అగర్తలా: గత 2010 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే నిలిపివేయాలని త్రిపుర హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎట్టకేలకు 10, 323 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చే్ద్దామని భావించిన అక్కడి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు మరింత నీరు గార్చాయి. గత నోటిఫికేషన్ లో పోస్టులను రద్దు చేసి తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ చేయాలని మే 7 వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి న్యాయ సలహా కోరేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కు ప్రభత్వం ఆహ్వానం పంపింది. ఈ తీర్పుకు సంబంధించి అక్కడి ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ.. 2010 ఉపాధ్యాయ భర్తీని నిలిపివేయమని హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల నిలుపుదల తీర్పుపై తప్పకుండా తాము సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు.
పోస్టు గ్రాడ్యుయేట్ పరిధిలో 1, 100, గ్రాడ్యుయేట్ పరిధిలో 4, 617, అండర్ గ్రాడ్యుయేట్ పరిధిలో 4, 606 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధం చేసుకున్న తరుణంలో హైకోర్టు తీర్పు త్రిపుర ప్రభుత్వాన్ని డోలాయమాన పరిస్థితిల్లోకి నెట్టింది. కొన్ని ప్రతిపక్షాలు త్రిపుర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ లు హైకోర్టు తీర్పును ప్రశంసించాయి. దీనికి ప్రతిచర్యగా ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.