నిస్సిగ్గుగా అరాచకం | Shameless anarchy of TDP government | Sakshi
Sakshi News home page

నిస్సిగ్గుగా అరాచకం

Published Sun, Feb 12 2017 3:04 AM | Last Updated on Mon, Oct 29 2018 8:10 PM

నిస్సిగ్గుగా అరాచకం - Sakshi

నిస్సిగ్గుగా అరాచకం

ఎమ్మెల్యే రోజాపై సర్కారు నిరంకుశం.. మహిళా పార్లమెంట్‌కు రాకుండా అడ్డగింత

రెండు ఆహ్వానాలు.. నాలుగు అవమానాలు...
దలైలామా వస్తున్నారని... ప్రత్యేకంగా తీసుకెళ్తామని..
గన్నవరం విమానాశ్రయంలో హైడ్రామా
బలవంతంగా పోలీసు వాహనంలో తరలింపు
విజయవాడ అంటూ గుంటూరువైపు పయనం
పేరేచర్ల వద్ద వాహనం దూకి సాయం కోసం రోజా అర్థింపు
జనాన్ని బెదిరించి తిరిగి వాహనంలో కుక్కిన ఖాకీలు
కిందపడిపోయిన ఎమ్మెల్యేను వాహనం వరకు ఈడ్చివేత
ఆమె రోజా కాదు నక్సలైట్‌ అంటూ అబద్ధాలు..
హైదరాబాద్‌ నివాసం వద్ద రోజాను వదలివెళ్లిన పోలీసులు

దారుణం.. దుర్మార్గం..అమానవీయం.. అత్యంత హేయం..మధ్యయుగాలనాడు కూడా ఇలాంటి నిర్బంధం కనీవిని ఎరగం...జనం చూస్తారన్న భయం లేదు... ఛీత్కరిస్తారన్న వెరపు లేదు..మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఓ మహిళా ఎమ్మెల్యే పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు..తాలిబాన్‌ పాలనే మెరుగన్నట్లు ప్రభుత్వం, పోలీసులు...అరాచకం సృష్టించారు.మహిళా సాధికారత పేరుతో కోట్లు వెచ్చించి నిర్వహిస్తున్న సదస్సు సాక్షిగా..అందులో పాల్గొనేందుకు వచ్చిన మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వం అత్యంత అమానుషంగా వ్యవహరించింది. మహిళా సమస్యలపై మాట్లాడే గొంతును కర్కశంగా నులిమే ప్రయత్నం చేసింది.మహిళా పార్లమెంటుకు ఎమ్మెల్యే రోజాను ఆహ్వానించిన ప్రభుత్వం.. విమానాశ్రయంలోనే పోలీసులను మోహరించి, అడ్డగించింది.కారణం చెప్పకుండా.. నిర్బంధించి.. వ్యక్తిగత సిబ్బందిని దూరం చేసి.. వాహనాలు మార్చుతూ, జిల్లాలు తిప్పుతూ.. బెదిరిస్తూ.. హైదరాబాద్‌కు తరలించడం చూసి రాష్ట్రమంతా నివ్వెరపోయింది..మహిళల పట్ల తాము ఎంత కర్కశంగా వ్యవహరించగలమో మహిళా ఎమ్మెల్యే రోజా విషయంలో వ్యవహరించిన తీరుతో బాబు సర్కారు మరోమారు రుజువు చేసుకుంది..

సాక్షి నెట్‌వర్క్‌ : మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానంతో వెళుతున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్‌కె రోజాను శనివారం గన్నవరం విమానాశ్రయంలో పోలీసులు అడ్డగించారు. ఆ తర్వాత అత్యంత దుర్మార్గంగా, బలవంతంగా హైదరాబాద్‌ తరలించారు. రెండు ఇన్విటేషన్లు పంపిన ప్రభుత్వం విమానాశ్రయంలో రోజాను అదుపులోకి తీసుకుని హైడ్రామా నడిపించింది. దలైలామా వస్తున్నారని కాసేపు.. ప్రత్యేక వాహనంలో తరలిస్తున్నామని కాసేపు... నిరీక్షించేలా చేసి కనీసం ఎక్కడికి తీసుకుపోతున్నారో కూడా చెప్పకుండా వెనుకమార్గం గుండా పోలీసు వాహనంలో తరలించారు. విజయవాడలో మీకు కేటాయించిన వసతికి తీసుకెళ్తున్నామని చెబుతూ గుంటూరు జిల్లా మీదుగా ఆమెను హైదరాబాద్‌ తరలించారు.

(చదవండి  : నన్ను.. చంపేస్తారేమో )

తనను నిర్బంధించి తరలిస్తున్న సంగతిని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియ జేసేందుకు యత్నించిన రోజా ఫోన్‌ను పోలీసులు లాగేసుకుని దురుసుగా ప్రవర్తించారు. ప్రభుత్వ నిరంకుశ పోకడలను నిరసిస్తూ వాహనం నుంచి దిగేందుకు యత్నించిన ఆమెను వాహనంలోకి  ఈడ్చేశారు. తోపులాటలో ఆమె వాహనం నుంచి కిందపడిపోయినా.. గాయాలవుతున్నా కర్కశ ఖాకీలు లెక్కచేయలేదు. దురుసుగా వాహనంలోకి నెట్టేశారు. ఆమె ఏ నేరం చేశారని ప్రశ్నించిన స్థానికులనూ బెదిరించారు. అసలు ఆమె రోజా కాదు నక్సలైట్‌ అని అబద్దపు వ్యాఖ్యలూ చేశారు. దారులు మారుస్తూ.. ముందుకుసాగారు. పోలీసు వాహనాన్ని అడ్డుకుని తమ నాయకురాలిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ శ్రేణులను, అభిమా నులను చెదరగొడుతూ రోజాను హైదరాబాద్‌లోని ఆమె నివాసం వద్ద విడిచిపెట్టారు.

సామాజిక మాధ్యమంలో రోజా చేసిన వ్యాఖ్యల వల్లే ఆమెను జాతీయ మహిళా పార్లమెంటుకు హాజరు కాకుండా అడ్డుకుని వెనక్కు పంపేశామని డీజీపీ సాంబశివ రావు పేర్కొనడం చూసి జనం నివ్వెరపోతున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు రోజాను నిర్బంధించిన తీరు అద్దం పడుతోందని విశ్లేషకులంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధిః అని వ్యాఖ్యానిస్తున్నారు.. శనివారం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన రోజా నిర్బంధం, తరలింపు వ్యవహారం ఎలా సాగిందంటే...

విమానాశ్రయంలోనే నిర్బంధం..
విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో రెండోరోజు చర్చా గోష్టిలో పాల్గొనాలని స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు కొన్నిరోజుల క్రితం నగరి ఎమ్మెల్యే రోజాకు ఆహ్వానపత్రం పంపారు. దీంతో ఆమె హైదరాబాద్‌ నుంచి శనివారం ఉదయం 8గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.కానీ రోజాను అడ్డుకునేందుకు ప్రభుత్వం విమానాశ్రయంలోనే హైడ్రామాకు తెరతీసింది. కొత్త టెర్మినల్‌ భవనం నుంచి బయటకు వస్తున్న రోజాను ఏసీపీ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ వెళ్లేందుకు బౌద్ధుల ఆధ్యాత్మికగురువు దలైలామా వస్తున్నందున అరగంట పాటు లాంజ్‌రూమ్‌లో విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ఆమెను కోరారు. పోలీసుల విజ్ఞప్తి మేరకు రోజా లాంజ్‌రూమ్‌ వద్దకు వెళ్లారు.

కానీ ఆమెను దాదాపు గంటకుపైగా బయటకు రానీయకుండా పోలీసులు అక్కడే నిర్భదించారు. రోజా కోసం  వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా  మహిళా విభాగం అధ్యక్షురాలు కైలే జ్ఞానమణి పంపించిన కారును పోలీసులు అనుమతించలేదు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో విజయవాడలో బస ఏర్పాటు చేసిన హోటల్‌కు పంపిస్తామని రోజాకు చెప్పారు. అందుకు ఆమె నిరాకరించినప్పటికీ మహిళా సీఐతో పాటు పలువురు సిబ్బంది ఆమెను పోలీసు వాహనం లోకి  ఎక్కించి పాత టెర్మినల్‌ వైపు తీసుకువెళ్లారు. ఆమెతోపాటు వాహనం ఎక్కిన పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌యాదవ్, వ్యక్తిగత సిబ్బందిని పాత టెర్మినల్‌ గేటు వద్ద దించి వేశారు. ఒక్క రోజాను మాత్రమే వాహనంలో విజయవాడ వైపుగా తీసుకువెళ్లారు. మీడియా కంట పడకుండా టెర్మినల్‌ ముందువైపు కాకుండా వెనుక నుండి తరలించారు. విమానాశ్రయంలో ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలెవరూ తమ వాహనాన్ని అనుస రించకుండా పోలీసులు పథకం ప్రకారం వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ నేతల సెల్‌ ఫోన్‌లను, కారు తాళాలను లాక్కున్నారు.

అంతా గోప్యమే...
విమానాశ్రయం నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా పోలీసులు హైడ్రామా కొనసాగించారు. రోజాను ప్రభుత్వం విజయవాడలో ఏర్పాటు చేసిన బసకు తీసుకువెళ్తామని చెప్పిన పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వాహనాన్ని విజయవాడ మీదుగా గుంటూరు వైపు తీసుకువెళ్లారు. తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నారని ఆమె ప్రశ్నించినప్పటికీ బదులివ్వలేదు. వాహనాన్ని జాతీయరహదారి మీదున్న బైపాస్‌ రోడ్డులోకి మళ్లించారు. అంకిరెడ్డిపాలెం, నల్లపాడు మీదుగా పేరేచర్ల జంక్షన్‌ మీదుగా హైదరాబాద్‌ వైపు సాగారు..

కిందపడ్డా కనికరించని పోలీసులు..
వెళ్తున్న మార్గాన్ని బట్టి తనను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు రోజా గుర్తించారు. దాంతో గుంటూరు జిల్లా పేరేచర్లలో స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద వేగం తగ్గగానే వాహనం దిగేందుకు ప్రయత్నించారు. తనను పోలీసులు కిడ్నాప్‌ చేసి తీసుకెళుతున్నారని పెద్దగా కేకలు వేశారు. దాంతో స్థానికులు ఉలిక్కిపడి భారీగా అక్కడకు చేరుకున్నారు.  స్థానికులు తిరగబడకముందే జారుకోవాలని పోలీసులు రోజా పట్ల అమానుషంగా వ్యవహరించారు. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఆమెను బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వాహనంలో పడేశారు. తనను వదిలిపెట్టాలని రోజా కన్నీటి పర్యంతమైనప్పటికీ పోలీసులు కనికరించలేదు. వాహనం వద్దకు రాబోతున్న స్థానికులను పోలీసులు లాఠీలు ఝళిపిస్తూ చెదరగొట్టి భయానక వాతావరణం సృష్టించారు.  

రోజా కాదు నక్సలైట్‌ అంటూ వ్యాఖ్యలు..
రోజాను బలవంతంగా ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించిన స్థానిక మహిళలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అక్కడ గుమికూడిన స్థానిక మహిళలతో ‘ఆమె రోజా కాదు.. నక్సలైటు’ అంటూ పోలీసులు వ్యాఖ్యానించడంతో కలకలం చెలరేగింది. అసలు అక్కడ ఏం జరుగుతోందో కొంతసేపు అర్థం కాని స్థితి ఏర్పడింది. కళ్లెదురుగా రోజా కనిపిస్తున్నా ఆమె నక్సలైట్‌ అని పోలీసులు చెప్పడం స్థానికులను విభ్రాంతికి గురిచేసింది. రోజాపై ప్రభుత్వం ఏస్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందో దీనిని బట్టి అర్థమవుతోందని పలువురు చర్చించుకోవడం కనిపించింది. ఎక్కువ సేపు ఉంటే స్థానికుల నుంచి ప్రతిఘటన తప్పదని భావించిన పోలీసులు వాహనాన్ని మేడికొండూరు మీదుగా సత్తెనపల్లి వైపు మళ్లించారు.

దారులు మళ్లిస్తూ: రోజాను పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు అక్కడికి  చేరుకున్నారు. రోజాను తీసుకెళుతున్న పోలీసు వాహనాల కాన్వాయ్‌ మధ్యాహ్నం 12.50గంటలకు పిడుగురాళ్లకు చేరుకుంది. కానీ అక్కడ వైఎస్సార్‌ సీపీ నేతలు ఉండటంతో పోలీసులు వాహనాన్ని అపకుండా వేగంగా  దాచేపల్లి వైపు మళ్లించారు. ఏం జరుగుతుందో వైఎస్సార్‌ సీపీ నేతలు తెలుసుకునే లోపే పోలీసు వాహనాలు పిడుగురాళ్ల దాటాయి. సత్తెనపల్లి డీఎస్పీ మధుసూదనరావు ఆధ్వర్యాన పోలీసులు రోజాను పిడుగురాళ్ల మీదుగా దాచేపల్లి వైపు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నేతలు కాసు మహేష్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తిలతోపాటు దాదాపు 300 మంది కార్యకర్తలు దాచేపల్లిలో రోడ్డుపై బైఠాయించారు. రోజాను విడిచిపెట్టాలని రాస్తారోకోకు దిగారు.

విషయం తెలుసుకున్న పోలీసులు శాంతినగరం వద్ద తమ వాహనాలను కొంత సేపు నిలిపివేశారు. వాహనాలను వెనక్కు తిప్పి తుమ్మల చెరువు వద్దకు చేరుకున్నారు.  అనంతరం మళ్లీ వాహనాలను వెనక్కు తిప్పి దాచేపల్లి వైపు వెళ్లారు. దీంతో రోజాను హైదరాబాద్‌ తరలిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ నేతలు గుర్తించారు. కాసు మహేష్‌రెడ్డి, జంగా కృష్ణమూర్తి, ఇతర నేతలు, కార్యకర్తలు దాచేపల్లి పోలీసుస్టేషన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. ఆందోళన ఉధృతిని గుర్తించిన పోలీసులు భారీగా మోహరించారు. నాయకులు, కార్యకర్తలను బలవంతంగా పోలీసు స్టేషన్‌కు తరలించారు. తద్వారా రోజాను తరలిస్తున్న పోలీసు వాహనాలను ఎవ్వరూ అడ్డగించకుండా కట్టడి చేశారు. ఆ తరువాత పది నిముషాలకు రోజాను తీసుకువెళ్తున్న పోలీసు వాహనాలు  దాచేపల్లి మీదుగా హైదరాబాద్‌ వైపు దూసుకువెళ్లాయి.

పొందుగల వద్ద ఉన్న అంతర్రాష్ట్ర  సరిహద్దు చెక్‌పోస్టు దాటించే వరకు గురజాల, సత్తెనపల్లి డీఎస్పీలు, సీఐలు ఆ వాహనాల వెన్నంటే ఉన్నారు. రోజాను బలవంతంగా తరలిస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.  కాగా, ఎయిర్‌పోర్టులో నిర్బంధించి.. వ్యక్తిగత సిబ్బంది లేకుండా.. ఎటువైపు తీసుకుపోతున్నారో కూడా చెప్పకుండా తరలిస్తున్నా ఎమ్మెల్యే రోజా  ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ సమయంలో ఆమె పోలీస్‌ వాహనంలో నుంచే మాట్లాడుతూ తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా సెల్ఫీ వీడియోలు తీసి మీడియాకు పంపించారు.

సామాజిక మాధ్యమంలో వ్యాఖ్యలు నేరమా!
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్‌.కె.రోజాను విమానాశ్రయంలోనే నిర్బంధించి వెనక్కి పంపేయడానికి రాష్ట్ర డీజీపీ ఎన్‌.సాంబశివరావు చెబుతున్న కారణాలు సరైనవిగా అనిపించడం లేదని విశ్లేషకులంటున్నారు. రోజా సామాజిక మాధ్యమంలో జాతీయ మహిళా పార్లమెంటు నిర్వాహకులు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని, అందు వల్లనే ఆమెను సదస్సుకు వెళ్లకుండా అరెస్టు చేయాల్సి వచ్చిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలతో డీజీపీ చెప్పారు. వాస్తవానికి రోజా ఫేస్‌బుక్‌లో చేసిన వ్యాఖ్యలు చూస్తే అవేమీ అభ్యంతరకరమైనవి కానే కావని విశ్లేషకులంటున్నారు. కోడెల శివప్రసాదరావు కోడలు తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఉదంతం విడియో కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ వీడియోను ఆమె తన ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ఈ కింది వ్యాఖ్యలు చేశారు.

‘చిత్తశుద్ధి లేని శివపూజలేల....’
‘‘ఇంట్లో కోడలిని వేధించే వాళ్లు... రోడ్డెక్కినా మహిళ ఆర్తనాదాన్ని వినని వాళ్లు... అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ లేనంత నిరంకుశంగా మహిళా ఎమ్మెల్యేను ఏడాది పాటు సస్పెండ్‌ చేసినోళ్లు... బండి షెడ్లో ఉండాలి. ఆడది ఇంట్లో ఉండాలి అనే పనికిమాలిన సిద్ధాంతాలను మాట్లాడే వాళ్లూ...వీళ్లా  మహిళా పార్లమెంటును నిర్వహించేది... వీళ్లా  మహిళా సాధికారత కోసం మాట్లాడేది.. ఎంత మాట. ఎంత మాట...’’ ఈ వ్యాఖ్యల్లో సాటి మహిళ ఆవేదనకు స్పందించి చేసిన  మాదిరిగా ఉన్నాయి తప్పితే ఎక్కడా అభ్యంతరకరంగా లేవని విశ్లేషకులంటున్నారు. పైగా కొద్ది రోజులుగా పలు రాజకీయ పక్షాలు కూడా మహిళా పార్లమెంటు నిర్వహణ తీరుపై తప్పు పడుతూ విమర్శలు చేస్తున్నాయి. అవన్నీ తప్పు కానపుడు డీజీపీకి రోజా సోషల్‌ మీడియా చేసిన వ్యాఖ్యలు తప్పుగా అనిపించడం చూస్తే మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామా! లేక నియంతల యుగంలో ఉన్నామా? అన్న అనుమానాలు కలుగక మానవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement