ఆత్మస్థైర్యంతో అన్నింటా సగం
జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సులో వక్తల పిలుపు.. అట్టహాసంగా ప్రారంభం
పవిత్ర సంగమం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
‘అన్నింటా సగం.. అవకాశాల్లో సగం’ కోసం మహిళలు ఆత్మవిశ్వాసం, స్థైర్యంతో ముందడుగు వేయాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. మాతృత్వానికీ, మానవత్వానికీ చిహ్నమైన మహిళను చిన్నచూపు చూడవద్దని పురుషాధిక్య ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రాజకీయ, ఆర్థిక, సామాజిక భద్రతతోనే మహిళలకు సాధికారత అని నినదించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర సాంకేతిక సంస్థ(పూణే) సంయుక్తంగా ఏర్పాటు చేసిన తొలి జాతీయ మహిళా పార్లమెంట్ మూడు రోజుల సదస్సు శుక్రవారం విజయవాడకు సమీపంలోని పవిత్ర సంగమం వద్ద అట్టహాసంగా ప్రారంభమైంది. అంబేడ్కర్ కల గన్న 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు దక్కినప్పుడే పూర్తి సాధికారత లభించినట్టని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షోపన్యాసంలో చెప్పారు.
సదస్సును ప్రారంభించలేకపోయిన ప్రధాని
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించలేకపోయారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రభుత్వం మొదట ప్రకటించినా, వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందున హాజరు కాలేదని సమాచారం అందింది. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా సరే సదస్సును ప్రారంభింపజేసి, ప్రసంగించేలా చూడాలని నిర్వాహకులు భావించారు. అయితే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవహారాలు, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని అందుబాటులోకి రాలేదని సమాచారం. దీంతో సదస్సును దలైలామా, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇతర ప్రముఖులు కలసి సంయుక్తంగా ప్రారంభించారు.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి: ఏపీ సీఎం చంద్రబాబు
‘మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. కన్న కలల్ని సాకారం చేసుకునేందుకు కష్టపడాలి. మహిళా సాధికారత సాధించే వరకు నా ప్రభుత్వం మీతో ఉంటుంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించిన ఘనత తమ నాయకుడు ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నది తమ అభిమతమని చెప్పారు. మహిళలకు విద్యా, ఉపాధి రంగాలలో 35 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నామని, మహిళలు విద్యావంతులైతే వరకట్న సమస్యను అధిగమించవచ్చన్నారు. ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల రాయితీలు కుటుంబ పెద్దగా మహిళలకే ఇస్తున్నట్టు చెప్పారు.
రాజ్యసభలో బలముంటే ఇచ్చే వాళ్లమే: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
రాజ్యసభలో తమ పార్టీకి బలం ఉంటే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదింపజేసి ఉండేవాళ్లమని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వాలనే డిమాండ్‌కు తాము కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజాస్వామ్య మూలసూత్రాలను మరిచి చట్టసభలను జరగనివ్వకపోవడం మంచిది కాదన్నారు. ప్రతి మహిళలో ఓ పురుషుడు ఉన్నారని (మ్యాన్ ఇన్ ఉమెన్), పురుషాధిక్య సమాజంలో మహిళల్ని చిన్నచూపు చూడడం అమానుషమన్నారు. పురుషు లకు ఎంత ప్రాధాన్యత ఇచ్చినా ప్రపంచ వేదికపై మనకు మెడల్స్ తెచ్చి గౌరవాన్ని నిలిపింది మహిళలేనని పీవీ సింధూ తదితర ఒలంపిక్ విజేతలను ఉదహరించారు. కుటుంబం కోసం, పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్న అసంఘటిత రంగంలోని పేద మహిళలే గుర్తింపు లేని హీరోలన్నారు.
జనాభాలో 48 శాతం, సీట్లు 11 శాతం : ఇలాబెన్
దేశ జనాభాలో 48 శాతంగా ఉన్న మహిళలకు పార్లమెంట్‌లో కేవలం 11 శాతం మాత్రమే సీట్లున్నాయని, ఈ పరిస్థితి మారనిదే సమాజంలో మహిళలకు సమాన గౌరవం దక్కదని ప్రముఖ గాంధేయవాది ఇలాబెన్ భట్ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సాధికారత దక్కాలంటే పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు పరిపాలనలో భాగస్వామ్యం ఉండాల న్నారు. నిర్ణయాధికారం లేనిదే మహిళల సాధికారతకు అర్థం లేదని వివరించారు. శ్రీలంక విద్యావేత్త మేత్రేయి విక్రంసింఘే తన ప్రసంగంలో మహిళలు తమ కలలను నెరవేర్చు కునేందుకు ఉద్యమించాలని ఉద్బోధించారు. వక్తల ప్రసంగాల అనంతరం విదేశాల నుంచి వచ్చిన పలువుర్ని ఘనంగా సన్మానించారు. సదస్సులో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్, మిలిందా బిల్ గేట్స్ ఫౌండేషన్ డెప్యూటీ డైరెక్టర్ క్యాథరిన్ హే, శాసనమండలి చైర్మన్ డాక్టర్ ఎ చక్రపాణి, ఢిల్లీ శాసనసభ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ తదితరులు పాల్గొన్నారు.