National Women Parliament conference
-
అన్నీ రంగాల్లో మహిళకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇచ్చారు
-
డీజీపీపై చర్యలు తీసుకోండి
⇒ గన్నవరం న్యాయస్థానంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రైవేటు కేసు ⇒ మరో ఐదుగురు పోలీసు అధికారులపైనా ఫిర్యాదు ⇒ మహిళా సదస్సులో పాల్గొనకుండా అడ్డుకున్నారు, బెదిరించారు ⇒ మహిళగా, ఎమ్మెల్యేగా నా హక్కులకు భంగం కలిగించారు గన్నవరం (విజయవాడ): విజయవాడలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనకుండా తనను అక్రమంగా నిర్బంధించి బలవంతంగా హైదరాబాద్‌కు తరలించిన ఉదంతంలో డీజీపీ సాంబశివ రావుతో పాటు మరో ఐదుగురు పోలీసు అధికారులపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు స్వయంగా వచ్చి కేసు వేశారు. ఈ నెల 11న తనను గన్నవరం విమానాశ్ర యంలో బెదిరించి సదస్సుకు హాజరు కాకుం డా అడ్డుకోవడం ద్వారా ఓ మహిళగా, ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగించారని పిటిషన్లో రోజా పేర్కొన్నారు. అందుకు బాధ్యులైన డీజీపీ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఎయిర్‌పోర్టు ఏసీపీ రాజీవ్ కుమార్, నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి, సీఐలు సహేరాబేగం, గౌస్ బేగ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుధాకర్ రెడ్డి, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, న్యాయవాదులు సునీత, రాజశేఖర్, సాయిరాం, గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, కృష్ణా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతితో కలిసి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం కోర్టుకు వచ్చారు. మహిళా ఎమ్మెల్యే హక్కులకు భంగం.. కోర్టు కాల్వర్క్ అనంతరం న్యాయమూర్తి డి.షర్మిలకు సీఆర్పీసీ సెక్షన్ 190, 200 కింద ప్రైవేటు కేసు నమోదు నిమిత్తం రోజా తన ఫిర్యాదు పత్రాలను దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది సుధాకర్‌రెడ్డి కోర్టులో వాదనలను వినిపించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించిన తర్వాత పాల్గొన కుండా అడ్డుకోవడం ద్వారా ఆమె హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు అవ మానించారని న్యాయవాది సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే రోజా హక్కులకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై సెక్షన్ 341, 342, 365, 367 ఐపీసీ, 120 (బి) ఐపీసీ కింద కేసు దాఖలు చేయాలని కోరారు. వాదనల అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి డి.షర్మిల మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఆత్మస్థైర్యంతో అన్నింటా సగం
-
ఆత్మస్థైర్యంతో అన్నింటా సగం
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో వక్తల పిలుపు.. అట్టహాసంగా ప్రారంభం పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ‘అన్నింటా సగం.. అవకాశాల్లో సగం’ కోసం మహిళలు ఆత్మవిశ్వాసం, స్థైర్యంతో ముందడుగు వేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. మాతృత్వానికీ, మానవత్వానికీ చిహ్నమైన మహిళను చిన్నచూపు చూడవద్దని పురుషాధిక్య ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక భద్రతతోనే మహిళలకు సాధికారత అని నినదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సాంకేతిక సంస్థ(పూణే) సంయుక్తంగా ఏర్పాటు చేసిన తొలి జాతీయ మహిళా పార్లమెంట్ మూడు రోజుల సదస్సు శుక్రవారం విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమం వద్ద అట్టహాసంగా ప్రారంభమైంది. అంబేడ్కర్ కల గన్న 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు దక్కినప్పుడే పూర్తి సాధికారత లభించినట్టని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షోపన్యాసంలో చెప్పారు. సదస్సును ప్రారంభించలేకపోయిన ప్రధాని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించలేకపోయారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రభుత్వం మొదట ప్రకటించినా, వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున హాజరు కాలేదని సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా సరే సదస్సును ప్రారంభింపజేసి, ప్రసంగించేలా చూడాలని నిర్వాహకులు భావించారు. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవహారాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని అందుబాటులోకి రాలేదని సమాచారం. దీంతో సదస్సును దలైలామా, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతర ప్రముఖులు కలసి సంయుక్తంగా ప్రారంభించారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి: ఏపీ సీఎం చంద్రబాబు ‘మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. కన్న కలల్ని సాకారం చేసుకునేందుకు కష్టపడాలి. మహిళా సాధికారత సాధించే వరకు నా ప్రభుత్వం మీతో ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించిన ఘనత తమ నాయకుడు ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది తమ అభిమతమని చెప్పారు. మహిళలకు విద్యా, ఉపాధి రంగాలలో 35 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని, మహిళలు విద్యావంతులైతే వరకట్న సమస్యను అధిగమించవచ్చన్నారు. ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల రాయితీలు కుటుంబ పెద్దగా మహిళలకే ఇస్తున్నట్టు చెప్పారు. రాజ్యసభలో బలముంటే ఇచ్చే వాళ్లమే: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాజ్యసభలో తమ పార్టీకి బలం ఉంటే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదింపజేసి ఉండేవాళ్లమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజాస్వామ్య మూలసూత్రాలను మరిచి చట్టసభలను జరగనివ్వకపోవడం మంచిది కాదన్నారు. ప్రతి మహిళలో ఓ పురుషుడు ఉన్నారని (మ్యాన్ ఇన్ ఉమెన్), పురుషాధిక్య సమాజంలో మహిళల్ని చిన్నచూపు చూడడం అమానుషమన్నారు. పురుషు లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా ప్రపంచ వేదికపై మనకు మెడల్స్ తెచ్చి గౌరవాన్ని నిలిపింది మహిళలేనని పీవీ సింధూ తదితర ఒలంపిక్ విజేతలను ఉదహరించారు. కుటుంబం కోసం, పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్న అసంఘటిత రంగంలోని పేద మహిళలే గుర్తింపు లేని హీరోలన్నారు. జనాభాలో 48 శాతం, సీట్లు 11 శాతం : ఇలాబెన్ దేశ జనాభాలో 48 శాతంగా ఉన్న మహిళలకు పార్లమెంట్లో కేవలం 11 శాతం మాత్రమే సీట్లున్నాయని, ఈ పరిస్థితి మారనిదే సమాజంలో మహిళలకు సమాన గౌరవం దక్కదని ప్రముఖ గాంధేయవాది ఇలాబెన్ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సాధికారత దక్కాలంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పరిపాలనలో భాగస్వామ్యం ఉండాల న్నారు. నిర్ణయాధికారం లేనిదే మహిళల సాధికారతకు అర్థం లేదని వివరించారు. శ్రీలంక విద్యావేత్త మేత్రేయి విక్రంసింఘే తన ప్రసంగంలో మహిళలు తమ కలలను నెరవేర్చు కునేందుకు ఉద్యమించాలని ఉద్బోధించారు. వక్తల ప్రసంగాల అనంతరం విదేశాల నుంచి వచ్చిన పలువుర్ని ఘనంగా సన్మానించారు. సదస్సులో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, మిలిందా బిల్ గేట్స్ ఫౌండేషన్ డెప్యూటీ డైరెక్టర్ క్యాథరిన్ హే, శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ చక్రపాణి, ఢిల్లీ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆమె స్ఫూర్తికి ‘స్టాండింగ్ ఒవేషన్’!
స్వచ్ఛమైన మనసే అసలైన అందం అన్న లక్ష్మీ అగర్వాల్ సాక్షి, అమరావతి బ్యూరో: ఢిల్లీకి చెందిన యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. యాసిడ్ దాడులను అడ్డుకోవాలని, బాధితులను ఆదుకోవాలని ఉద్యమించిన సామాజిక కార్యకర్త ఈమె. ఆమె మాటలు అందరిలో స్ఫూర్తినింపుతూ బాధ్యతను గుర్తు చేశాయి. అందుకే సదస్సుకు హాజరైన వారంతా ఆమె ప్రసంగం ముగియగానే లేచి నిల్చొని అభినందించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ ‘అసలు అందమంటే ఏమిటి’అని ఆమె సూటిగా ప్రశ్నించారు. బాహ్య సౌందర్యం అందం కాదని గుర్తించాలని స్పష్టం చేశారు. అందమంటే ఏమిటో కచ్చితంగా పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే సమాజంలో మహిళలపై వివక్ష, దాడులను అడ్డుకోగలమని తేల్చి చెప్పారు. యువతులను అందవిహీనంగా చేసి పైశాచిక ఆనందాన్ని పొందేం దుకే దుండగులు యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారన్నారు. పెళ్లాడాలని తన వెంట పడిన పోకిరీ మాట వినలేదనే తనపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అతనికి న్యాయస్థానం శిక్ష విధించిందని తెలిపారు. దోషులను శిక్షించడంతో ప్రభుత్వం చేతులు దులుపుకోకూడదన్నారు. యాసిడ్ దాడుల బాధితులకు సరైన పునరావాసం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. యాసిడ్ దాడులకు గురైన మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏ సంస్థ కూడా సమ్మతించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు బీపీవోలో ఉద్యోగం ఇచ్చేందుకు ఓ సంస్థ నిరాకరించిన విషయాన్ని ఆమె వెల్లడించారు. స్వచ్ఛమైన మనసుతో కూడిన అంతః సౌందర్యం, ఆత్మవిశ్వాసమే నిజమైన అందం అనే విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఆమె ఉద్బోధించారు. సాధికారతపై ఇంకా మాటలేనా?: బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షర్మిన్ చౌదరి సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం ఉనికిలోకి వచ్చి ఎన్నో ఏళ్లయినా ఇంకా మహిళా సాధికారత గురించి చర్చించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరిన్ షర్మిన్ చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన, సమానత్వం కోసం మహిళలు ప్రారంభించిన ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ మహిళా పార్లమెంటులో ఆమె ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం టెక్నాలజీ టైమ్ నడుస్తోందని, ప్రపంచీకరణతో అన్నిచోట్లా ఇది విస్తరించడంతో అందరి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇంకా మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రతి మహిళలోనూ అనేక నైపుణ్యాలుంటాయని, వాటితోపాటు ఓర్పు, సహనం వారి సొంతమన్నారు. నాయకత్వం మనలోనే ఇమిడి ఉంటుంది: కిరణ్‌బేడి మహిళలకు అవకాశాలు కుటుంబం నుంచి మొదలై పాఠశాల, సమాజ స్థాయిలో వివిధ రకాలుగా వస్తాయని పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడి అన్నారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ముం దుకెళ్లాల్సి ఉంటుందన్నారు. నాయకత్వ స్థాయికి చేరుకోవడంతోపాటు దాన్ని ఉపయోగించుకుని ఎదిగేందుకు ప్రయత్నించాలన్నారు. నాయకత్వం ఎక్కడో బయట ఉండదని, మనలోనే ఉంటుందని తెలిపారు. కెన్యా పార్లమెంట్లో 20 శాతమే: లబొసె తమ దేశ పార్లమెంట్లో మహిళల భాగస్వామ్యం 20 శాతమే ఉందని కెన్యా డిప్యూటీ స్పీకర్ జొయ్‌సె లబొసె చెప్పారు. 30 శాతం మంది మహిళలను పార్లమెంట్‌కు నడిపించేందుకు తాము పోరాటం చేస్తున్నామన్నారు. అనేక దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని, తమ హక్కు ల కోసం మహిళలు పోరాడాలని కోరారు. -
మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఏదీ?
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో ఎంపీ కవిత సాక్షి, అమరావతి బ్యూరో: మహిళా రిజర్వేషన్ల విషయంలో రాజకీయ పార్టీల్లో చిత్తశుద్ధి లేదని నిజామబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పార్టీలు కులాల పేరిట రెచ్చగొట్టి.. మహిళపై మహిళలనే ఉసిగొల్పి రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మహిళా రిజర్వేషన్లపై హామీ ఇచ్చినందున.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో కవిత శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మహిళా సాధికారత కోసం దేశ వ్యవస్థలో మార్పులు, సామాజిక అంశాలపై చర్చ జరుగుతోందని.. దేశంలోనే మొట్టమొదటగా ఏర్పాటు చేసిన ఈ సదస్సు స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. మహిళలు వంటింటికే పరిమితం కావాలని కొందరు చెబుతుండడం దురదృష్టకరమని కవిత వ్యాఖ్యానించారు. అలాంటి ప్రకటనలు మహిళా శక్తిని కించపరచడమేనని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడుల విషయంలో సామాజిక కారణాలను చూడాలని స్పష్టం చేశారు. మహిళలు హక్కుల కోసం పొరాడితే హింస పెరుగుతోందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అని, దానికి తాము అండగా నిలుస్తామని కవిత చెప్పారు. ప్రస్తుతం ఏపీలో, కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ–బీజేపీలు ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల హామీల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసిందేనని.. ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా తప్పక ఇవ్వాల్సి ఉందని స్పష్టం చేశారు. దుర్గమ్మకు సారె సమర్పించిన కవిత సదస్సులో పాల్గొనడానికి ముందు ఎంపీ కవిత.. విజయవాడ దుర్గమ్మను దర్శించుకుని సారె సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి.. అమ్మవారికి పట్టుచీర, పసుపు, కుంకుమతో పాటు కుంకుమ భరిణె, పూలు, పండ్లు, వడి బియ్యం సమర్పించారు. 48% ఓటర్లకు 11% ప్రజాప్రతినిధులా?: నటి మనీషా కొయిరాలా భారతదేశంలో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపై బాలీవుడ్ సినీ నటి మనీషా కొయిరాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దేశంలో మహిళా ఓటర్ల సంఖ్య 48 శాతంగా ఉంటే పార్లమెంటులో మాత్రం మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య 11 శాతంగా ఉండడం సరికాదని అభిప్రాయపడ్డారు. ‘నేను పుట్టినప్పుడు మా తాత ఎంతో బాధపడ్డారట. ఆడపిల్ల పుట్టిందే అని ఆయన ముఖం చిన్నబోయిందట. నేను పెద్ద అయిన తరువాత నాకు ఆ విషయం తెలిసి ఎంతో ఆవేదన చెందా. ఎంత ఉన్నత స్థాయికి చేరినా ఆ ఆవేదన తీరలేదు. ఇలాంటివాటికి జవాబు చెప్పాల్సిన బాధ్యత యువతులదే’ అన్నారు. -
మహిళా నాయకత్వంతోనే సమాజ శాంతి
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ గ్రహీత దలైలామా - ప్రేమ, జాలిని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు - అలాంటి వారి పట్ల వివక్ష తగదు.. సమస్యలకు చర్చే పరిష్కారం - మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి - ప్రస్తుత విద్యా వ్యవస్థ అంతా వ్యాపారమయం - మనసు ప్రశాంతంగా ఉంటే బాహ్య ప్రపంచమూ బాగుంటుంది పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఈ ప్రపంచంలోని సగం దేశాలకైనా మహిళలు నాయకత్వం వహించినప్పుడే సమాజం శాంతియుతంగా ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, నోబెల్ గ్రహీత దలైలామా హితవు పలికారు. వ్యథాభరిత సమాజం నుంచి విముక్తి కావాలని ఆకాంక్షించారు. మానవతా విలువల్ని ప్రోది చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 20వ శతాబ్దంలో తప్పు ఎక్కడ దొర్లిందో విశ్లేషించాల్సిన తరుణమిదేనన్నారు. వేదన, క్షోభ స్థానంలో జాలి, దయ వంటి లక్షణాలున్న సమాజ స్థాపన కోసం పాటుపడాలన్నారు. విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమంలో శుక్రవారం ప్రారంభమైన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన దలైలామా కీలకోపన్యాసం చేశారు. ‘నేను మామూలుగా సోదరీ సోదరులారా అని సమావేశాలను ప్రారంభిస్తుంటాను. కానీ ఈసారి ఓపక్క వేదికపై పెద్దక్కలు, సోదరీ మణులు, మరికొందరు సోదరులు ఉన్నందున ఎల్డర్ సిస్టర్స్, సిస్టర్స్, ఫ్యూ బ్రదర్స్ అంటూ ప్రారంభిస్తున్నా. ఏమైనా మనమందరం మానవులం. మనందరికీ మానసిక, భౌతిక, భావోద్వేగాలుంటాయి. మానవత్వమే మానవ సమాజ సందేశం. సమాజంలో చాలా సమస్యలుంటాయి. ఇవేవీ అప్పటికప్పుడు శైశవ దశలో సృష్టించినవి కావు. ఎదుగుతున్న క్రమంలో వచ్చినవే జాతి, మతం, విశ్వాసం, విరోధం, స్త్రీ, పురుష వివక్ష తదితరాలు. కానీ ప్రాథమికంగా మనమందరం ఒక్కటే. పటిష్టమైన విశ్వాసాలు, మానవులందరూ ఒక్కటేనన్న భావన ప్రాతిపదికన నిజమైన సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించాలన్నది నా అభిమతం. స్త్రీ కూడా మనిషే. సమాజ పరిణామ క్రమంలో కుటుంబాలతో పాటు జనసాంద్రత పెరిగింది. వ్యవసాయ వ్యవస్థలు వచ్చాయి. దాంతోపాటే సమాజంలో చోరీలు, దోపిడీలు వంటి అవలక్షణాలు అధికమయ్యాయి. వీటిని నియంత్రించేందుకు నాయకత్వం కావాల్సి వచ్చింది. అప్పుడు విద్య లేదు కనుక భౌతికంగా ఎవరు శక్తివంతులైతే వారి చేతికే నాయకత్వం దక్కేది. మతం పుట్టుక కూడా ఆ దశలో నుంచి వచ్చిందే. ఇప్పుడు వాటిని సమీక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది’అన్నారు. ప్రేమ, జాలి, క్షమ గుణాలున్న విద్య అవసరం ప్రస్తుత విద్యా వ్యవస్థ వ్యాపారమయమై, భౌతిక అవసరాలే ప్రాతిపదికగా ఉందని దలైలామా ఆవేదన వ్యక్తం చేశారు. ‘మానవ విలువలకు స్థానం లేకుండా పోతోంది. ఎంతసేపూ ఆదాయం, డబ్బు చుట్టూనే తిరుగుతోంది. జాలి, దయ కలిగిన మానవ సమాజాన్ని సృష్టించాలి. ప్రేమ, జాలి, కనికరం, క్షమ వంటి విషయాలున్న విద్య నేటి అవసరం. ఇటువంటి విలువల్ని ప్రోత్సహించడంలో మాతృమూర్తిని మించిన వారు లేరు. అటువంటి వ్యక్తి పట్ల వివక్ష తగదు. గత శతాబ్దంలో జరిగిన హింస, వివక్షకు తావులేకుండా ప్రస్తుత 21వ శతాబ్దాన్ని నిర్మించుకోవాలి. చిన్న తనం నుంచే మానవతా విలువలు నేర్పాలి. మితిమీరిన హింసకు, మానవ హననానికీ తావు లేకుండా చూడాలి. జాతి, మతం, వర్ణం, వివక్ష పేరిట జరిగే హింసపై మనం ఆలోచించాల్సిన సమయం ఇది. 21వ శతాబ్దంలో శాంతియుత సమాజం కావాలి. దానికి మనశ్శాంతి అవసరం. అది ఉన్నప్పుడు సమాజ శాంతి కూడా సాధ్యమవుతుంది. ఈ శతాబ్దం కేంద్ర బింధువు చర్చ (డైలాగ్) కావాలి. తప్పుడు అభిప్రాయాలతో కాకుండా అవగాహనతో ముందుకు సాగాలి. చర్చలు, సంప్రదింపులే పరిష్కార మార్గాలు. ఆయుధం లేని సమాజం కావాలి. ఈ ప్రపంచం నిరాయుధ ప్రపంచంగా ఉండాలి. అది మన మనస్సుతోనే ప్రారంభం కావాలి. ఇతరుల బాధ, క్షోభను అర్థం చేసుకోవడంలో మహిళలు చాలా సున్నితంగా ఉంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూగోళంపై 200 దేశాలున్నాయి. మహిళా నేతలు మరింత మంది వస్తే ఈ ప్రపంచం అంత భద్రంగా ఉంటుంది. అందుకే మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంద’న్నారు. -
అమరావతి సత్తా చూపిస్తాం: కోడెల
అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలతో ఏపీ నూతన రాజధాని అమరావతి సత్తా ప్రపంచానికి చూపుతామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం విజయవాడ గేట్‌వే హోటల్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమావేశాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపారు. రాజకీలయాలకతీతంగా మహిళా ఉన్నతే లక్ష్యంగా ఏపీ శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పూణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుందని వివరించారు. పదివేలమంది విద్యార్థులతో పాటు యూనెస్కో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానుంది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాగా, ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్న 400 పైగా మహిళా పార్లమెంట్, శాసన సభ్యులు పాల్గొంటారు.