
దుర్గమ్మకు సారె సమర్పించిన కవిత
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఎంపీ కవిత
సాక్షి, అమరావతి బ్యూరో: మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లేదని నిజామబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీలు కులాల పేరిట రెచ్చగొట్టి.. మహిళపై మహిళలనే ఉసిగొల్పి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్లపై హామీ ఇచ్చినందున.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో కవిత శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మహిళా సాధికారత కోసం దేశ వ్యవస్థలో మార్పులు, సామాజిక అంశాలపై చర్చ జరుగుతోందని.. దేశంలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కావాలని కొందరు చెబుతుండడం దురదృష్టకరమని కవిత వ్యాఖ్యానించారు. అలాంటి ప్రకటనలు మహిళా శక్తిని కించపరచడమేనని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో సామాజిక కారణాలను చూడాలని స్పష్టం చేశారు. మహిళలు హక్కుల కోసం పొరాడితే హింస పెరుగుతోందన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు
ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, దానికి తాము అండగా నిలుస్తామని కవిత చెప్పారు. ప్రస్తుతం ఏపీలో, కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీలు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల హామీల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసిందేనని.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా తప్పక ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు.
దుర్గమ్మకు సారె సమర్పించిన కవిత
సదస్సులో పాల్గొనడానికి ముందు ఎంపీ కవిత.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి.. అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమతో పాటు కుంకుమ భరిణె, పూలు, పండ్లు, వడి బియ్యం సమర్పించారు.
48% ఓటర్లకు 11% ప్రజాప్రతినిధులా?: నటి మనీషా కొయిరాలా
భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 48 శాతంగా ఉంటే పార్లమెంటులో మాత్రం మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 11 శాతంగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘నేను పుట్టినప్పుడు మా తాత ఎంతో బాధపడ్డారట. ఆడపిల్ల పుట్టిందే అని ఆయన ముఖం చిన్నబోయిందట. నేను పెద్ద అయిన తరువాత నాకు ఆ విషయం తెలిసి ఎంతో ఆవేదన చెందా. ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఆ ఆవేదన తీరలేదు. ఇలాంటివాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత యువతులదే’ అన్నారు.