
రేపు లోక్‌సభకు టీ బిల్లు
విభజన బిల్లు ఆర్థిక బిల్లు పరిధిలోకే వస్తుందన్న అటార్నీ జనరల్
దీంతో ముందు లోక్‌సభలోనే పెట్టాలని కాంగ్రెస్ కోర్ కమిటీ నిర్ణయం
రాష్ట్రపతి అనుమతి కోరిన కేంద్రం... మంజూరు చేసిన ప్రణబ్
బిల్లును 13న లోక్‌సభలో పెడుతున్నట్లు స్పీకర్‌కు తెలిపిన షిండే
సహకారం కోసం బీజేపీ అగ్రనేతలతో నేడు ప్రధాని విందు భేటీ
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 13వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత రాజ్యసభ ముందుకు బిల్లును తీసుకురావాలని కేంద్రం భావించినప్పటికీ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడివున్న తెలంగాణ బిల్లును పెద్దల సభలో ప్రవేశపెడితే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని భావించి నిర్ణయాన్ని మార్చుకుంది. విభజన బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం సమాచారం ఇవ్వటంతో.. ఈ బిల్లు ఆర్థిక బిల్లు పరిధిలోకి వస్తుంది కాబట్టి తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలన్న వాదన రావటంతో.. దీనిపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ అటార్నీ జనరల్‌ను న్యాయసలహా కోరారు. బిల్లును పరిశీలించిన ఏజీ జి.ఇ.వాహనవతి.. సంచిత నిధి ప్రస్తావన ఉంది కాబట్టి ఈ బిల్లు ఆర్థిక బిల్లు నిర్వచనం పరిధిలోకే వస్తుందని మంగళవారం రాజ్యసభ చైర్మన్‌కు వివరించారు.
ఈ పరిణామంతో కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యులు మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమై విభజన బిల్లును తొలుత లోక్‌సభలోనే ప్రవేశపెట్టే అంశంపై చర్చించారు. తెలంగాణ బిల్లును 13వ తేదీన లోక్‌సభ ముందుకు తేవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం నివేదించింది. ఆయన వెంటనే అందుకు అనుమతించారు. ఈ నేపధ్యంలో.. విభజన బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే మంగళవారం స్పీకర్ మీరాకుమార్‌ను కలిసి సమాచారం అందించారు. మరోవైపు.. కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో విభజన బిల్లుతో పాటు ఇతర కీలక బిల్లుల ఆమోదంపై చర్చించారు. లోక్‌సభలో సొంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన కాంగ్రెస్ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఈ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
నేడు బీజేపీ అగ్రనేతలకు ప్రధాని విందు...
ఇదిలావుంటే.. తెలంగాణ బిల్లు విషయంలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అగ్రనేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపధ్యంలో వారి సహకారం కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అసలు బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని, ఇది పార్లమెంటులో ఆమోదం పొందటం అసాధ్యమేనని తాజాగా బీజేపీ అగ్రనేత ఎల్.కె.అద్వానీ పలువురు నేతలతో వ్యాఖ్యానించటం, బిల్లుకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని ఆ పార్టీ మరో సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అభిప్రాయపడ్డారు. అలాగే.. బిల్లులో ఆర్థికాంశాలు ఉన్నాయన్న విషయం న్యాయశాఖ చెప్పేవరకూ కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు తెలియదా అని మరో సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మండిపడ్డారు. బిల్లు పార్లమెంటు ఆమోదం పొందకపోతే ఆ నెపం తమ మీదకు నెట్టటానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఈ నేపధ్యంలో.. తెలంగాణ బిల్లుతో పాటు కీలకమైన ఆరు బిల్లులను ఆమోదింపజేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతలతో ముఖాముఖి సమావేశం కానుంది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ బీజేపీ అగ్రనేతలు అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలను బుధవారం విందు సమావేశానికి ఆహ్వానించారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఆయా బిల్లుల ఆమోదానికి సహకరించాలని, అందుకోసం బీజేపీ ప్రతిపాదించే సవరణలను పరిశీలిస్తామని ప్రధాని వారిని కోరనున్నట్లు తెలిసింది.