Taxi services company
-
"హలో ట్యాక్సీ'' : 900 మందికి టోకరా
పనాజీ : స్వల్ప పెట్టుబడులపై భారీ రాబడి వస్తుందని నమ్మించి మోసంచేసిన కిలాడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ యాప్ ఆధారిత టాక్సీ హలో టాక్సీ కంపెనీలో పెట్టుబడులపై భారీగా ఆదాయం వస్తుందంటూ గోవాకు ఒక మహిళ (47) నమ్మబలికింది. తద్వారా దక్షిణ గోవా నుంచి 900 మందికి పైగా వ్యక్తులకు టోకరా ఇచ్చింది. సుమారు 250 కోట్ల రూపాయలు మేర మోసానికి పాల్పడి అక్కడినుంచి తన ముఠాతో సహా ఉడాయించింది. దీంతో లబోదిబోమన్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు ఎట్టకేలకు మహిళను అరెస్ట్ చేశారు. 2019లో నమోదైన పోలీసు ఫిర్యాదు ఆధాకంగా ఈ మహిళను అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆమె వ్యాపార భాగస్వాములు, నలుగురు కో డైరెక్టర్లలో ముగ్గురు సరోజ్ మహాపాత్రా, రాజేష్ మహతో, సుందర్ భాటి, హరీష్ భాటి పరారీలో ఉన్నట్టు తెలిపారు. కో డైరెక్టర్లలో ఒకరైన మహతోను ఆగస్టు 23న అరెస్టు చేశామన్నారు. మిగతావారిని కూడా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. జాయింట్ పోలీస్ కమిషనర్ (ఇఓడబ్ల్యూ) ఓపీ మిశ్రా అందించిన సమాచారం ప్రకారం హలో టాక్సీలో పెట్టుబడులు పెట్టినవారికి మొదట్లో అధిక రాబడిని చూపించి, భారీ ఎత్తున పెట్టుబడిదారులను ఆకర్షించారు. నెలవారీ పెట్టుబడులపై 200 శాతం దాకా అధిక వడ్డీ ఆశ చూపారు. అంతే ఇబ్బడి బముబ్బడిగా పెట్టుబడులొచ్చాయి. కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఇదే అదునుగా భావించిన వీరు తరచూ ఆఫీసులను మారుస్తూ చివరికి అక్కడినుంచి ఉడాయించారు. సంస్థ బ్యాంక్ స్టేట్ మెంట్లను పరిశీలించిన అనంతరం పెద్ద మొత్తంలో బ్యాంకు ఖాతాలను స్తంభింప చేశామని మిశ్రా వెల్లడించారు. అలాగే 3.5 కోట్ల విలువైన అరవై కొత్త కార్లను నోయిడాలో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
భారత్‌లో రూ. 6,400 కోట్ల పెట్టుబడులు
ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్ న్యూఢిల్లీ : ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ భారత్‌లో కార్యకలాపాలు భారీ ఎత్తున విస్తరించడానికి ప్రణాళికలు వేస్తోంది. ఇందుకోసం వచ్చే 6-9 నెలల వ్యవధిలో భారత్‌లో దాదాపు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.6,400 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఉబె ర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ జైన్ చెప్పారు. ఒకవైపు వివిధ కారణాలతో నిషేధాలు విధించడం వంటి వివాదాలు, మరోవైపు ఓలా వంటి స్థానిక సంస్థల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో ఉబెర్ భారీ పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమ ప్రాధాన్య మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, అందుకోసమే పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నామని ఆయన తెలియజేశారు. కార్యకలాపాలు మెరుగుపర్చుకోవడానికి, మరిన్ని నగరాలకు విస్తరించడానికి ఈ నిధులు వినియోగిస్తామన్నారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో రాబోయే ఆరు-తొమ్మిది నెలల్లో రోజుకి 10 లక్షల పైగా ట్రిప్‌ల స్థాయిని సాధించగలమని అంచనా వేస్తున్నట్లు అమిత్ జైన్ తెలిపారు. అమెరికా తర్వాత తమకు అతి పెద్ద మార్కెట్‌గా భారత్ నిలుస్తోందన్నారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్‌లో సుమారు 50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో అంతర్జాతీయ కార్యాలయం ప్రారంభించనున్నట్లు ఉబెర్ ఇటీవలే ప్రకటించింది. అంతర్జాతీయ కార్యకలాపాల్లో తొలిసారిగా హైదరాబాద్‌లో నగదు చెల్లింపులను కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. -
ఇక యాప్‌తోనే ఓలా బుకింగ్స్
బెంగళూరు : ట్యాక్సీ సేవల సంస్థ ఓలా ఇక ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 100 నగరాల్లో మొబైల్ యాప్ రూపంలోనే సర్వీసులు అందించనుంది. తమకొచ్చే బుకింగ్స్‌లో 99%.. యాప్ ద్వారానే ఉంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. కస్టమర్లకు సహాయపడేందుకు తమ కాల్‌సెంటర్ ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటుందని వివరించింది. 2011లో క్యాబ్ బుకింగ్స్ కోసం ఓలా మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ముంబైలో ఇది ఆటో రిక్షాలు, ట్యాక్సీల బుకింగ్‌కి కూడా ఉపయోగపడుతోంది. మొదటిసారిగా యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న కస్టమర్లు ‘యాప్ఓన్లీ’ అనే కూపన్ కోడ్‌ను బుకిం గ్ కన్ఫర్మేషన్ స్క్రీన్‌పై టైప్ చేస్తే.. తమ తొలి బుకింగ్‌పై రూ. 150 డిస్కౌంటు లభిస్తుందని ఓలా సీవోవో ప్రణయ్ జీవ్రాజ్క తెలిపారు. -
‘ఓలా క్యాబ్స్’లో 2,500 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: విస్తరణలో భాగంగా ట్యాక్సీ సేవల సంస్థ ‘ఓలా’ తాజాగా 400 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,500 కోట్లు) సమీకరించింది. ఈ ఏడాది ఆఖరు నాటికి కార్యకలాపాలను రెట్టింపు స్థాయిలో 200 నగరాలకు విస్తరించడంతో పాటు క్యాబ్స్ సంఖ్యను కూడా పెంచుకోనుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టిన వాటిల్లో జీఐసీ, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్‌తో పాటు ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టైగర్ గ్లోబల్, స్టెడ్‌వ్యూ క్యాపిటల్, యాక్సెల్ పార్ట్నర్స్ సంస్థలు ఉన్నాయి. ఓలా సహవ్యవస్థాపకుడు, సీఈవో భవిష్ అగర్వాల్ ఈ విషయాలు తెలిపారు. సెప్టెంబర్ నాటికి 1,000 మంది పైగా ఇంజనీర్లను తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 100 నగరాల్లో కార్యకలాపాలు, 500 మంది ఇంజినీరింగ్ సిబ్బంది ఉన్నారన్నారు. ఇటీవలే కొనుగోలు చేసిన ట్యాక్సీఫర్‌ష్యూర్ విస్తరణకు 100 మిలి యన్ డాలర్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. -
టైమ్స్ ఇంటర్నెట్కు ఉబెర్‌లో వాటా
వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందం - డీల్ విలువ రూ. 150 కోట్లు న్యూఢిల్లీ: ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ టెక్నాలజీస్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డిజిటల్ విభాగం టైమ్స్ ఇంటర్నెట్ స్వల్ప వాటా తీసుకుంది. వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందంలో భాగంగా ఈ డీల్ కుదుర్చుకున్నట్లు ఉబెర్ పేర్కొంది. దీని విలువ సుమారు రూ. 150 కోట్లు. బెనెట్, కోల్మన్ అండ్ కంపెనీకి టైమ్స్ ఇంటర్నెట్ అనుబంధ సంస్థ. భారత్‌లో తమ కార్యకలాపాల విస్తరణ కోసం టైమ్స్ ఇంటర్నెట్తో ఒప్పందం తోడ్పడగలదని ఉబెర్ తెలిపింది. భారత్‌లో హైదరాబాద్ సహా 11 నగరాల్లో ఉబెర్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ ఒక మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణల కారణంగా ఆ సంస్థను భారత్‌లో డిసెంబర్లో నిషేధించిన సంగతి తెలిసిందే. కంపెనీ జనవరిలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో టైమ్స్ ఇంటర్నెట్తో ఉబెర్ వ్యూహాత్మక మార్కెటింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. చైనాలో బైదు, లాటిన్ అమెరికాలో అమెరికామొవిల్, అమెరికాలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలతో ఉబెర్కి ఈ తరహా ఒప్పందాలు ఉన్నాయి. మరోవైపు, టైమ్స్ ఇప్పటిదాకా హఫింగ్టన్ పోస్ట్, బిజినెస్ ఇన్సైడర్, గాకర్ మీడియా, జిఫ్ డేవిస్ వంటి అంతర్జాతీయ సంస్థలతో టైఅప్ పెట్టుకుంది.