అమరావతి సత్తా చూపిస్తాం: కోడెల
అమరావతి: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలతో ఏపీ నూతన రాజధాని అమరావతి సత్తా ప్రపంచానికి చూపుతామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం విజయవాడ గేట్‌వే హోటల్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సమావేశాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష జరిపారు. రాజకీలయాలకతీతంగా మహిళా ఉన్నతే లక్ష్యంగా ఏపీ శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పూణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తుందని వివరించారు. పదివేలమంది విద్యార్థులతో పాటు యూనెస్కో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానుంది. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌తో పాటు మంత్రులు పాల్గొన్నారు. కాగా, ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో జరిగే ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఉన్న 400 పైగా మహిళా పార్లమెంట్, శాసన సభ్యులు పాల్గొంటారు.