‘యాప్’రే.. ట్యాక్సీ!! | taxi app ola and uber more charges | Sakshi
Sakshi News home page

‘యాప్’రే.. ట్యాక్సీ!!

Published Thu, Dec 24 2015 1:58 AM | Last Updated on Thu, Aug 30 2018 9:07 PM

‘యాప్’రే.. ట్యాక్సీ!! - Sakshi

‘యాప్’రే.. ట్యాక్సీ!!

►  సర్జ్ పేరిట రెండు రెట్లకుపైగా చార్జీల బాదుడు..
  ఏ సమయంలో బుక్ చేసినా ఇదే తీరు
  ఓలా, ఉబెర్ కస్టమర్లకు చార్జీల చుక్కలు
  అలవాటు చేసి బాదేస్తున్నారంటున్న కస్టమర్లు
  నియంత్రణ లేకపోవటం వల్లేనని విమర్శలు
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూర :
  ఆటోలో ఎక్కడికైనా వెళ్లాలంటే మీటరుంటుంది!!. మీటరుపై రానన్నా... అంతకన్నా ఎక్కువ అడిగినా పక్కన పోలీసులుంటారు!!. ఇవేవీ కాదనుకుంటే... జనం నేరుగా ఆటో డ్రైవరుతోనే బేరమాడతారు. ఇరువురికీ ఆమోదయోగ ్యమైతేనే సవారీ!.
 
 మరి ట్యాక్సీల సంగతే తీసుకోండి. మొదటిది మీరు డ్రైవర్లతో నేరుగా బేరమాడలేరు. ఎందుకంటే వాటికి ఓలా, ఉబెర్ లాంటి టెక్నాలజీ మధ్యవర్తులుంటారు. ఇక రెండోది ఈ ట్యాక్సీలకు మీటర్లుండవు. పోనీ... కిలోమీటరుకు 10 రూపాయలనో, 15 అనో వాటికవే ప్రకటించుకునే చార్జీల్నే మీటరుగా భావించినా... వాటిని అవి ఫాలో కావు. మామూలుగా అయితే కి.మీ.కి 10 రూపాయలే. కానీ ఇపుడు పీక్‌టైమ్ కదా... ‘2.2’ సర్జ్ అని ముందే చెప్పేస్తాయి. అంటే రూ.100 చెల్లించాల్సిన చోట 220 చెల్లించాలన్న మాట. పోనీ ఈ రేటైనా శాశ్వతంగా ఉంటుందా అంటే... లేదు. అది ఒకోసారి 180 కావచ్చు... మరోసారి 250 కావచ్చు. ఇంకా చెప్పాలంటే... సమయాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఎప్పుడైనా... ఎంతైనా కావచ్చు. దీన్నేమనాలి? టెక్నాలజీ కంపెనీల దందా అనొద్దా?
 
 బహుళజాతి కంపెనీల్ని జాగ్రత్తగా గమనిస్తే వాటి వ్యూహం అర్థమవుతుంది. మొదట భారీగా డబ్బు వెదజల్లి డిస్కౌంట్లు, ఆఫర్లతో అందరినీ ఆకట్టుకోవటం. అందరినీ తమ ఉత్పత్తి వాడేలా చేసి... తమ డబ్బుతో పోటీదారుల్ని కోలుకోలేకుండా దెబ్బతీయటం. తమ ఉత్పత్తి అందరికీ అలవాటయ్యాక... పోటీ లేదని తెలిశాక భారీ వడ్డింపులతో ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించటం. ఇప్పుడు ట్యాక్సీల విషయంలోనూ జరుగుతున్నదిదే.
 
 ఏ సమయమైనా బాదుడే...
 హైదరాబాదే కాదు. దేశంలో యాప్‌ల ద్వారా ట్యాక్సీ సేవలందుకుంటున్న అన్ని ప్రాంతాల్లోనూ ప్రయాణికులకిపుడు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఒక్క క్లిక్‌తో కస్టమర్ల ముందు ట్యాక్సీని నిలబెట్టడం అలవాటు చేసిన అగ్రిగేటర్ల వ్యాపార స్వరూపం బయటపడుతోంది. ‘సర్జ్ ప్రైసింగ్’ పేరుతో విపరీతంగా చార్జీలు బాదుతుండటంతో ప్రయాణికులకు ఎటూ పాలుపోవటం లేదు. సర్జ్ అంటే... సాధారణ చార్జీకన్నా అధిక మొత్తం వసూలు చేయటమే. ఉదాహరణకు బుకింగ్ సమయంలో చార్జీ 2గీ అని ఉంటే కస్టమర్‌కు అయ్యే ఖర్చు రెండు రెట్లు అవుతుందన్న మాట. డిమాండ్ సమయంలో డ్రైవర్లను ఆకట్టుకోవడానికే సర్ ్జ ప్రైసింగ్ అని ట్యాక్సీ అగ్రిగేటర్లు ఉబెర్, ఓలా చెబుతున్నాయి.
 
  ‘‘సర్జ్ వల్ల ఎక్కువ డబ్బులొస్తాయి కనక మా నెట్‌వర్క్‌లోకి డ్రైవర్లు ఎక్కువ మంది వస్తారు. దాంతో కస్టమర్లకు ఎక్కువ వాహనాలు అందుబాటులో ఉంటాయి. మా సేవల పట్ల వినియోగదార్లకు నమ్మకం ఏర్పడుతుంది’’ అని ఓలా అధికారి ఒకరు చెప్పారు. అయితే డిమాండ్ లేని సమయంలోనూ సర్జ్ పేరుతో చార్జీలు బాదేస్తున్న సంఘటనలు అనేకం. నిజానికి ఈ మధ్య హైదరాబాద్‌లో ఏ సమయంలోనైనా సర్జ్ ప్రైసింగ్‌కు తప్ప మామూలు ధరకు ట్యాక్సీలు దొరకటం లేదంటే అతిశయోక్తి కాదు.
 
 డ్రైవర్లు తక్కువ కావటం, కస్టమర్లు ఎక్కువ కావటం వల్ల ఈ పరిస్థితి ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. దీనిపై తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్, బస్ ఆపరేటర్ల సంఘం ప్రెసిడెంట్ సయ్యద్ నిజాముద్దీన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘అగ్రిగేటర్లు ప్రోత్సాహకాలు తగ్గించాయి. దీంతో డ్రైవర్లు వాటికి దూరమవుతున్నారు. ట్యాక్సీలు తగ్గి, డిమాండ్ పెరగటంతో కస్టమర్లు సర్జ్ ప్రైసింగ్ బారిన పడుతున్నారు. డిమాండ్ లేకున్నా ఎక్కువ చార్జీ చేస్తున్న సందర్భాలు మా దృష్టికి వచ్చాయి’’ అని ఆయన వివరించారు. చూడ్డానికి ప్రోత్సాహకాలు ఆకర్షణీయంగా ఉన్నా, వాస్తవానికి డ్రైవర్లకు రావడం లేదన్నారు.
 
 కూపన్ కోడ్ ఉందా..
 టెక్నాలజీతో అంతిమంగా గెలిచేది దాన్ని సమర్థంగా వినియోగించుకున్నవారు. ఆగ్రిగేటర్లదీ అదే తీరు. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇవి ఉచిత కూపన్లు ఆఫర్ చేస్తున్నాయి. మీరు గనక ట్యాక్సీ తరచు బుక్ చేస్తున్నవారై... వరసగా కొన్నాళ్ల పాటు బుక్ చేయకుంటే వాటికి బెంగ పట్టుకుంటుంది. అందుకే మీకు రూ.100 తగ్గింపు, 20 శాతం డిస్కౌంట్ అంటూ కూపన్లు పంపిస్తాయి. మీ దగ్గర కూపన్ ఉన్న విషయం వాటికెలాగూ తెలుసు. ఇక మీరు ట్యాక్సీ బుక్ చేయాలని భావిస్తే... తప్పనిసరిగా సర్జ్ బారిన పడాల్సి వస్తుంది. సాధారణ చార్జీకి వాహనం దొరకటం దాదాపు అసాధ్యమే. చివరికి అసహనం పెరిగి... ఎలాగూ కూపన్ ఉందిగా, కొంత ఎక్కువైతే ఏంటి? అనే ధోరణిలో బుక్ చేయటం మీ వంతవుతుంది.
 
  ఒకవేళ మీరు మీ ప్రయాణాన్ని ముందే ప్లాన్ చేసుకుని... ఒకరోజు ముందో, రెండ్రోజుల ముందో బుక్ చేసుకోవాలని భావించినా... ఆ సమయంలో అన్ని స్లాట్లూ బుక్ అయిపోయాయని, ప్రయాణానికి ముందు అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలని సలహా వస్తుంది. అదీ కథ. ఇటీవల ఓ కస్టమరు ఓలా మినీలో 17 కి.మీ. ప్రయాణిస్తే బిల్లు రూ.294 వచ్చింది. అదే కస్టమర్ గత ఆదివారం మధ్యాహ్నం 21 కి.మీ. ప్రయాణిస్తే రూ.438 బిల్లు చెల్లించాల్సి వచ్చింది. ఈ లెక్కన కిలోమీటరుకు సుమారు రూ.21 చార్జీ అయిందన్నమాట. కాగా, ఓలా ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు సహా పలువురి నుంచి రూ.8,700 కోట్లు సమీకరించింది. భారత్‌లో వచ్చే 9 నెలల్లో రూ.6,600 కోట్లు ఖర్చు చేయనున్నట్టు 2015 జూలైలో ఉబెర్ ప్రకటించింది. కస్టమర్ చెల్లించిన చార్జీల్లో ఉబెర్ 20%, ఓలా 15% తమ కమీషన్‌గా తీసుకుంటున్నాయి.
 
 మిగతా వాహనాలకు పీక్ కాదా?
 ఆటోల విషయమే తీసుకుంటే... అన్నిచోట్లా గట్టి నియంత్రణలున్నాయి. పీక్ టైమ్ అయినా, ట్రాఫిక్ బాగా ఎక్కువున్నా... ఎప్పుడైనా మీటర్‌పై వెళ్లాల్సిందే. మామూలుగా ట్యాక్సీని బుక్ చేసుకున్నా పీక్ టైమ్ అని, రద్దీ ఎక్కువుందని అధిక చార్జీలు వసూలు చేయరు. కానీ యాప్‌ల ద్వారా బుక్ చేస్తే మాత్రం సర్జ్ అంటూ వాత పెడుతుండటాన్ని పలువురు తప్పుబట్టారు. ‘‘నిజానికి కిలోమీటర్ల చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు కనక తూనికలు, కొలతల శాఖ అనుమతించిన మీటర్లను వాడాలి.
 
  కానీ దేశంలో ఏ ఒక్క ట్యాక్సీకీ మీటర్ లేదు. ప్రయాణ దూరాన్ని కొలిచేందుకు ఆగ్రిగేటర్లు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారు. యాప్‌ల ద్వారా ట్యాక్సీల నిర్వహణకు నిబంధనలు రావాల్సిన అవసరం ఉంది’’ అని ఓ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యానించారు. నిబంధనలు నోటిఫై అయితేనే అమలుకు తమ శాఖ రంగంలోకి దిగుతుందన్నారు. ట్యాక్సీలు భారీ చార్జీలు వసూలు చేస్తున్నాయని, అగ్రిగేటర్లు లెసైన్సు లేకుండానే వాహనాలను తిప్పుతున్నాయని చెప్పారు. నిబంధనలు వస్తే వీటి దోపిడీకి అడ్డుకట్ట పడుతుందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement