
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసుల సంస్థ టాటా క్యాపిటల్ త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానుంది. అయితే ఇందుకు కంపెనీతో టాటా మోటార్స్ ఫైనాన్స్ విలీనానికి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) అనుమతించవలసి ఉంది. తదుపరి సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసేందుకు వీలుంటుంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల(మార్చి) చివరికల్లా విలీనానికి ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అంచనా. దీంతో 2 బిలియన్ డాలర్ల(రూ.17,000 కోట్లు) విలువైన ఐపీవోకు శ్రీకారం చుట్టనుంది. తద్వారా 11 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా నిలవనున్నట్లు అంచనా. ఆర్‌బీఐ వద్ద అప్పర్‌లేయర్ ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తింపు పొందిన టాటా క్యాపిటల్ పబ్లిక్ ఇష్యూకి ఇప్పటికే సంస్థ బోర్డు అనుమతించింది. ఐపీవోలో భాగంగా 2.3 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా ప్రస్తుత వాటాదారులు సైతం కొంతమేర ఈక్విటీని ఆఫర్ చేయనున్నారు.
ఏప్రిల్‌లో ఏథర్ ఎనర్జీ ఐపీవో
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కంపెనీ ఏథర్ ఎనర్జీ ఏప్రిల్‌లో పబ్లిక్ ఇష్యూకి వచ్చే సన్నాహాలు చేపట్టింది. ఇందుకు వీలుగా కంపెనీ తప్పనిసరిగా మార్పిడికిలోనయ్యే ఫ్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఈక్విటీగా మార్పు చేస్తోంది. కంపెనీల రిజిస్టర్ (ఆర్‌వోసీ) సమాచార ప్రకారం 1.73 సీసీపీఎస్‌ను 24.04 కోట్ల ఈక్విటీ షేర్లుగా మార్పిడి చేసేందుకు ఏథర్ బోర్డు తాజాగా అనుమతించింది. సెబీ నిబంధనల ప్రకారం ప్రధాన ప్రాస్పెక్టస్ దాఖలు చేసే ముందుగానే సీసీపీఎస్‌ను ఈక్విటీగా మార్పిడి చేయవలసి ఉంటుంది. వెరసి 2025–26లో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన తొలి కంపెనీగా ఏథర్ ఎనర్జీ నిలిచే వీలున్నట్లు మర్చంట్ బ్యాంకింగ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చదవండి: పాక్ రైల్వే విస్తీర్ణం ఎంతో తెలుసా..?
గతేడాది సెప్టెంబర్‌లో ఏథర్ సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. మహారాష్ట్రలో ఈవీ ద్విచక్ర వాహన తయారీ ప్లాంటు ఏర్పాటు, రుణ చెల్లింపులకుగాను నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు పత్రాలలో పేర్కొంది. ఐపీవోలో భాగంగా రూ. 3,100 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 2.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తదుపరి రెండో ద్విచక్ర ఈవీ కంపెనీగా స్టాక్ ఎక్ఛ్సేంజీల్లో లిస్ట్‌కానుంది.
Comments
Please login to add a commentAdd a comment