డీజీపీపై చర్యలు తీసుకోండి
⇒ గన్నవరం న్యాయస్థానంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రైవేటు కేసు
⇒ మరో ఐదుగురు పోలీసు అధికారులపైనా ఫిర్యాదు
⇒ మహిళా సదస్సులో పాల్గొనకుండా అడ్డుకున్నారు, బెదిరించారు
⇒ మహిళగా, ఎమ్మెల్యేగా నా హక్కులకు భంగం కలిగించారు
గన్నవరం (విజయవాడ): విజయవాడలో నిర్వహించిన జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో పాల్గొనకుండా తనను అక్రమంగా నిర్బంధించి బలవంతంగా హైదరాబాద్‌కు తరలించిన ఉదంతంలో డీజీపీ సాంబశివ రావుతో పాటు మరో ఐదుగురు పోలీసు అధికారులపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రైవేటు కేసు దాఖలు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రోజా మంగళవారం కృష్ణా జిల్లా గన్నవరం జూనియర్ అదనపు సివిల్ జడ్జి కోర్టుకు స్వయంగా వచ్చి కేసు వేశారు. ఈ నెల 11న తనను గన్నవరం విమానాశ్ర యంలో బెదిరించి సదస్సుకు హాజరు కాకుం డా అడ్డుకోవడం ద్వారా ఓ మహిళగా, ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగించారని పిటిషన్‌లో రోజా పేర్కొన్నారు.
అందుకు బాధ్యులైన డీజీపీ, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్, ఎయిర్‌పోర్టు ఏసీపీ రాజీవ్ కుమార్, నార్త్ జోన్ ఏసీపీ శ్రావణి, సీఐలు సహేరాబేగం, గౌస్ బేగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుధాకర్ రెడ్డి, వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, న్యాయవాదులు సునీత, రాజశేఖర్, సాయిరాం, గుంటూరు జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, కృష్ణా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతితో కలిసి ఎమ్మెల్యే రోజా మంగళవారం ఉదయం 10.30కి గన్నవరం కోర్టుకు వచ్చారు.
మహిళా ఎమ్మెల్యే హక్కులకు భంగం..
కోర్టు కాల్‌వర్క్ అనంతరం న్యాయమూర్తి డి.షర్మిలకు సీఆర్‌పీసీ సెక్షన్ 190, 200 కింద ప్రైవేటు కేసు నమోదు నిమిత్తం రోజా తన ఫిర్యాదు పత్రాలను దాఖలు చేశారు. ఆమె తరఫున సీనియర్ న్యాయవాది సుధాకర్‌రెడ్డి కోర్టులో వాదనలను వినిపించారు. జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించిన తర్వాత పాల్గొన కుండా అడ్డుకోవడం ద్వారా ఆమె హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసులు అవ మానించారని న్యాయవాది సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే రోజా హక్కులకు భంగం కలిగించిన పోలీసు అధికారులపై సెక్షన్ 341, 342, 365, 367 ఐపీసీ, 120 (బి) ఐపీసీ కింద కేసు దాఖలు చేయాలని కోరారు. వాదనల అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి డి.షర్మిల మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు. రాష్ట్రంలోని మహిళలకు రక్షణ కల్పించడంలో పోలీస్ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తంచేశారు.