ఎనీ టైమ్ ట్యాక్సీ
యాప్ యాప్ హుర్రే
ఉబర్... ఇదొక ట్యాక్సీ రవాణా యాప్. క్రెడిట్ కార్డు పేమెంట్‌తో మొబైల్ యాప్ ద్వారా పనిచేసే ఈ క్యాబ్ వ్యవస్థ ప్రస్తుతం హైదరాబాదీలకు అందుబాటులోకి వచ్చింది. ఉబర్ టెక్నాలజీస్ సంస్థ నాలుగేళ్ల కిందట ఈ యాప్‌ను తొలుత అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌లో ఈ యాప్ ఉంటే చాలు, కరోలా వంటి ప్రీమియం కారు మీ ముందు ఆగుతుంది. సురక్షితంగా ఇంటికి చేరుస్తుంది. ఉబర్ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త యాప్ పేరు ‘ఉబర్ ఎక్స్’. ఈ యాప్‌ని ఓపెన్ చేసి పేరు, ఫోన్ నంబరు, ఈ-మెయిల్‌తో పాటు క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేసుకోవాలి. దీనిని డౌన్‌లోడ్ చేసుకుంటే క్యాబ్ కావలసినప్పుడు యాప్ ఓపెన్ చేసి, అత్యంత చేరువలో ఉన్న కారు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. డ్రైవరు వివరాలను కూడా తెలుసుకోవచ్చు. యాప్ సాయంతో డ్రైవర్లు మిమ్మల్ని చేరుకోగలరు. కారు ఎక్కిన తర్వాత ఎక్కడకు వెళ్లాలో చెప్పవచ్చు. ముందే చెప్పాల్సిన పనిలేదు. దిగిన తర్వాత డబ్బు చెల్లించక్కర్లేదు. యాప్ ద్వారానే మీ క్రెడిట్ కార్డు నుంచి పేమెంట్ జరిగిపోతుంది. గతంలో ఉబర్ టెక్నాలజీస్ తెచ్చిన ‘ఉబర్ బ్లాక్’ యాప్ కంటే, తాజాగా వచ్చిన ‘ఉబర్ ఎక్స్’ 40 శాతం చౌక అయినది నిజమేనంటున్నారు ఉబర్ తొలి రైడ్‌కు వెళ్లిన సిటీ ఆర్‌జే రాహుల్. అతనితో పాటు నటి రకుల్ ప్రీతిసింగ్ కూడా తొలి రైడ్ చేసింది.
సౌకర్యవంతం
‘ఉబర్ ఎక్స్’ యాప్ ద్వారా ట్యాక్సీ ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో చాలా ఆప్షన్లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.ఈ యాప్‌లో స్ప్లిట్ యువర్ ఫేర్ అనే ఆప్షన్ కూడా ఉంది. కారు పూల్ లాంటిదే ఇది కూడా. ఇద్దరు ఫ్రెండ్‌స లేదా కొలీగ్‌స ఒకే చోటుకు వెళ్లాలనుకుంటే ఈ యాప్ ద్వారా ఫేర్‌ను పంచుకోవచ్చు.ఇందులోని ‘షేర్ మై ఈటీఏ’ ఆప్షన్ ద్వారా మన గమ్యస్థానాన్ని ఎంటర్ చేయాలి. మనం వస్తున్న దారి వివరాలు ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వారి వివరాలను ఎంటర్ చేస్తే, వారికి ఎస్‌ఎంఎస్ వస్తుంది. దీనికోసం వారి మొబైల్‌లో ఈ యాప్ ఉండాల్సిన అవసరం లేదు.
అందులో వారికి ఒక లింక్ వస్తుంది. దానిని ఓపెన్ చేస్తే, కారులో మనం ఎక్కడున్నామో తెలిపే మ్యాప్ లింక్ కనిపిస్తుంది. దీని ఆధారంగా ఏ దారిలో ఎంత దూరంలో ఉన్నామో తెలుసుకోవచ్చు.ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. భారత్‌లోని ఆరు నగరాల్లో... ఢిల్లీ, ముంబై, పుణే, చెన్నై, హైదరాబాద్‌లలో ఇది అందుబాటులోకి వచ్చింది.