ఏడాదిలో 20,000 డ్రైవర్లకు రుణం
♦ ముందుకొచ్చిన టాటా గ్రూప్
♦ ఉబర్ టెక్నాలజీస్‌తో భాగస్వామ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాక్సీ అగ్రిగేటర్ ఉబర్ టెక్నాలజీస్ తాజాగా టాటా సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఉబర్ ప్లాట్‌ఫాంపై పనిచేసేందుకు ముందుకొచ్చిన డ్రైవర్ పార్టనర్లకు టాటా మోటార్స్‌కు చెందిన కార్ల కొనుగోలుకు సులభ వాయిదాల్లో రుణం ఇస్తారు. టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా మోటార్స్ ఫైనాన్స్‌లు ఈ రుణం అందిస్తాయి. ఇతర సంస్థలతో పోలిస్తే వడ్డీ రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి. అందుబాటు ధరలో టాటా ఏఐజీ బీమా కల్పించనుంది.
ఏడాదిలో 20,000 మందికిపైగా ఔత్సాహికులకు రుణం ఇవ్వాలని టాటా గ్రూప్ భావిస్తోంది. హైదరాబాద్‌లో తొలుత ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తున్నట్టు టాటా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు మధు కన్నన్ గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 27 నగరాల్లో ఉబర్ సేవలందిస్తోంది. డిసెంబరు నాటికి మరో 23 నగరాల్లో అడుగుపెడతామని ఉబర్ ఆసియా బిజినెస్ హెడ్ ఎరిక్ అలెగ్జాండర్ పేర్కొన్నారు. సొంత పేమెంట్ వాలెట్ తీసుకొచ్చే విషయంలో కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు.
ఆకట్టుకోవడానికే ప్రోత్సాహకాలు..
డ్రైవర్ పార్టనర్లను ఆకట్టుకోవడానికే నగదు ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు ఎరిక్ అలెగ్జాండర్ వెల్లడించారు. ‘కొత్తగా ఏదైనా నగరంలో ప్రవేశించినపుడు ప్రోత్సాహకాలు అందిస్తాం. ఎక్కువ ట్రిప్పులు చేసిన వారికి అదనపు ఆదాయం వస్తుంది. డబ్బులు వస్తేనే ఈ వ్యాపారం సాగుతుంది. డ్రైవర్లు నెట్‌వర్క్‌లోకి వస్తారు. డ్రైవర్ పార్టనర్లకు ఆదాయావకాశాల కల్పన మా విధి. సరఫరా-డిమాండ్‌లో వ్యత్యాసం ఉన్నప్పుడే సర్జ్ ప్రైసింగ్ ఉంటుంది. ఆ సమయంలో డిమాండ్ ఉంటుంది కాబట్టి అధిక ఆదాయం కోసం డ్రైవర్లు లాగిన్ అవుతారు. సర్జ్ ధర నిర్ణయం మానవ ప్రమేయం లేకుండా అంతా సాంకేతికంగా జరుగుతుంది’ అని వివరించారు. వ్యాపారం నిలదొక్కుకోవడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని తెలిపారు.