నన్ను.. చంపేస్తారేమో
మీడియా ఎదుట విలపించిన రోజా
⇒ నన్ను చంపేస్తే నా పిల్లలకు దిక్కెవరు?
⇒ సదస్సుకు ఆహ్వానించి పోలీసులతో నిర్బంధిస్తారా?
⇒ స్పీకర్ కోడలి ఆర్తనాదాలు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తే తప్పా?
⇒ మహిళల హక్కుల్ని స్పీకరే హరిస్తే ఎవరికి చెప్పాలి
⇒ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే అవకాశమిస్తామని డీజీపీ అనడం దారుణం
సాక్షి, అమరావతి: ‘‘తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది. నన్ను చంపేయరని గ్యారంటీ లేదు.’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆందోళన వ్యక్తం చేశారు. తనను జాతీయ మహిళా పార్లమెంటుకు ఆహ్వానించి ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో పోలీసులు కారులో ఎక్కించుకుని సదస్సుకు హాజరు కాకుండా అరెస్టు చేయడం చూస్తే మహిళలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి రక్షణ ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. తనను అరెస్టుచేసి సదస్సుకు రాకుండా అడ్డుకున్న ఘటనపై శనివారం లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వివరించారు.
(చదవండి : ఎమ్మెల్యే రోజా నిర్బంధం )
మహిళా పార్లమెంటు జరుగుతున్న రోజున తనను ఆ సదస్సుకు రానివ్వకుండా అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరమైన రోజని రోజా అన్నారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్య మహిళలకు ఎలాంటి రక్షణ ఉంటుందని సూటిగా ప్రశ్నించారు. ‘‘నేనేమైనా ఉగ్రవాదినా? నా వద్ద బాంబులున్నాయా? కత్తులున్నాయా? ఏమీ లేకుండానే ఆహ్వానం పంపించి ఎందుకు అరెస్టు చేశారు? నేనంటే చంద్రబాబుకు, స్పీకర్‌కు ఎందుకంత భయం’’ అని రోజా ప్రశ్నించారు. ప్రజల మాన ప్రాణాలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ముఖ్యమంత్రికి తొత్తులుగా మారి తన అరెస్టు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..
విజయవాడలో సదస్సు పెట్టి..
‘‘నేరాలు తీవ్రంగా పెరుగుతున్న విజయవాడలో మహిళా సదస్సు పెట్టారు. అక్కడికి నేను వెళితే ఉగ్రవాదిలాగా నిర్బంధించారు. ఇది ప్రజల డబ్బుతో నిర్వహిస్తున్న సదస్సు. ప్రజాప్రతినిధిగా పాల్గొనే హక్కు నాకు ఉంది. అయినా అడ్డుకున్నారంటే ఈ ప్రభుత్వ దుర్మార్గం ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఎందుకయ్యా చంద్రబాబు, స్పీకర్‌గారు నేనంటే అంత భయం? ప్రతిపక్షం అనేది ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిచూపుతూనే ఉంటుంది. దీనికి భయపడి మహిళలను అడ్డుకుంటారా? అసెంబ్లీలో మహిళా సమస్యలపై మాట్లాడితే అడ్డుకున్నారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో మహిళలను వ్యభిచార కూపంలో దించుతుంటే అసెంబ్లీలో గళమెత్తినందుకు నన్ను నిబంధనలకు విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెం డ్ చేశారు, ఇప్పుడు జరుగుతున్న మహిళా సదస్సులో నేను పాల్గొంటే ఎక్కడ మహిళా సమస్యలపై మాట్లాడతానోనని భయపడి అడ్డుకున్నారు. రాష్ట్రంలో జరిగే ప్రతి అత్యాచారం, దాడుల వెనక ఎవరో ఒకరు తెలుగుదేశం నేత ఉన్నారు.
ఇంట్లో కోడలు ఆర్తనాదాలు గుర్తుకు రాలేదా?
మహిళా సాధికారత అంటూ పార్లమెంటు నిర్వహిస్తున్న స్పీకర్...తన సొంత కోడలిని వేధింపులకు గురిచేయడం ఏ తరహా మహిళా సాధికారతో చెప్పాలి. స్పీకర్ తన కోడలిపై వ్యవహరించిన తీరుపై ఆమె చేసిన ఆర్తనాదాల వీడియోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తే తప్పా? ఇంట్లో ఆర్తనాదాలు, అమరావతిలో నీతులు మాట్లాడతావా?. రెండు రోజుల క్రితమే కారు షెడ్‌లో ఉండాలి, మహిళలు ఇంట్లో ఉండాలని స్పీకర్ మాట్లాడిన తీరు మహిళా లోకాన్ని బాధించింది. మహిళా పార్లమెంటులో ఒక్క మహిళ బాధనైనా విన్నారా? మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించారా? భజన చేయించు కోవడానికా మీరు పిలిచింది...ఒక వనజాక్షినో, రిషితేశ్వరి తల్లినో, జానీమూన్‌నో పిలిచి మాట్లాడించి ఉంటే బాగుండేది.
నన్ను చంపేస్తే నా పిల్లలకు దిక్కెవరు?
మహిళా పార్లమెంటు నిర్వహించే నైతిక హక్కు చంద్రబాబుకు, స్పీకర్‌కు లేనే లేదు. అసెంబ్లీలో మాట్లాడితే రూల్సుకు విరుద్ధంగా సస్పెండ్ చేసే వీళ్లు రేపు అమరావతిలో జరిగే అసెంబ్లీలో ఏం చేస్తారోనని భయంగా ఉంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రక్షణ లేదు. నన్ను పోలీసులు కారులో ఎక్కించి నా సెల్‌ఫోన్ తీసుకున్నారు. నా గన్‌మెన్‌ను దించేశారు...ఇక నన్ను చంపెయ్యరని గ్యారంటీ ఏముంది? నేనే చనిపోతే నా పిల్లలకు దిక్కెవరు? విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటు తెలుగుదేశం మహానాడులా ఉందిగానీ, మహిళా సదస్సులా లేదు. కనీసం ఆ పోస్టర్లలో ఒక్క మహిళ ఫొటో అయినా ఉందా? సీఎం చంద్రబాబు, స్పీకర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఫొటోలున్నాయి...ఇదేనా మీ మహిళా సాధికారత?
గిరిజన ఎమ్మెల్యేలన్న గౌరవం కూడా లేదు
విదేశాల నుంచి వచ్చేవారికి ఫ్‌లైట్‌లు బుక్ చేశారు. పెద్ద పెద్ద హోటళ్లలో రూములు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను, స్కూలు విద్యార్థినులను సంతల్లో పశువుల్లాగా ప్రొక్‌లైనర్లలో ఎక్కించుకుని వెళతారా? ఇదేనా మహిళా పార్లమెంటు? (విద్యార్థినులను పొక్లైనర్లలో తీసుకెళుతున్న దృశ్యాలను మీడియాకు చూపించారు.) ఇవన్నీ చూస్తుంటే ఒక్క శాతం కూడా మహిళా సాధికారత సాధించలేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను పిలిచారు. చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య అయిన నారా బ్రాహ్మణిని పిలిచారు. వెంకయ్యనాయుడు కూతురు దీపా వెంకట్‌ను, కోడెల శివప్రసాదరావు కూతురు విజయలక్ష్మిని పిలిచి మాట్లాడించారు. మీకు భజన చేయించుకోవడానికా వీళ్లందరినీ పిలిచింది? మీకు నిజాయితీ ఉంటే బృందాకారత్‌నో, సామాజిక ఉద్యమకారిణి మేథాపాట్కర్‌నో పిలిచి మాట్లాడించి ఉండాల్సింది. ఆ ధైర్యం మీకు లేదు.
( చదవండి : నిస్సిగ్గుగా అరాచకం )
వెంకయ్య కూతురు, నారాబ్రహ్మణి తదితరులను ఏ హోదాతో పిలిచారు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను ఎందుకు పిలవలేదు? నాకు మణికొండ, నగరి రెండు చిరునామాలకు రెండు ఇన్విటేషన్లు పంపించారు. ఒకవేళ సదస్సుకు రాకపోయి ఉంటే మహిళల సమస్యలపై చిత్తశుద్ధిలేదని బురద జల్లుతారు. వస్తే ఇలా అడ్డుకున్నారు. నాపై అంటే గౌరవం లేదు, కనీసం మా పార్టీలో నలుగురు గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి కనీసం ఫోన్ చేసైనా మహిళా పార్లమెంటుకు రమ్మని పిలిచారా? ఇదేనా మీ మహిళా సాధికారత? బాబు రెండున్నరేళ్ల పాలనలో మహిళలపై జరిగిన అన్యాయాలు, అక్రమాలపై రాయాలంటే పెద్ద గ్రంథమే రాయాల్సి వస్తుంది. త్వరలో వీరికి ప్రజలే బుద్ధి చెబుతారు. డ్వాక్రా రుణ మాఫీ అన్నారు కానీ మాఫీ చెయ్యకుండా మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారు, బాబొస్తే జాబొస్తుందని చెప్పి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదివిన అమ్మాయిలకు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు నాకు అన్యాయం జరిగింది..రేపు మీ చెల్లికో, తల్లికో జరుగుతుంది...అందుకే అందరం కలిసి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం మెడలు వంచి, మహిళల హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది.
కన్నీటి పర్యంతమైన రోజా
మహిళా పార్లమెంటుకు వెళుతున్న తనను నిర్బంధించిన నేపథ్యంలో ఆర్కే రోజా ఆద్యంతం కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా సమావేశంలో ఉద్విగ్నంగా మాట్లాడుతూనే బోరున విలపించారు. ఒక మహిళ పట్ల పోలీసులు వ్యవహరించే తీరు ఇదా? వాళ్లు ఏం చేస్తారో తెలియదు, సెల్‌ఫోన్ లేదు, గన్‌మెన్‌ను దించేశారు. ఈ పరిస్థితుల్లో పోలీసుల మధ్య వెళ్లడం ఎలా ఉంటుందో ఊహించారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో తనకు అస్సలు రక్షణ లేదని, తనకు ఏమైనా జరిగితే తన పిల్లల పరిస్థితి ఏమిటని? గద్గద స్వరంతో ప్రశ్నించారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలపై జరిగిన అన్నిరకాల దాడులకు సంబంధించిన వివరాలను మీడియా ప్రతినిధులకు రోజా అందజేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ అణగదొక్కాలని చూడలేదు..
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిజంగా మగాడే...ఆ విషయం గట్టిగా చెప్పగలను. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను. పలు సమస్యలపై గళమెత్తాను. కానీ నన్ను ఏనాడూ వైఎస్ అణగదొక్కాలని చూడలేదు, ఒక మహిళా నాయకురాలిగా మాత్రమే చూశారు. అదే ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాచేత పదేళ్లపాటు పార్టీలో గాడిద చాకిరి చేయించుకుని, నేను ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తే ఒక్క పైసా ఇవ్వకుండా రెడ్డి కులస్తురాలినని ఓడించిన నీచ సంస్కృతి. నేను ఐదునెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బొబ్బిలి ఉప ఎన్నికలో పాల్గొన్నాను...కానీ ఆ కృతజ్ఞత కూడా బాబుకు లేదు. ఇలాంటి సెంటిమెంట్లన్నీ చంద్రబాబుకు ఉండవు. బాబుకు అనుకూలంగా తీర్పులు వస్తే కోర్టులు గొప్పవి. మాకు అనుకూలంగా వస్తే మాత్రం లెక్క చేయరు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, బోండా ఉమా కంటే నేనేమైనా ఎక్కువ మాట్లాడానా...నా లాంటి మహిళా శాసనసభ్యురాలికే అసెంబ్లీలో ఈ విధమైన పరిస్థితి ఉంటే సాధారణ మహిళలకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం ఉంటుందా?