర్థి దిదిలో యాపిల్ పెట్టుబడులు
బీజింగ్ : ఉబర్ కు ప్రధాన ప్రత్యర్థిగా... చైనాలో రెండో అతిపెద్ద రవాణా సర్వీసులను అందిస్తున్న దిది చుక్సింగ్ లో యాపిల్ ఇంక్ వంద కోట్ల డాలర్లు (ఒక బిలియన్ డాలర్లు) పెట్టుబడులు పెట్టింది. అతి క్లిష్టంగా ఉండే చైనీస్ మార్కెట్ ను అర్థం చేసుకోవడానికి ఈ కంపెనీకి సాయం అందజేస్తున్నామని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు. చైనాలో ఐఫోన్ వ్యాపారాలకు గండిపడిన నేపథ్యంలో దూసుకుపోతున్న షేరింగ్, కారు టెక్నాలజీలో తన వాటాను పెంచుకోవడానికి టెక్నాలజీ దిగ్గజం ఈ పెట్టుబడులు పెట్టింది. యాపిల్ మళ్లీ తన ఐఫోన్ అమ్మకాలను చైనాలో పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే కుక్ ఈ నెలలో చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఉబర్ కు ప్రత్యర్థి అయిన దిదిలో పెట్టుబడులు పెట్టడం, ఆటోమేకర్స్, టెక్నాలజీ కంపెనీల పెట్టుబడుల్లో కొత్త ఒరవడి సృష్టిస్తుందని తెలుస్తోంది. భవిష్యత్తులో దిది రవాణా నెట్ వర్క్, యాపిల్ రెండూ కలిసి పనిచేయడానికి అవకాశాలను చూస్తున్నామని కుక్ తెలిపారు. దిదిలో పెట్టుబడులు పెట్టడానికి చాలా కారణాలున్నాయని, చైనా మార్కెట్ గురించి లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యామని చెప్పారు. తాము పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనే ఇస్తాయని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ డీల్ తో చైనీస్ ప్రభుత్వంతో మంచి సంబంధాలు ఏర్పడతాయనే ఆశాభావం కుక్ వ్యక్తంచేశారు. యాపిల్ తమ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం తమకు కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని దిది చుక్సింగ్ సీఈవో, వ్యవస్థాపకుడు చెంగ్ వీ తెలిపారు. బస్ లకు, ప్రైవేట్ కార్లకు బుకింగ్ లు, టాక్సీలను అద్దెకు ఇవ్వడం, రైడ్ షేరింగ్, డ్రైవింగ్ టెస్ట్ లకు కార్లను ఇవ్వడం వంటి సేవలను దిది చుక్సింగ్ అందిస్తోంది. ఒక్క రోజులో 110 లక్షల రైడ్ లను కంపెనీ జరుపుతుంటోంది. 400 చైనీస్ నగరాల్లో 3000లక్షల మంది యూజర్లు దీని సేవలను పొందుతున్నారు. ప్రైవేట్ కారు మార్కెట్ లో 87శాతం, టాక్సీలను అద్దెకు ఇవ్వడం 99శాతం షేరును ఈ కంపెనీ కలిగి ఉంది. అయితే చైనాలో ఆధిపత్య స్థానంలో ఉన్న దిది గత కొంతకాలంగా కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. గతవారమే దిది రవాణా నెట్ వర్క్ కు చెందిన ఒక డ్రైవర్ ను, దోపిడి చేసి మహిళా ప్యాసెంజర్ ను హత్య చేసిండనే నేపథ్యంలో అరెస్టు చేశారు. గత ఆరు నెలల్లో ఇద్దరు దిది డ్రైవర్స్ అత్యాచారం, దొంగతనం కేసులో దోషులుగా గుర్తించబడ్డారు. -
‘యాప్’రే.. ట్యాక్సీ!!
► సర్జ్ పేరిట రెండు రెట్లకుపైగా చార్జీల బాదుడు.. ► ఏ సమయంలో బుక్ చేసినా ఇదే తీరు ► ఓలా, ఉబెర్ కస్టమర్లకు చార్జీల చుక్కలు ► అలవాటు చేసి బాదేస్తున్నారంటున్న కస్టమర్లు ► నియంత్రణ లేకపోవటం వల్లేనని విమర్శలు హైదరాబాద్, బిజినెస్ బ్యూర : ఆటోలో ఎక్కడికైనా వెళ్లాలంటే మీటరుంటుంది!!. మీటరుపై రానన్నా... అంతకన్నా ఎక్కువ అడిగినా పక్కన పోలీసులుంటారు!!. ఇవేవీ కాదనుకుంటే... జనం నేరుగా ఆటో డ్రైవరుతోనే బేరమాడతారు. ఇరువురికీ ఆమోదయోగ ్యమైతేనే సవారీ!. మరి ట్యాక్సీల సంగతే తీసుకోండి. మొదటిది మీరు డ్రైవర్లతో నేరుగా బేరమాడలేరు. ఎందుకంటే వాటికి ఓలా, ఉబెర్ లాంటి టెక్నాలజీ మధ్యవర్తులుంటారు. ఇక రెండోది ఈ ట్యాక్సీలకు మీటర్లుండవు. పోనీ... కిలోమీటరుకు 10 రూపాయలనో, 15 అనో వాటికవే ప్రకటించుకునే చార్జీల్నే మీటరుగా భావించినా... వాటిని అవి ఫాలో కావు. మామూలుగా అయితే కి.మీ.కి 10 రూపాయలే. కానీ ఇపుడు పీక్‌టైమ్ కదా... ‘2.2’ సర్జ్ అని ముందే చెప్పేస్తాయి. అంటే రూ.100 చెల్లించాల్సిన చోట 220 చెల్లించాలన్న మాట. పోనీ ఈ రేటైనా శాశ్వతంగా ఉంటుందా అంటే... లేదు. అది ఒకోసారి 180 కావచ్చు... మరోసారి 250 కావచ్చు. ఇంకా చెప్పాలంటే... సమయాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా... ఎంతైనా కావచ్చు. దీన్నేమనాలి? టెక్నాలజీ కంపెనీల దందా అనొద్దా? బహుళజాతి కంపెనీల్ని జాగ్రత్తగా గమనిస్తే వాటి వ్యూహం అర్థమవుతుంది. మొదట భారీగా డబ్బు వెదజల్లి డిస్కౌంట్లు, ఆఫర్లతో అందరినీ ఆకట్టుకోవటం. అందరినీ తమ ఉత్పత్తి వాడేలా చేసి... తమ డబ్బుతో పోటీదారుల్ని కోలుకోలేకుండా దెబ్బతీయటం. తమ ఉత్పత్తి అందరికీ అలవాటయ్యాక... పోటీ లేదని తెలిశాక భారీ వడ్డింపులతో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించటం. ఇప్పుడు ట్యాక్సీల విషయంలోనూ జరుగుతున్నదిదే. ఏ సమయమైనా బాదుడే... హైదరాబాదే కాదు. దేశంలో యాప్‌ల ద్వారా ట్యాక్సీ సేవలందుకుంటున్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రయాణికులకిపుడు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒక్క క్లిక్‌తో కస్టమర్ల ముందు ట్యాక్సీని నిలబెట్టడం అలవాటు చేసిన అగ్రిగేటర్ల వ్యాపార స్వరూపం బయటపడుతోంది. ‘సర్జ్ ప్రైసింగ్’ పేరుతో విపరీతంగా చార్జీలు బాదుతుండటంతో ప్రయాణికులకు ఎటూ పాలుపోవటం లేదు. సర్జ్ అంటే... సాధారణ చార్జీకన్నా అధిక మొత్తం వసూలు చేయటమే. ఉదాహరణకు బుకింగ్ సమయంలో చార్జీ 2గీ అని ఉంటే కస్టమర్‌కు అయ్యే ఖర్చు రెండు రెట్లు అవుతుందన్న మాట. డిమాండ్ సమయంలో డ్రైవర్లను ఆకట్టుకోవడానికే సర్ ్జ ప్రైసింగ్ అని ట్యాక్సీ అగ్రిగేటర్లు ఉబెర్, ఓలా చెబుతున్నాయి. ‘‘సర్జ్ వల్ల ఎక్కువ డబ్బులొస్తాయి కనక మా నెట్‌వర్క్‌లోకి డ్రైవర్లు ఎక్కువ మంది వస్తారు. దాంతో కస్టమర్లకు ఎక్కువ వాహనాలు అందుబాటులో ఉంటాయి. మా సేవల పట్ల వినియోగదార్లకు నమ్మకం ఏర్పడుతుంది’’ అని ఓలా అధికారి ఒకరు చెప్పారు. అయితే డిమాండ్ లేని సమయంలోనూ సర్జ్ పేరుతో చార్జీలు బాదేస్తున్న సంఘటనలు అనేకం. నిజానికి ఈ మధ్య హైదరాబాద్‌లో ఏ సమయంలోనైనా సర్జ్ ప్రైసింగ్‌కు తప్ప మామూలు ధరకు ట్యాక్సీలు దొరకటం లేదంటే అతిశయోక్తి కాదు. డ్రైవర్లు తక్కువ కావటం, కస్టమర్లు ఎక్కువ కావటం వల్ల ఈ పరిస్థితి ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్, బస్ ఆపరేటర్ల సంఘం ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘అగ్రిగేటర్లు ప్రోత్సాహకాలు తగ్గించాయి. దీంతో డ్రైవర్లు వాటికి దూరమవుతున్నారు. ట్యాక్సీలు తగ్గి, డిమాండ్ పెరగటంతో కస్టమర్లు సర్జ్ ప్రైసింగ్ బారిన పడుతున్నారు. డిమాండ్ లేకున్నా ఎక్కువ చార్జీ చేస్తున్న సందర్భాలు మా దృష్టికి వచ్చాయి’’ అని ఆయన వివరించారు. చూడ్డానికి ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉన్నా, వాస్తవానికి డ్రైవర్లకు రావడం లేదన్నారు. కూపన్ కోడ్ ఉందా.. టెక్నాలజీతో అంతిమంగా గెలిచేది దాన్ని సమర్థంగా వినియోగించుకున్నవారు. ఆగ్రిగేటర్లదీ అదే తీరు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇవి ఉచిత కూపన్లు ఆఫర్ చేస్తున్నాయి. మీరు గనక ట్యాక్సీ తరచు బుక్ చేస్తున్నవారై... వరసగా కొన్నాళ్ల పాటు బుక్ చేయకుంటే వాటికి బెంగ పట్టుకుంటుంది. అందుకే మీకు రూ.100 తగ్గింపు, 20 శాతం డిస్కౌంట్ అంటూ కూపన్లు పంపిస్తాయి. మీ దగ్గర కూపన్ ఉన్న విషయం వాటికెలాగూ తెలుసు. ఇక మీరు ట్యాక్సీ బుక్ చేయాలని భావిస్తే... తప్పనిసరిగా సర్జ్ బారిన పడాల్సి వస్తుంది. సాధారణ చార్జీకి వాహనం దొరకటం దాదాపు అసాధ్యమే. చివరికి అసహనం పెరిగి... ఎలాగూ కూపన్ ఉందిగా, కొంత ఎక్కువైతే ఏంటి? అనే ధోరణిలో బుక్ చేయటం మీ వంతవుతుంది. ఒకవేళ మీరు మీ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకుని... ఒకరోజు ముందో, రెండ్రోజుల ముందో బుక్ చేసుకోవాలని భావించినా... ఆ సమయంలో అన్ని స్లాట్లూ బుక్ అయిపోయాయని, ప్రయాణానికి ముందు అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలని సలహా వస్తుంది. అదీ కథ. ఇటీవల ఓ కస్టమరు ఓలా మినీలో 17 కి.మీ. ప్రయాణిస్తే బిల్లు రూ.294 వచ్చింది. అదే కస్టమర్ గత ఆదివారం మధ్యాహ్నం 21 కి.మీ. ప్రయాణిస్తే రూ.438 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్కన కిలోమీటరుకు సుమారు రూ.21 చార్జీ అయిందన్నమాట. కాగా, ఓలా ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు సహా పలువురి నుంచి రూ.8,700 కోట్లు సమీకరించింది. భారత్‌లో వచ్చే 9 నెలల్లో రూ.6,600 కోట్లు ఖర్చు చేయనున్నట్టు 2015 జూలైలో ఉబెర్ ప్రకటించింది. కస్టమర్ చెల్లించిన చార్జీల్లో ఉబెర్ 20%, ఓలా 15% తమ కమీషన్‌గా తీసుకుంటున్నాయి. మిగతా వాహనాలకు పీక్ కాదా? ఆటోల విషయమే తీసుకుంటే... అన్నిచోట్లా గట్టి నియంత్రణలున్నాయి. పీక్ టైమ్ అయినా, ట్రాఫిక్ బాగా ఎక్కువున్నా... ఎప్పుడైనా మీటర్‌పై వెళ్లాల్సిందే. మామూలుగా ట్యాక్సీని బుక్ చేసుకున్నా పీక్ టైమ్ అని, రద్దీ ఎక్కువుందని అధిక చార్జీలు వసూలు చేయరు. కానీ యాప్‌ల ద్వారా బుక్ చేస్తే మాత్రం సర్జ్ అంటూ వాత పెడుతుండటాన్ని పలువురు తప్పుబట్టారు. ‘‘నిజానికి కిలోమీటర్ల చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు కనక తూనికలు, కొలతల శాఖ అనుమతించిన మీటర్లను వాడాలి. కానీ దేశంలో ఏ ఒక్క ట్యాక్సీకీ మీటర్ లేదు. ప్రయాణ దూరాన్ని కొలిచేందుకు ఆగ్రిగేటర్లు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. యాప్‌ల ద్వారా ట్యాక్సీల నిర్వహణకు నిబంధనలు రావాల్సిన అవసరం ఉంది’’ అని ఓ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు. నిబంధనలు నోటిఫై అయితేనే అమలుకు తమ శాఖ రంగంలోకి దిగుతుందన్నారు. ట్యాక్సీలు భారీ చార్జీలు వసూలు చేస్తున్నాయని, అగ్రిగేటర్లు లెసైన్సు లేకుండానే వాహనాలను తిప్పుతున్నాయని చెప్పారు. నిబంధనలు వస్తే వీటి దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు. -
నేటి నుంచి వైజాగ్‌లో ఉబర్ సేవలు
ముంబై: ఉబర్ కంపెనీ తన ట్యాక్సీ సేవలను వైజాగ్‌లో గురువారం నుంచి ప్రారంభించనుంది. వైజాగ్‌తోపాటు ఉబర్ ట్యాక్సీ సేవలు భువనేశ్వర్, కోయంబత్తూరు, ఇండోర్, మైసూర్, నాగ్‌పూర్, సూరత్ వంటి ఆరు టైర్-2 పట్టణాల్లో కూడా ప్రారంభంకానున్నాయి. దీంతో ఉబర్ సేవలు దేశంలోని 18 పట్టణాల్లో ఉన్నట్లు అవుతుంది. అలాగే ఉబర్‌కు అమెరికా తర్వాత భారత్ రెండో అతిపెద్ద మార్కెట్ ప్రాంతంగా మారుతుంది. కంపెనీ నెలవారి వృద్ధి 40 శాతంగా ఉందని ఉబర్ ఇండియా హెడ్ నీరజ్ సింఘల్ తెలిపారు. -
టైమ్స్ ఇంటర్నెట్కు ఉబెర్‌లో వాటా
వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందం - డీల్ విలువ రూ. 150 కోట్లు న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ టెక్నాలజీస్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డిజిటల్ విభాగం టైమ్స్ ఇంటర్నెట్ స్వల్ప వాటా తీసుకుంది. వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందంలో భాగంగా ఈ డీల్ కుదుర్చుకున్నట్లు ఉబెర్ పేర్కొంది. దీని విలువ సుమారు రూ. 150 కోట్లు. బెనెట్, కోల్మన్ అండ్ కంపెనీకి టైమ్స్ ఇంటర్నెట్ అనుబంధ సంస్థ. భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణ కోసం టైమ్స్ ఇంటర్నెట్తో ఒప్పందం తోడ్పడగలదని ఉబెర్ తెలిపింది. భారత్‌లో హైదరాబాద్ సహా 11 నగరాల్లో ఉబెర్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల కారణంగా ఆ సంస్థను భారత్‌లో డిసెంబర్లో నిషేధించిన సంగతి తెలిసిందే. కంపెనీ జనవరిలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టైమ్స్ ఇంటర్నెట్తో ఉబెర్ వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలో బైదు, లాటిన్ అమెరికాలో అమెరికామొవిల్, అమెరికాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలతో ఉబెర్కి ఈ తరహా ఒప్పందాలు ఉన్నాయి. మరోవైపు, టైమ్స్ ఇప్పటిదాకా హఫింగ్టన్ పోస్ట్, బిజినెస్ ఇన్సైడర్, గాకర్ మీడియా, జిఫ్ డేవిస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో టైఅప్ పెట్టుకుంది. -
ఢిల్లీలో ఉబర్ క్యాబ్‌లపై నిషేధం
రేప్ నేపథ్యంలో ఢిల్లీ సర్కారు చర్య గతంలోనూ రేప్ కేసులో జైలుకెళ్లిన ఉబర్ డ్రైవర్ సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉబర్ ప్రైవేట్ క్యాబ్ సర్వీస్‌కు చెందిన ఓ డ్రైవర్ తన క్యాబ్‌లో ఓ ఫైనాన్స్ ఉద్యోగిని(27)పై అత్యాచారానికి పాల్పడిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఆ కంపెనీ కార్యకలాపాలపై సోమవారం నిషేధం విధించింది. అమెరికాకు చెందిన ఆ కంపెనీ.. రాజధానిలో ఇక ఎలాంటి రవాణా సేవలూ అందించకుండా బ్లాక్‌లిస్టులో ఉంచింది. సేవల విషయంలో ఉబర్ బాధితురాలిని తప్పుదోవ పట్టించిందని, www.uber.com ద్వారా అందిస్తున్న సర్వీసులన్నింటిని తక్షణం నిషేధిస్తున్నామని పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా ఉబర్ సర్వీసులను నిషేధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఉబర్ హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై తదితర నగరాల్లో సర్వీసులు నడుపుతోంది. కాగా, శుక్రవారం నేరానికి పాల్పడిన నిందితుడు శివకుమార్ యాదవ్‌ను(32) పోలీసులు సోమవారం ఢిల్లీ తీస్ హజారీ కోర్టుకు హాజరుపరచగా జడ్జి మూడు రోజుల పోలీసు కస్టడీకి విధించారు. యాదవ్‌ను జడ్డి గుర్తింపు పరేడ్ కు ఆదేశించగా అతడు నిరాకరించాడు. బాధితురాలు తన ఫోటోను ఉబర్ వెబ్సైట్లో చూసింది కనుక తనను గుర్తించగలదన్నాడు. తాను గతంలోనూ ఓ అత్యాచారం కేసులో ఏడు నెలలు జైల్లో ఉండి నిర్దోషిగా బయటపడ్డానని యాదవ్ విచారణలో పోలీసులకు చెప్పాడు. 2011లో యాదవ్ పబ్‌లో పనిచేసే ఓ యువతిని కారులో ఎక్కించుకుని అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. బాధితురాలు మాట మార్చడంతో నిర్దోషిగా బయటపడ్డాడు. ఉబర్ కంపెనీ యాదవ్ గత చరిత్రను తనిఖీ చేయకుండా ఉద్యోగమిచ్చిందని, దర్యాప్తు తర్వాతా అతని ఫోన్‌కాల్స్ వివరాలు అందించలేకపోయిందని పోలీసులు తెలిపారు. అతని గత చరిత్రను తెలుసుకుని ఉంటే తాజా ఘటన జరిగేది కాదన్నారు. ఢిల్లీలో ‘నిర్భయ’ సామూహిక అత్యాచారానికి రెండేళ్ల పూర్తవుతున్న నేపథ్యంలో తాజా దారుణం చేసుకోవడంతో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. కాగా, ఈ ఘటనపై సోమవారం కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో స్పందిస్తూ.. నేరస్తుడిని శిక్షించడానికి, భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా ఉండడానికి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజ్‌నాథ్ ఇంటి ముందు ఆమ్ ఆద్మీ పార్టీ, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. -
ట్యాక్సీ యాప్@ 1.80 లక్షల కోట్లు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: విస్తరిస్తున్న నగరాల్లో ప్రయాణికులను ఒక చోట నుండి వేరొక చోటికి చేరవేసే రవాణా సేవల్లో బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలుండటంతో బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయలను ఈ రంగంలో కుమ్మరిస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత ట్యాక్సీ సేవల రంగంలో పెట్టుబడులకు మించి ఎన్నో రెట్లు ప్రతిఫలం వస్తుండటంతో ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ రంగంలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నాయి. ఆయా సంస్థల విలువలను ఎవరికీ అందని అంచనాలతో అనూహ్య స్థాయిల్లో మదింపు చేస్తున్నారు. స్థిరాస్తులు ఏమీ లేని అమెరికాకు చెందిన ఉబర్ సంస్థ విలువ 30 బిలియన్ డాలర్లు (లక్షా 80 వేల కోట్ల రూపాయలు) అంటే ముక్కున వేలేసుకోవల్సిందే. ఇండియాలో రూ. 2,400 కోట్లతో (400 మిలియన్డాలర్లు) వ్యాపారాభివృద్ధి చేసుకునేందుకు ఉబర్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ట్యాక్సీ క్యాబ్ రంగంలో ఈ స్థాయి పెట్టుబడులు గతంలో ఎన్నడూ చూడలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉబర్ బిజినెస్ మోడల్ భిన్నమైనది. రేడియో క్యాబ్స్లా ఉబర్ సంస్థకు సొంతంగా ట్యాక్సీలు, క్యాబ్‌లు లేవు. వాటిని నడిపించే డ్రైవర్లూ దాని ఉద్యోగులు కాదు. ఇది ఒక టెక్నాలజీ యాప్. అది చేసే పని కేవలం పేరయ్య (సర్వీస్ ఫెసిలిటేటర్) పనే. అంటే ట్యాక్సీ సేవలు కావాలనుకున్న కస్టమర్‌కు కారు డ్రైవర్ లేదా ఓనర్‌తో ఆన్లైన్లో అనుసంధానించటమే దీని పని. ఈ పనికి పొందే కమీషనే దీని ఆదాయం. దేశంలో హైదరాబాద్, బెంగళూరుతో ఆరు నగరాల్లో ఈ సంస్థ సేవలు వినియోగంలో ఉన్నాయి. ఉబర్ ఎక్స్ కార్ రెంటల్ కనీస చార్జీ రూ. 150. టాక్సీ మీటర్ రూ. 50 నుంచి మొదలవుతుంది. కిలోమీటర్‌కు రూ. 15 చార్జీ చేస్తారు. నగదు చెల్లింపు ఎలా?? వినియోగదారుడు తొలుత ఉబర్ యాప్‌ను తన మొబైల్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి. ట్యాక్సీ చార్జీలను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్...ఇలా ఏ మార్గంలో చెల్లించాలనుకుంటే ఆ వివరాలను పేటిఎం వాలెట్ ద్వారా ఉబర్‌కు లింకప్ చేసుకోవాలి. పేటిఎం వాలెట్ ఆప్షన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఓఎస్( ఐఫోన్) ఆపరేటింగ్ సిస్టంలలో నడుస్తోంది. డబ్బు చెల్లించేందుకు ‘పేమెంట్’ బటన్ నొక్కాలి. తర్వాత ‘యాడ్ మనీ’ ని క్లిక్ చేయండి. వాలెట్లో రీచార్జి మొత్తం రూ. 100 కు తగ్గరాదు. ఇది మినిమం బ్యాలెన్స్. వాలెట్‌ను మన అవసరాలకు అనుగుణంగా క్రెడిట్, డెబిట్‌కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రీచార్జి చేసుకోవచ్చు. డ్రైవర్లకు అధికాదాయం... సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లకన్నా ఉబర్ నెట్వర్క్ డ్రైవర్లు అధికాదాయం పొందుతున్నారు. సొంత కారు కలిగి ట్యాక్సీ నడపాలనుకున్న ఎవరైనా ఉబర్ డ్రైవర్ కావచ్చు. ఉబర్ ఎంపిక వడపోతలో మీరు అర్హులైతే మీకు సంస్థ ఒక ఐఫోన్ ఇస్తుంది. దాంతో మీరు ఉబర్ నెట్‌వర్క్‌లో సభ్యులైపోతారు. ఆయా నగరాలను బట్టి ట్యాక్సీఫేర్ (రవాణా చార్జీ)ని ఉబర్ సంస్థ నిర్ధారిస్తుంది. ఉబర్ సంస్థ వసూలు చేసిన చార్జీలో 20 శాతం తన కమీషన్‌గా తీసుకొని మిగిలిన 80 శాతం డ్రైవర్ ఖాతాకు జమ చేస్తుంది. సాధారణ ట్యాక్సీ సంస్థలకన్నా ఉబర్ ద్వారానే డ్రైవర్లు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు. ఉబర్ చిన్నకార్ల డ్రైవర్లు వారానికి కనీసం రూ.16 వేలు సంపాదిస్తున్నారు. -
ఎనీ టైమ్ ట్యాక్సీ
యాప్ యాప్ హుర్రే ఉబర్... ఇదొక ట్యాక్సీ రవాణా యాప్. క్రెడిట్ కార్డు పేమెంట్‌తో మొబైల్ యాప్ ద్వారా పనిచేసే ఈ క్యాబ్ వ్యవస్థ ప్రస్తుతం హైదరాబాదీలకు అందుబాటులోకి వచ్చింది. ఉబర్ టెక్నాలజీస్ సంస్థ నాలుగేళ్ల కిందట ఈ యాప్‌ను తొలుత అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది. మొబైల్లో ఈ యాప్ ఉంటే చాలు, కరోలా వంటి ప్రీమియం కారు మీ ముందు ఆగుతుంది. సురక్షితంగా ఇంటికి చేరుస్తుంది. ఉబర్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త యాప్ పేరు ‘ఉబర్ ఎక్స్’. ఈ యాప్‌ని ఓపెన్ చేసి పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్‌తో పాటు క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేసుకోవాలి. దీనిని డౌన్లోడ్ చేసుకుంటే క్యాబ్ కావలసినప్పుడు యాప్ ఓపెన్ చేసి, అత్యంత చేరువలో ఉన్న కారు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. డ్రైవరు వివరాలను కూడా తెలుసుకోవచ్చు. యాప్ సాయంతో డ్రైవర్లు మిమ్మల్ని చేరుకోగలరు. కారు ఎక్కిన తర్వాత ఎక్కడకు వెళ్లాలో చెప్పవచ్చు. ముందే చెప్పాల్సిన పనిలేదు. దిగిన తర్వాత డబ్బు చెల్లించక్కర్లేదు. యాప్ ద్వారానే మీ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్ జరిగిపోతుంది. గతంలో ఉబర్ టెక్నాలజీస్ తెచ్చిన ‘ఉబర్ బ్లాక్’ యాప్ కంటే, తాజాగా వచ్చిన ‘ఉబర్ ఎక్స్’ 40 శాతం చౌక అయినది నిజమేనంటున్నారు ఉబర్ తొలి రైడ్‌కు వెళ్లిన సిటీ ఆర్జే రాహుల్. అతనితో పాటు నటి రకుల్ ప్రీతిసింగ్ కూడా తొలి రైడ్ చేసింది. సౌకర్యవంతం ‘ఉబర్ ఎక్స్’ యాప్ ద్వారా ట్యాక్సీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో చాలా ఆప్షన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.ఈ యాప్‌లో స్ప్లిట్ యువర్ ఫేర్ అనే ఆప్షన్ కూడా ఉంది. కారు పూల్ లాంటిదే ఇది కూడా. ఇద్దరు ఫ్రెండ్స లేదా కొలీగ్స ఒకే చోటుకు వెళ్లాలనుకుంటే ఈ యాప్ ద్వారా ఫేర్‌ను పంచుకోవచ్చు.ఇందులోని ‘షేర్ మై ఈటీఏ’ ఆప్షన్ ద్వారా మన గమ్యస్థానాన్ని ఎంటర్ చేయాలి. మనం వస్తున్న దారి వివరాలు ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వారి వివరాలను ఎంటర్ చేస్తే, వారికి ఎస్ఎంఎస్ వస్తుంది. దీనికోసం వారి మొబైల్లో ఈ యాప్ ఉండాల్సిన అవసరం లేదు. అందులో వారికి ఒక లింక్ వస్తుంది. దానిని ఓపెన్ చేస్తే, కారులో మనం ఎక్కడున్నామో తెలిపే మ్యాప్ లింక్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఏ దారిలో ఎంత దూరంలో ఉన్నామో తెలుసుకోవచ్చు.ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. భారత్‌లోని ఆరు నగరాల్లో... ఢిల్లీ, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో ఇది అందుబాటులోకి వచ్చింది.